విచారణల్లో వెలుగుచూసిన హైదరాబాద్ ఫిలింనగర్ భూ బాగోతాలు
x
ఫిలింనగర్

విచారణల్లో వెలుగుచూసిన హైదరాబాద్ ఫిలింనగర్ భూ బాగోతాలు

ఫిలింనగర్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ భూముల కేటాయింపుల్లో గోల్‌మాల్ జరిగింది.ఈ భూముల కేటాయింపుల్లో జరిగిన అక్రమాలపై ‘ఫెడరల్ తెలంగాణ’ అందిస్తున్న కథనం.


మద్రాస్ నుంచి తెలుగు సినీపరిశ్రమను హైదరాబాద్ నగరానికి తరలింపు ప్రక్రియలో భాగంగా అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 45 ఎకరాల ప్రభుత్వ భూములను ఫిలింనగర్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి కారు చౌకగా ఎకరం భూమి రూ.8,500లకే కేటాయించింది. సినిమా పరిశ్రమ రంగంలోకి వారికి ఇవ్వాల్సిన ప్రభుత్వ భూములు అనర్హులకు కేటాయించారు.టాలీవుడ్ సినిమా పరిశ్రమలోని కొందరు పెద్దలే భూ బాగోతాలకు పాల్పడ్డారు. ఈ భూబాగోతాలపై పలు విచారణలు జరిగినా సర్కారు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు.


ఫిలింనగర్‌లో సర్కారు భూముల కేటాయింపు జీఓ
మద్రాస్ నుంచి తెలుగు సినీపరిశ్రమను హైదరాబాద్ నగరానికి తరలించేందుకు వీలుగా అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ జిల్లా గోల్కొండ తాలూకా షేక్ పేట గ్రామంలోని బంజారాహిల్స్ మైక్రోవేవ్ టవర్ వద్ద 403వ సర్వేనంబరులోని 45 ఎకరాల ప్రభుత్వ భూమిని ఫిలింనగర్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి కేటాయిస్తూ 1980 ఏప్రిల్ 7వతేదీన జీఓఎంఎస్ నంబరు 1457 ను ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రభుత్వ భూమిని సినీ పరిశ్రమ అభివృద్ధికి ఉపయోగపడేలా కేటాయించాలని ఫిలింనగర్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి, ఏపీ స్టేట్ ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టరుకు సూచించింది.

మద్రాస్ నుంచి సినీపరిశ్రమను హైదరాబాద్‌కు తరలించేందుకు ప్రోత్సహకాలు
నాటి మద్రాస్, నేటి చెన్నై నగరం నుంచి తెలుగు సినీ పరిశ్రమను హైదరాబాద్ నగరానికి తరలించేందుకు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నెన్నో ప్రోత్సాహాకాలు ఇచ్చింది. సినిమా స్టూడియోలు,ఫిలిం లాబోరేటరీలు, సినిమా సాంకేతిక సంస్థలకు ప్రభుత్వ స్థలాలు కారుచౌకగా ప్రభుత్వం అప్పజెప్పింది.నాడు సినీ పరిశ్రమ అభివృద్ధి పేరిట స్థలాలు తీసుకున్న ఓ ప్రముఖ దర్శకుడు ఆ స్థలాన్ని సినీపరిశ్రమ అభివృద్ధికి వినియోగించకుండా కమర్షియల్ కాంప్లెక్సు నిర్మించారు. హోటళ్లు, వస్త్రాల దుకాణాలకు అద్దెకు ఇచ్చారు.దీంతో సినీపరిశ్రమ అభివృద్ధికి సర్కారు కేటాయించిన స్థలాలు దుర్వినియోగమయ్యాయి.

సినీరంగంలోని వారికి కారుచౌకగా సర్కారు ఇళ్ల స్థలాలు
సినీపరిశ్రమలో నటీనటులు,దర్శకులు, నిర్మాతలు,సాంకేతిక నిపుణులకు ఫిలింనగర్ పేరిట కాలనీని ఏర్పాటు చేసి ఇళ్ల స్థలాలు కూడా మార్కెట్ ధరల కంటే అతి తక్కువగా నామ మాత్రపు ధరలకు ఇచ్చి ప్రోత్సహించింది.ప్రభుత్వ భూములను సినిమా పరిశ్రమ అభివృద్ధి పేరిట ఎకరం కేవలం 8,5400 రూపాయలకు సర్కారు సొసైటీకి కేటాయించింది. ప్రస్థుతం ఫిలింనగర్ లో ఎకరం ధర వంద కోట్ల రూపాయల దాకా పలుకుతోంది. అన్యాక్రాంతం అయిన, అక్రమంగా కేటాయించిన వారి వద్ద నుంచి భూములను స్వాధీనం చేసుకొని వేలం ద్వారా విక్రయిస్తే ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షులు యం పద్మనాభరెడ్డి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.

భూబాగోతాలపై డీసీఓ డాక్టర్ ఎన్ కిరణ్మయి విచారణ
ఫిలింనగర్ భూముల కేటాయింపుల్లో జరిగిన అక్రమాలపై హైదరాబాద్ జిల్లా సహకార అధికారి డాక్టర్ ఎన్ కిరణ్మయి విచారణ నివేదికను అప్పటి కోఆపరేటివ్ రిజిష్ట్రార్, కమిషనరుకు సమర్పించినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. భూముల కేటాయింపులో సినీ పరిశ్రమకు సంబంధం లేని వ్యక్తులకు ఫిలింనగర్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో సభ్యత్వం కల్పించి వారికి స్థలాలు కేటాయించారు. సినీ పరిశ్రమ రంగానికి చెందిన వారికి ఇవ్వాల్సిన భూములను పప్పు బెల్లాల్లా పలువురు అనర్హులకు ధారాదత్తం చేశారు. బినామీపేర్లతో రియల్ ఎస్టేట్ వ్యాపారులకు భూములు ఇచ్చారు. సోసైటీ ప్లాట్ల కేటాయింపుల్లో నిబంధనలు పాటించలేదని దర్యాప్తులో వెల్లడైంది.

జూనియర్ డీసీఓ భాస్కరాచారి విచారణ నివేదిక
ఫిలింనగర్ భూముల కేటాయింపుల్లో జరిగిన అక్రమాలపై 2014వ సంవత్సరంలో అప్పటి సహకార శాఖ కమిషనర్ బి జనార్దన్ రెడ్డి విచారణకు ఆదేశిస్తూ జూనియర్ డీసీఓ భాస్కరాచారిని విచారణాధికారిగా నియమించారు. ఫిలింనగర్ సొసైటీలో 91 మంది సభ్యులు సినీరంగానికి సంబంధం లేని వారికి ప్లాట్లను విక్రయించారని దర్యాప్తులో తేలింది. సోసైటీ బైలాస్ ప్రకారం అనర్హులకు ఫిలింనగర్ సొసైటీలో ఇచ్చిన సభ్యత్వాలప తొలగించి వారిని అనర్హులుగా ప్రకటించాలని ఫిర్యాదులు రావడంతో విచారణ జరిపారు. విచారణలోనూ అనర్హులకే సభ్యత్వాలు ఇచ్చారని తేలింది.

విజిలెన్స్ విచారణ
ఫిలింనగర్ సొసైటీ భూముల కేటాయింపుల్లో జరిగిన అక్రమాలపై తెలంగాణ విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ విభాగం అధికారులు అలెర్ట్ నోట్ నంబర్ 52 (సి నంబరు 327విఅండ్ఈ/ఈ-3/2018)పేరిట జారీ చేశారు. విజిలెన్స్ అధికారులు విచారణ జరిపి నివేదికలు సమర్పించినా సర్కారులో చలనం లేదు.

ఫిలింనగర్ భూబాగోతాల విచారణ నివేదికలపై ఛర్యలేవి?
- ఫిలింనగర్ హౌసింగ్ సొసైటీ లో జరిగిన అక్రమాలపై సహకార చట్టం సెక్షన్ 51 ప్రకారం సహకార శాఖ సబ్ రిజిష్ట్రార్ వి భాస్కరాచారి విచారణ జరిపి నివేదికను ప్రభుత్వానికి సమర్పించినా, దీనిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. సొసైటీలో ఫ్లాట్స్ ను అనర్హులకు,సభ్యులు కాని వారికి కేటాయించినా ఎలాంటి చర్యలు లేవు. జీహెచ్ఎంసీ అప్రూవ్ డ్ ప్లాన్ కు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టారు. సొసైటీ దుర్వినియోగం అయినా చర్యలు లేవు.
- ఫిలింనగర్ హౌసింగ్ సొసైటీ లో జరిగిన అక్రమాలపై జస్టిస్ రాధాకృష్ణ రావు కమిషన్ విచారణ జరిగినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అసిస్టెంట్ కోఆపరేటివ్ రిజిష్ట్రార్ సి మాధవరావు విచారణ జరిపినా చర్యలు లేవని విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ నివేదిక వెల్లడించింది.
- గతంలో జీహెచ్ఎంసీ మున్సిపల్ కార్పొరేటరుగా కాజ సూర్యనారాయణ ఫిలింనగర్ హౌసింగ్ సొసైటీ కార్యదర్శిగా ద్విముఖ పాత్ర పోషించారని విజిలెన్స్ నివేదిక పేర్కొంది.

ఫిలింనగర్ భూబాగోతాలపై అసెంబ్లీ హౌస్ కమిటీ
ఫిలింనగర్ భూబాగోతాలపై అసెంబ్లీ హౌస్ కమిటీని నియమించినా, దీనిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అప్పటి ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఛైర్మన్ గా అప్పటి శాసనసభ్యులు బిగాల గణేష్, చింత ప్రభాకర్, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, గువ్వల బాలరాజు, టి జీవన్ రెడ్డి, ఎం గోపినాథ్, అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా, చింతల రామచంద్రారెడ్డి, అప్పటి ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, పొంగులేటి సుధాకర్ రెడ్డి, టి భానుప్రసాదరావు, కె జనార్దన్ రెడ్డిలతో ప్రభుత్వం అసెంబ్లీ హౌస్ కమిటీని నియమించింది.



పక్కదారి పట్టిన భూములను స్వాధీనం చేసుకోవాలి : ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్

ఫిలింనగర్ హౌసింగ్ సొసైటీ లో జరిగిన అక్రమాలపై తెలంగాణ విజిలెన్స్ కమిషన్, రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ డిమాండ్ చేసింది.సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం ఆయా రంగానికి కేటాయించాల్సిన ఫిలింనగర్ భూములను ఫిలిం ఇండస్ట్రీకి సంబంధం లేని బయటి వ్యక్తులకు అక్రమంగా ఇచ్చారని విచారణల్లో తేలింది. సొసైటీలో బోగస్ సభ్యుల వెయిటింగ్ లిస్టు తయారు చేశారని, బయటి వ్యక్తులకు భూములను బదలాయించారని కూడా దర్యాప్తుల్లో వెలుగుచూసింది. విచారణ నివేదికలపై చర్యలు తీసుకొని అనర్హులకు కేటాయించిన, వారి చేతుల్లో ఉన్న భూములను రద్దు చేసి వాటిని ప్రభుత్వమే స్వాధీనం చేసుకొని వేలం ద్వారా విక్రయిస్తే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షులు యం పద్మనాభరెడ్డి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. అసలే ఆర్థిక కష్టాల్లో ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి దీని ద్వారా ఆదాయం పొందవచ్చని ఆయన సూచించారు.


Read More
Next Story