
కిక్కిరిసిన హైదరాబాద్-విజయవాడ హైవే
12 గంటల్లో 70వేల వాహనాలు ఏపీ వైపు వెళ్లాయన్న అధికారులు.
సంక్రాంతి సందర్భంగా ప్రజలు పల్లెబాట పట్టారు. తమ సొంత ఊళ్లకు బయలు దేరారు. కానీ ట్రాఫిక్ భూతం వాళ్లకు అడ్డుగా నిలిచింది. సంక్రాంతి నేపథ్యంలో హైదరాబాద్ నుంచి భారీ సంఖ్యలో ప్రజలు ఏపీకి తరలి వెళ్తున్నారు. దీంతో హైదరాబాద్-విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. గంటల తరబడి ట్రాఫిక్‌లో వేయిచూడాల్సి వస్తుంది. ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్తున్న వాహనాల సంఖ్య ఒక్కసారిగా భారీగా పెరిగింది.
వాహనాల సంఖ్య పెరగడంతో టోల్ ప్రాజాల్లో బూత్‌ల సంఖ్యను పెంచారు అధికారులు. అయినా ట్రాఫిక్ ముందు సాగడంలో వేగం మాత్రం పెద్దగా కనిపించడం లేదు. అధికారులు చెప్పిన దాని ప్రకారం.. శనివారం సాయంత్ర 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు అంటే 12 గంటల్లో 70వేల వాహనాలు ఏపీ వైపుకు వెళ్లాయి. ఆదివారం ఈ రద్దీ మరో రెండింతలు పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
వాహనాల రద్దీ కారణంగా టోల్ ప్లాజా దగ్గర ఫాస్టాగ్ స్కానింగ్ వేగంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు అధికారులు. దాంతో పాటుగా టోల్ కట్టే వారి దగ్గర కూడా ఆలస్యం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. దాంతో పాటుగా టోల్ ప్లాజా దగ్గర పెట్రోలింగ్ వాహనం, క్రేన్, అంబులెన్స్‌ను కూడా అందుబాటులో ఉంచారు అధికారులు. హైదరాబాద్ వైపు నుంచి పంతంగి, కొర్లపహాడ్, చిల్లకల్లు టోల్ ప్లాజాల దగ్గర ట్రాఫిక్ భారీగా ఉంది. అదే విధంగా ఏపీలోని నందిగామ దగ్గర కూడా ట్రాఫిక్ జామ్ భారీగా ఉంది. రోడ్డు నిర్మాణం కారణంగా వైజంక్షన్ దగ్గర వాహన రాకపోకలకు అంతరాయం కలుగుతుందని అధికారులు వివరించారు. ఆ అంతరాయాలను తొలగించేలా, వాహనాల రాకపోకలు సజావుగా సాగేలా చర్చలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
కిటకిటలాడుతున్న బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు
ఒకవైపు వ్యక్తిగత వాహనాల్లో ఊళ్లకు వెళ్తున్న వారితో హైవేలు రద్దీగా మారితే మరోవైపు పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్ ద్వారా ఊళ్లకు వెళ్లే వారితో హైదరాబాద్‌లోని బస్టాండ్‌లు, రైల్వేటేషన్‌లు కిటకిటలాడుతున్నాయి. ప్రయాణికులతో ప్రధాన బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్‌లు కిక్కిరిసిపోయాయి. గడిచిన మూడు రోజుల్లో సుమారు 30 లక్షల మందికిపైగా ప్రయాణికులు తమ స్వగ్రామాలకు తరలివెళ్లినట్లు అధికారులు తెలిపారు.
దిల్‌సుక్ నగర్, ఉప్పల్, ఎల్‌బీనగర్, హయత్ నగర్, జేబీఎస్ బస్టాండ్లలో ప్రయాికుల తాకిడి భారీగా ఉంది. అన్ని బస్టాండ్లు ప్రయాణికులతో నిండిపోయాయి. బస్సులు ఆలస్యం అవుతుండటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. మహిళలు, వృద్ధులు, చిన్నారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.

