కెనడా ఆలయంపై దాడిని ఖండించిన హైదరాబాద్ మేథావులు
x

కెనడా ఆలయంపై దాడిని ఖండించిన హైదరాబాద్ మేథావులు

కెనడాలోని హిందూ దేవాలయంపై జరిగిన దాడిని హైదరాబాద్‌ నగరానికి చెందిన మేధావులు ఖండించారు.ఈ ఘటనపై వివిధ సంఘాల ప్రతినిధులు,యాక్టివిస్టులు ఆందోళన వ్యక్తం చేశారు.


కెనడా దేశంలోని బ్రాంప్టన్‌లోని హిందూ సభా దేవాలయం వద్ద భక్తులపై ఖలిస్తానీ తీవ్రవాదులు జరిపిన హింసాత్మక దాడి ఘటనపై హైదరాబాద్ నగరానికి చెందిన పౌరులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. భారతదేశంలోని హైదరాబాద్‌లోని పలు సంఘాల ప్రతినిధులు మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో తాము ఆందోళన చెందుతున్నట్లు చెప్పారు.

- ప్రపంచంలో ఎక్కడైనా ప్రజలందరికీ శాంతియుతంగా వారి విశ్వాసాలను పాటించే హక్కు, స్వేచ్ఛ ఉందని, ఈ హక్కును రక్షించడం అవసరమని హైదరాబాద్ మేధావులు పేర్కొన్నారు. ఆలయంపై దాడి చేసిన వారిపై తక్షణం చర్య తీసుకోవడం ప్రతి ప్రభుత్వం, ప్రతి సమాజం బాధ్యత అని వారు పేర్కొన్నారు. తమ విశ్వాసాన్ని శాంతియుతంగా ఆచరిస్తున్న వ్యక్తులపై ఏ రూపంలోనైనా హింసకు ఎలా పాల్పడతారని వారు ప్రశ్నించారు.

ఆలయంపై దాడి చేసిన వారిపై చర్య తీసుకోండి
కెనడా దేశంలోని ఆలయంపై దాడి చేసిన వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ మేధావులు డిమాండ్ చేశారు. ఇలాంటి హేయమైన దాడులు మళ్లీ పునరావృతం కాకుండా కెనడియన్ ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
ఈ బహిరంగ లేఖలో సంతకం చేసినవారిలో కోవా స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు మజర్ హుస్సేన్,ప్రొఫెసర్. రమా మెల్కోటేమానవ హక్కుల వేదిక ప్రతినిధి ఎస్. జీవన్ కుమార్,ప్రొఫెసర్ . షౌకత్ హయత్, డాక్టర్ మహతాబ్, శాస్త్రవేత్త బామ్జీ,కె. సజయ,న్యాయవాదులు అఖండ్,ఎంఏ షకీల్, ప్రొఫెసర్ హెచ్ ఖతీజా బేగం,కె బాబు రావు,అమన్ వేదిక ప్రతినిధి అంబిక, శాంతి ప్రమోటర్ సాయినాథ్ తదితరులున్నారు.


Read More
Next Story