
ఓపెన్ ఏఐకి హైదరాబాద్ బెస్ట్ ప్లేస్
ఇండియాలో ఓపెన్ ఏఐ ఆఫీసుపై ఆల్ట్‌మన్‌కు కేటీఆర్ విజ్ఞప్తి.
ఓపెన్ ఏఐ ఇండియా క్యాంపస్‌కు హైదరాబాద్ బెస్ట్ ప్లేస్ అని మాజీ మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓపెన్ ఏఐ కార్యకలాపాలు నడపటం కోసం హైదరాబాద్‌లో అన్ని సౌకర్యాలు ఉన్నాయని కేటీఆర్ చెప్పారు. కాబట్టిన తమ భారతదేశ కార్యకలాపాల కోసం ఏర్పాటు చేసే కార్యాలయాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్(ట్విట్టర్) వేదికగా పోస్ట్ పెట్టారు. కేటీఆర్ విజ్ఞప్తిపై శామ్ ఆల్ట్‌మన్ ఇప్పటివరకు స్పందించలేదు. కానీ అతిత్వరలోనే ఇండియాలో తమ ఆఫీసును ఏర్పాటు చేస్తామని ఆల్ట్‌మన్ చెప్పారు.
హైదరాబాద్‌లో ఇప్పటికే మైక్రోసాఫ్ట్, అమెజాన్, గూగుల్, మెటా, యాపిల్, క్వాల్‌కామ్ వంటి అనేక దిగ్గజ టెక్ సంస్థలు తమ కార్యాలయాలను ఏర్పాటు చేసుకుని ఉన్నాయి. వాటితో పాటు టెక్ పరంగా స్టార్టప్‌ల విషయంలో కూడా హైదరాబాద్ ముందంజలో ఉంది. అన్ని రంగాల్లో హైదరాబాద్‌కు అపారమైన అనుభవం, ప్తిభ ఉందని కేటీఆర్ చెప్పారు. గత దశాబ్ద కాలంగా తెలంగాణ ప్రభుత్వం.. దేశానికి ఏఐ రాజధానిగా నిలవడానికి అనేక సాహసోపేతమైన చర్యలు తీసుకుటుందని ఆయన చెప్పుకొచ్చారు. 2020ని ఇయర్ ఆఫ్ ఏఐగా ప్రకటించడం వెనక ఇటువంటి నిర్ణయాలు అనేకం ఉన్నాయని వివరించారు. హైదరాబాద్‌లో ఉన్న ప్రతిభ, ఇన్నొవేషన్, ఆవిష్కరణలు, గ్లోబల్ కనెక్టివిటీల కలయికతో ఏఐ విప్లవాన్ని ముందుకు నడిపిస్తుందని కేటీఆర్ తెలిపారు.
ఇదిలా ఉంటే సెప్టెంబర్ నెలలో తాను ఇండియాలో పర్యటిస్తానని ఆల్ట్‌మన్ వెల్లడించారు. ఆ సమయంలోనే దేశంలో తమ ఆఫీసు ఎక్కడపెట్టాలన్న అంశాన్ని కూడా పరిశీలించే అవకాశం ఉందని వివరించారు. ఈ నేపథ్యంలో ఆల్ట్‌మన్‌ను కేటీఆర్.. హైదరాబాద్‌కు స్వాగతించారు. భారతదేశంలోనే అత్యంత శక్తివంతమైన ఇన్నోవేషన్ పర్యావరణ వ్యవస్థను కలిగి ఉందని, ఇందులో T-Hub, WE-Hub, T-Works, తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్, రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్ వంటివి ఉన్నాయని చెప్పుకొచ్చారు.