
హుసేన్ సాగర్ లో కలుషితమైన నీరు (ఫైల్ ఫొటో)
Hyderabad lakes|సరస్సుల్లో విషపూరిత లోహాలు,బిట్స్ పరీక్షల్లో వెల్లడి
హైదరాబాద్ లోని ప్రధాన సరస్సుల్లో నీరు భారీ లోహాలతో విషపూరితమైంది.హుసేన్ సాగర్,శామీర్ పేట,కాప్రా చెరువుల్లో నీటిని బిట్స్ పరీక్షించగా ఈ చేదు నిజం వెల్లడైంది.
హైదరాబాద్ నగరంలో మూడు ప్రధాన చెరువులు కాలుష్య కాసారాలుగా మారాయని తాజాగా హైదరాబాద్ బిట్స్ విద్యార్థులు జరిపిన పరీక్షల్లో తేలింది.(Hyderabad lakes) హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న హుసేన్ సాగర్, కాప్రా చెరువు, శామీర్ పేట చెరువుల్లోని నీటి శాంపిళ్లను బిట్ పరిశోధకులు సేకరించి వారి ల్యాబరేటరీలో పరీక్షలు చేశారు. ఈ మూడు చెరువుల నీటిలో విషపూరిత భారీ లోహాలున్నాయని (Toxic metals) పరీక్షల్లో(BITS tests) వెలుగుచూసింది.
నీటిలో ప్రమాదకర లోహాలు...
మూడు ప్రధాన చెరువుల్లోనూ ప్రమాదకరమైన సీసం, కాడ్మియం, పాదరసం,రాగి లోహాలున్నాయని బిట్స్ పరిశోధకులు జరిపిన పరీక్షల్లో తేలింది. హుస్సేన్‌సాగర్, కాప్రా, శామీర్‌పేట్ సరస్సుల (Hussain Sagar, Shamirpet, Kapra Lake) నుంచి వచ్చిన నీటి నమూనాల్లో కాడ్మియం 0.99 మైక్రోగ్రాములు, సీసం 0.62,రాగి 1.38,పాదరసం 0.72 మైక్రో గ్రాములు ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. బిట్స్ ప్రొఫెసర్ సంకేత్ గోయెల్ ఆధ్వర్యంలో జరిపిన నీటి నాణ్యత పరీక్షల్లో భారీ లోహాలున్నాయని వెల్లడైంది.బిట్స్ జరిపిన ఈ పరిశోధనలపై వ్యాసాన్ని ఎన్ పీ జే క్లీన్ వాటర్ అనే పరిశోధన జర్నల్ ప్రచురించింది.
కాలుష్య కాసారాలు...ఈ చెరువులు
హైదరాబాద్ నగరంలోని హుస్సేన్‌సాగర్, కాప్రా, శామీర్‌పేట్ సరస్సులే కాకుండా పలు చెరువుల్లోకి డ్రైనేజీ నీటితోపాటు కాలుష్య కారక పరిశ్రమలు వెదజల్లుతున్న కలుషిత నీరు కలుస్తుందని పర్యావరణ యాక్టివిస్టు, కాంగ్రెస్ నాయకురాలు డాక్టర్ లుబ్నా సార్వత్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. సరస్సుల నీటిలో విషపూరితమైన కేన్సర్ కారక భారీ లోహాలు ఉండటం ప్రజలకు ముప్పుగా మారిందని డాక్టర్ లుబ్నా ఆందోళన వ్యక్తం చేశారు.
భూగర్భజలాలు కూడా కలుషితం
చెరువుల్లోని నీరు కలుషితం అయి భూగర్భజలాలు సైతం రంగు మారి కలుషిత నీరే బోర్లలోనూ వస్తుందని ఆమె చెప్పారు. పరిశ్రమలు వెదజల్లుతున్న కెమికల్ నీరు చెరువుల్లో కలవడం వల్ల నురుగు వస్తుందని, ఇది చాలా ప్రమాదకరమని ఆమె చెప్పారు. నగరంలో ఉన్న చెరువులను శుభ్రంగా ఉంచుకోకుండా కలుషితం చేసి దూర ప్రాంతాల నుంచి గోదావరి, కృష్ణా జలాలను తాగేందుకు నగరానికి తెచ్చుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయన్నారు. బిట్స్ పరిశోధకులు వెల్లడించిన నివేదకను చూసి కాలుష్య నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డాక్టర్ లుబ్నా డిమాండ్ చేశారు.
Next Story