హైదరాబాదీలకు తీయటి వార్త, ముందుగానే మొదలైన మామిడి సీజన్
x
Mangos

హైదరాబాదీలకు తీయటి వార్త, ముందుగానే మొదలైన మామిడి సీజన్

పండ్లలో రారాజుగా పేరొందిన మామిడిపండ్లు చూస్తే ఎవరికైనా నోరూరుతుంది. తియ్యదనంతోపాటు ఎన్నెన్నో ఖనిజాలున్న మామిడిపండ్లు హైదరాబాద్ మార్కెట్‌ను ముంచెత్తాయి.


వేసవి కాలం వచ్చిందంటే మామిడి ప్రియులకు శుభవార్త. హైదరాబాద్ నగరంలోని మార్కెట్‌లోకి ఈ ఏడాది ముందుగానే వచ్చిన మామిడి పండ్లు మామిడిప్రియులకు తియ్యదనాన్ని అందిస్తున్నాయి. ఆరోగ్యానికి మేలు చేసే మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, విటమిన్ ఎ బీటా కెరోటిన్, పోటాషియం, మెగ్నీషియం, కాల్షియం ఖనిజాలున్న మామిడిపండ్లకు ఈ సీజనులో గిరాకీ పెరిగింది. గత ఏడాది కంటే ముందుగానే ఫిబ్రవరి నెలలోనే మామిడిపండ్ల సీజన్ ప్రారంభమైంది. హైదరాబాద్ నగరంలోని హయత్‌నగర్‌ బాటసింగారం మార్కెట్‌తో పాటు కుషాయిగూడ, బోయినపల్లి, జాంబాగ్‌, గుడిమల్కాపూర్‌ మార్కెట్లకు మామిడిపండ్లు భారీగా వచ్చాయి.

తెలంగాణలోని మహబూబ్‌నగర్‌, వనపర్తి, రంగారెడ్డి, ఖమ్మం, వికారాబాద్‌, తాండూర్, పరిగి, జహీరాబాద్, నాగర్‌కర్నూల్‌, మంచిర్యాల, నల్గొండ, సూర్యాపేట, వరంగల్‌, గద్వాల్‌ నుంచి రైతులు, మధ్య దళారులు మామిడిపండ్లను లారీల్లో పండ్ల మార్కెట్ కు తీసుకువచ్చి విక్రయిస్తున్నారు. తెలంగాణ నుంచే కాకుండా పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నుంచి అనంతపురం, కృష్ణా, పశ్చిమగోదావరి, కర్నూలు జిల్లా, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి పండ్లు వస్తున్నాయి.

మామిడిపండ్లలో ఎన్నెన్నో రకాలు
మామిడిపండ్లలో ఎన్నెన్నో రకాలు నోరూరిస్తున్నాయి. మామిడి ప్రేమికులు బంగినపల్లి, కేసర్, హిమాయత్, తోటాపరి, దశేరి, సుందరి, పెద్ద, చిన్న రసాలు, సుందరి, తోతాపురి, చిత్తూర్,మల్లిక, లంగడ, అల్ఫోన్సో...ఇలా మరెన్నో రకాల మామిడి పండ్లు మార్కెట్ కు వస్తున్నాయి. అవకాయ పచ్చడి ప్రియులు పచ్చడి మామిడి కాయలను హైదరాబాద్ నగరంలోని పలు మార్కెట్లలో కొనుగోలు చేస్తున్నారు.

గతంలో కంటే పెరిగిన మామిడిపండ్ల లారీలు
గతంలో కంటే ఈ ఏడాది హైదరాబాద్ పండ్ల మార్కెట్ కు వచ్చే మామిడిపండ్ల లారీల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2022వ సంవత్సరం ఏప్రిల్ నెలలో 3,270 మామిడిపండ్ల లారీల్లో 69,768 క్వింటాళ్ల పండ్లు వచ్చాయి. 2023వ సంవత్సరంలో 7,626 లారీల్లో 1,66,203 క్వింటాళ్ల పండ్లకు పెరిగింది. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో అనూహ్యంగా 7,825 లారీల్లో 1,62,996 క్వింటాళ్ల మామిడిపండ్లు వచ్చాయి. గత నెలలో 11,000మెట్రిక్ టన్నుల మామిడిపండ్లు మార్కెట్ కు వచ్చాయని, ఈ నెలలో ఇప్పటివరకు 9,300 మెట్రిక్ టన్నుల పండ్లు వచ్చాయని బాటసింగారం పండ్ల మార్కెట్ కమిటీ సెలక్షన్ గ్రేడ్ సెక్రటరీ చిలకా నర్సింహారెడ్డి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.

ఇతర రాష్ట్రాలకు రవాణ
తెలంగాణ రాష్ట్రంలో దిగుబడి అయిన మామిడిపండ్లలో 60 శాతం ఢిల్లీ, హర్యానా,ముంబయి,ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలకు రవాణ చేస్తున్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో మామిడిపండ్లకు గిరాకీ బాగా ఉండటంతో పాటు ధర కూడా అధికంగా వస్తుండటంతో మామిడిపండ్లను అక్కడికి రవాణ చేస్తున్నారు. ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల మామిడిపండ్లకు ఉత్తరాదిలో డిమాండ్ బాగా ఉంది.

పెరిగిన ధరలు
హోల్ సేల్ మార్కెట్ లో టన్ను మామిడి పండ్ల ధర రిటైల్ గా మాత్రం కిలో ధర రూ.120 నుంచి 140 రూపాయల దాకా ఉంది. మరికొద్ది వారాల్లో మామిడి పండ్ల లారీలు ఎక్కువగా వస్తాయని పండ్లమార్కెట్ అధికారులు అంచనా వేస్తున్నారు. మార్కెటుకు అధిక లారీలు వస్తే మామిడిపండ్ల ధరలు కిలో రూ.80 నుంచి 100రూపాయలకు తగ్గవచ్చని అంచనా వేస్తున్నారు. బంగినపల్లి రకం మామిడిపండ్ల టన్ను ధర 25వేలరూపాయల నుంచి లక్ష రూపాయల దాకా పలుకుతోంది. అదే హిమాయత్ రకం పండ్ల ధర గురువారం బాటసింగారం మార్కెట్ లో టన్ను రూ.50వేల నుంచి 1,35,000రూపాయల దాకా పలికింది.

తగ్గిన మామిడి దిగుబడి
ఈ ఏడాది తెలంగాణలో మామిడిపండ్ల దిగుబడులు తగ్గాయి. పూత రాలిపోవడంతో దిగుబడి తగ్గిందని, కానీ మార్కెట్ ధరలు బాగా ఉండటంతో తాము నష్టాల నుంచి కోలుకుంటున్నామని నల్గొండ జిల్లాకు చెందిన మామిడి రైతు గంజి పరమేశ్వర్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.వడగళ్ల వర్షం, చలిగాలుల ప్రభావం వల్ల మామిడి పూత రాలి దిగుబడి తగ్గిందని మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మరో మామిడి రైతు వెలిచాల సోమశేఖర్ రావు తెలిపారు.పెట్టుబడులు పెరిగాయని, కానీ మార్కెట్ లో ధర పలుకుతుండటంతో బాటసింగారం పండ్లమార్కెట్ లో రైతులు సంతోషం వ్యక్తం చేశారు.

విదేశాలకు ఎగుమతి
కేసర్, హిమాయత్, దశేరి, అల్ఫోన్సో రకాల మామిడిపండ్లు విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణాజిల్లా నుంచి మేలురకమైన మామిడిపండ్లను విదేశాలకు రవాణ చేస్తున్నారు. విదేశాలకు ఎగుమతి చేస్తున్న మామిడిపండ్లకు టన్నుకు రూ.1,35,000నుంచి రెండు లక్షల రూపాయల దాకా ధర వస్తుందని కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు చెందిన మామిడి రైతు నెట్ట్యం రత్నశేఖర్ బాబు చెప్పారు.

జులై 5వతేదీతో ముగియనున్న మామిడిపండ్ల సీజన్
ఈ ఏడాది ముందుగా ఫిబ్రవరి నెలలోనే మామిడిపండ్ల సీజన్ ప్రారంభమైనా జులై 5వతేదీతో ముగుస్తుందని బాటసింగారం పండ్ల మార్కెట్ కమిటీ స్పెషల్ గ్రేడ్ కార్యదర్శి చిలకా నర్సింహారెడ్డి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ఏప్రిల్ చివరి వారంలో, మే మొదటి వారంలో మార్కెట్ కు మామిడిపండ్లు అధికంగా వస్తాయని, దీంతో ధరలు దిగివస్తాయని నర్సింహారెడ్డి అంచనా వేశారు.


Read More
Next Story