
మెట్రో సిబ్బందిగా ట్రాన్స్ జెండర్లు
ట్రాన్స్‌జెండర్లకు ఉపాధి కల్పించడంలో మరో కీలక అడుగు వేసిన తెలంగాణ ప్రభుత్వం.
ట్రాన్స్‌జెండర్లకు ఉపాధి కల్పించడంలో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. మెట్రో స్టేషన్ భద్రతా సిబ్బందిగా మంగళవారం పలువురు ట్రాన్స్‌జెండర్లను నియమించారు. ఈ విషయాన్ని హైదరాబాద్ మెట్రో యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది. సమాజంలోని అన్ని వర్గాల వారికి సమానమైన అవకాశాలు, సాధికారతను అందించడం లక్ష్యంగానే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని మెట్రో అధికారులు వెల్లడించారు. 20 మంది ట్రాన్స్‌జెండర్లకు శిక్షణ ఇచ్చి.. కొన్ని ఎంపిక చేసిన మెట్రో స్టేషన్లలో వీరిని విధుల్లో ఉంచినట్లు చెప్పారు.
ప్రస్తుతం నగరంలోని మెట్రోలో ప్రయాణించే వారిలో 30శాతం మంది మహిళలే అని మెట్రో తెలిపింది. వారి భద్రతకు అత్యధిక ప్రాదాన్యత ఇస్తున్నామని, ఆ మేరకే భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు చెప్పారు. వాటిలో భాగంగానే ట్రాన్స్‌జెండర్లను భద్రతా సిబ్బందిగా నియమించడం జరిగిందని తెలిపారు. వీరు మహిళల కోచ్‌లో వేరే వారు ఎక్కకుండా చర్యలు తీసుకుంటారని అధికారులు చెప్పారు.
అయితే గతంలో తెలంగాణ ట్రాఫిక్ పోలీస్ అసిస్టెంట్లుగా కూడా ట్రాన్స్ జెండర్లకు అవకాశం కల్పించారు. దాదాపు 40 మంది ట్రాన్స్‌జెండర్లకు శిక్షణ ఇచ్చి వారికి ఉపాధి కల్పించారు. హైదరాబాద్‌లో విపరీతంగా ఉంటున్న ట్రాఫిక్‌ను కంట్రోలో చేయడం కోసం ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేయాలను నిర్ణయించుకుంది. ఈ టీమ్‌లలో ట్రాన్స్ జెండర్లను నియమించాలని పోలీసు శాఖకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. వాటి ప్రకారమే ఆసక్తి, అర్హత ఉన్న ట్రాన్స్ జెండర్లను పోలీసులు రిక్రూట్ చేసుకున్నారు. వారికి పూర్తి శిక్షణ ఇచ్చి వారిని ఉద్యోగాల్లోకి చేర్చుకుంటున్నారు.
గతేడాది డిసెంబర్ 23న 39 మంది ట్రాన్స్‌జెండర్లు ట్రాఫిక్ అసిస్టెంట్లుా డ్యూటీలోకి వచ్చారు. ఈ విషయాన్ని అదే రోజున ఆనాటి హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. ఇలా చేయడం ద్వారా సమాజంలో ట్రాన్స్ జెండర్లు అంటే ఉండే చిన్నచూపు లేకుండా చేయొచ్చని ఆశిస్తున్నామని అన్నారు.
‘‘ట్రాన్స్ జెండర్లపై వివక్ష వద్దు. వారిని వేరే విధంగా చూస్తూ ఇబ్బంది పెట్టకుండా.. వారు కూడా సమాజంలో కలిసిపోయేలా మనవంత ప్రయత్నం చేద్దాం. సీఎం సూచన, చొరవతోనే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కింది. ఇందులో భాగంగా ట్రాన్స్ జెండర్లను ట్రాఫిక్ విధుల్లోకి నియమించే ప్రాజెక్ట్‌ను 6నెలల పైలెట్ ప్రాజెక్ట్ చేపట్టాం. ఇది సక్సెస్ అయితే మరికొన్ని శాఖల్లో కూడా వారికి అవకాశం లభించొచ్చు. ఈ ఆలోచన కారణంగా ప్రస్తుతం దేశమంతా హైదరాబాద్ వైపు చూస్తోంది. హైదరాబాద్‌లో ఈ విధానం విజయవంతమైతే దేశంలోని ఇతర రాష్ట్రాలు కూడా ట్రాన్స్ జెండర్లకు అవకాశాలు కల్పించే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్ట్ విజయవంతం కావాలి. ఇందులో అవకాశాన్ని అందిపుచ్చుకున్న ప్రతి ఒక్కరూ దానిని సద్వినియోగం చేసుకోవాలి’’ అని సీవీ ఆనంద్ ఆనాడు సూచించారు. కాగా ఇప్పటికే ట్రాఫిక్ అసిస్టెంట్లుగా ట్రాన్స్‌జెండర్లను నియమించి ఏడాది అయింది. వారి విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

