
నలుగురు పాకిస్థానీయులకు పోలీసులు నోటీసులు
హైదరాబాద్ , సైబరాబాద్, రాచకొండ మూడు కమిషనరేట్‌లలో కలిపి దాదాపు 213 మంది పాకిస్తానీలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
భారత్, పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఇరు దేశాలు పరస్పరం పలు ఆంక్షలు విధించుకుంటున్నాయి. ఈ క్రమంలో భారత్‌కు వచ్చిన పాకిస్థాన్ పౌరుల వీసాలను సస్పెండ్ చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇదే విషయాలన్ని తెలుపుతూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా.. అన్ని రాష్ట్రాల సీఎంలతో ఫోన్‌లో మాట్లాడారు కూడా. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో ఉన్న పాకిస్థాన్ పౌరులంతా కూడా ఈ నెల 30 వరకు దేశం విడిచి వెళ్లాలని డీజీపీ జితేందర్ హెచ్చరించారు. ఇంతలోనే నలుగురు పాకిస్థాన్ పౌరులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఆ నలుగురు కూడా షార్ట్ టర్మ్ వీసా(STV) వీసాలతో దేశానికి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. వారు నలుగురు కూడా ఆదివారం లోపు హైదరాబాద్ విడిచి వెళ్లాలని పోలీసులు తమ నోటీసుల్లో పేర్కొన్నారు.
హైదరాబాద్ , సైబరాబాద్, రాచకొండ మూడు కమిషనరేట్‌లలో కలిపి దాదాపు 213 మంది పాకిస్తానీలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వీరిలో 4 గురు షార్ట్ టర్మ్ వీసా మినహాయిస్తే మిగతా అందరికీ లాంగ్ టర్మ్ వీసాలు (LTV) ఉన్నట్టు గుర్తించారు. లాంగ్ టర్మ్ వీసా లు కలిగిన పాకిస్తానీలకు మినహాయింపు కేంద్రం ఇచ్చింది. దీంతో షార్ట్ టర్మ్ వీసా కలిగిన నలుగురు పాకిస్థానీలకు హైదరాబాద్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇదిలా ఉంటే పహల్గామ్ ఉగ్రదాడిలో పాకిస్థాన్ హస్తం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకున్నా తాము కేంద్రానికి మద్దతుగా ఉంటామని హామీ ఇస్తున్నాయి.
ఈ క్రమంలోనే ఇలాంటి ఘటనలు పునరావృత్థం కాకూడదంటే భారత్ కఠినంగా వ్యవహరించాలని తెలంగాణ సీఎం రేవంత్ కూడా వ్యాఖ్యానించారు. పాకిస్థాన్ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకున్నా తమ పార్టీ కేంద్రానికి అండగా నిలుస్తుందని తెలిపారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కూడా పాకిస్థాన్‌పై తీసుకోవాల్సిన చర్యలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. భారత్ తీసుకునే చర్యలు పాకిస్థాన్ వెన్నులో వణుకుపుట్టించేలా ఉండాలని అన్నారు. తుపాకీ పట్టినోడు చివరకు ఆ తుపాకీకే బలికాక తప్పదని హెచ్చరించారు. ఉగ్రవాదాన్ని అంతమొందించడానికి మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందులో భాగంగా ఇప్పుడు పాకిస్థాన్‌పై తీసుకునే చర్యలు వెన్నులో వనుకుపుట్టించేలా ఉండనున్నాయని వ్యాఖ్యానించారు.