తప్పుడు ప్రచారాలు వద్దు.. నెటిజన్స్‌కు పోలీసుల స్ట్రాంగ్ వార్నింగ్
x

తప్పుడు ప్రచారాలు వద్దు.. నెటిజన్స్‌కు పోలీసుల స్ట్రాంగ్ వార్నింగ్

సంధ్య థియేటర్ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తోంది. ఈ అంశంపై అనేక విషయాలకు సంబంధించి సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి.


సంధ్య థియేటర్ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తోంది. ఈ అంశంపై అనేక విషయాలకు సంబంధించి సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. అల్లు అర్జున్‌ థియేటర్‌లోకి రావడానికి ముందుగానే తొక్కిసలాట జరిగిందని కొందరు ప్రచారం చేస్తుంటే మరికొందరు అల్లు అర్జున్.. వచ్చిన తర్వాతే తొక్కిసలాట జరిగిందని అంటున్నారు. ఈ క్రమంలోనే సంధ్య థియేటర్ ఘటనపై అనేక ప్రచారాలు జరుగుతున్న క్రమంలో వీటిపై తాజాగా హైదరాబాద్ పోలీసులు స్పందించారు. సంధ్య థియేటర్ ఘటనపై తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ మేరకు అధికారిక ప్రకటన ఒకటి విడుదల చేశారు. సంధ్య థియేటర్ ఘటనలో ఏదైనా సమాచారాన్ని ప్రచారం చేసే ముందు ఒకసారి వాటిని వాస్తవాలతో ధృవీకరించుకోవాలని, లేని పక్షంలో కఠిన చర్యలు ఎదుర్కోవడానికి సిద్ధం కావాలని తెలిపారు.

‘‘తొక్కిసలాట ఘటనపై సోషల్ మీడియాలో తప్పుడు సమాచారంతో పాటు ప్రజలను అపోహలకు గురి చేసేలా వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. వాటిపై కఠిన చర్యలు తీసుకుంటాం. నటుడు అల్లు అర్జున్ రాకముందే తొక్కిసలాట జరుగుతున్నట్లు కొందరు తప్పుడు వీడియోలు పోస్ట్ చేసిన అంశం మా దృష్టికి వచ్చింది. ఈ ఘటనై విచారణ క్రమంలో తెలిసిన నిజాలను వీడియో రూపంలో పోలీసు శాఖ ఇప్పటికే ప్రజల ముందు ఉంచింది. ఉద్దేశపూర్వకంగా పోలీసు శాఖను బద్నం చేసేలా తప్పుడు పోస్ట్ పెడితే తీవ్రంగా పరిగణిస్తాం. ఈ ఘటనకు సంబంధించి ఏ పౌరిడి దగ్గరైనా ఆధారాలు ఉంటే మాకు అందించవచ్చు’’ అని పోలీసులు ప్రకటించారు.

అయితే ఈ అంశానికి సంబంధించి మంగళవారం నటుడు అల్లు అర్జున్‌ను పోలీసులు విచారించారు. ఈ అంశంపై కూడా సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు జరిగాయి. పోలీసులు అడిగిన ప్రశ్నలకు అల్లు అర్జున్ మౌనంగా ఉండిపోయారని ఒకవైపు, అన్ని ప్రశ్నలకు తడుముకోకుండా సమాధానాలు ఇచ్చారని మరోవైపు ప్రచారం జరుగుతున్నాయి. అంతేకాకుండా కొన్ని కీలక ప్రశ్నలకు బన్నీ బదులు ఇవ్వలేదని ప్రచారం జరుగుతోంది. కానీ విచారణ ఎలా సాగింది అన్న అంశంపై పోలీసులు ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా జోరుగా వివిధ రకాల ప్రచారాలు జరుగుతుండటంపై పోలీసు శాఖ ఘాటుగా స్పందించింది.

Read More
Next Story