Uber Forgetful Cities Report
x

మతిపరుపులో హైదరాబాద్ టాప్.. ఉబర్ బయటపెట్టిన విషయాలివే

మతిమరుపు మీద ప్రముఖ రవాణా సంస్థ ఉబర్ ఓ రిపోర్ట్ తయారు చేసింది. ఈ రిపోర్ట్ లో మతిమరుపు నగరాల్లో హైదరాబాద్ కూడా అగ్ర స్థానంలో ఉందని తేల్చింది.


జర్నీలో ఉన్నప్పుడు మన వస్తువులు మరిచిపోవడం సహజమే. పర్సులు, వాటర్ బాటిళ్లు, బ్యాగులు, కళ్లజోళ్లు, కర్చీఫులు ఇలా ఏదొక వస్తువు మనం ప్రయాణించిన వాహనంలోనే వదిలేసి గమ్య స్థానాల్లో దిగిపోతూ ఉంటాం. ప్రతి ఒక్కరికీ ఇలాంటి అనుభవాలు ఎదురయ్యే ఉండొచ్చు. చాలామంది పెద్ద మొత్తంలో బంగారం, డబ్బులు కూడా వదిలిపెట్టినవారూ లేకపోలేదు. అదృష్టం బావుండి, మనం ఎక్కిన ఆటో డ్రైవరో, క్యాబ్ డ్రైవరో, ఇతర వాహనాల డ్రైవరో మంచోడైతే పోగొట్టుకున్నవి తిరిగి దక్కుతాయి. లేదంటే అంతే సంగతులు.

అయితే, ఈ మతిమరుపు మీద ప్రముఖ రవాణా సంస్థ ఉబర్ ఓ రిపోర్ట్ తయారు చేసింది. ఈ రిపోర్ట్ లో మతిమరుపు నగరాల్లో హైదరాబాద్ కూడా అగ్ర స్థానంలో ఉందని తేల్చింది. Uber తన లాస్ట్ అండ్ ఫౌండ్ ఇండెక్స్ 2024 (Lost and Found Index 2024) ఎడిషన్‌ను విడుదల చేసింది. ఇది తరచూ మరచిపోయే అంశాలు, అత్యంత మతిమరుపు నగరాలు, అలాగే ఉబెర్ రైడర్‌లు ఎక్కువగా మతిమరుపుగా ఉండే వారం రోజుల స్నాప్‌షాట్‌ను అందిస్తోంది.

రెండో ఏడాది కూడా దేశంలోనే అత్యంత మతిమరుపు నగరంగా ఢిల్లీ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ముంబై తన రెండో స్థానాన్ని నిలబెట్టుకుంది. హైదరాబాద్ నుండి బెంగళూరు తన మూడవ స్థానాన్ని తిరిగి తీసేసుకుంది. ఇక మన హైదరాబాదీయులు తమ వస్తువులపై కొంచెం ఎక్కువ శ్రద్ధ చూపడంతో ఇది నాల్గవ స్థానానికి పడిపోయింది. టాప్ 5 లో పూణె నిలిచింది.

ఇండియాలో ఉబర్ వాహనాల్లో ఎక్కువగా మర్చిపోయిన వస్తువుల్లో.. ఫోన్‌లు, బ్యాగ్‌లు, వాలెట్‌లు, దుస్తులు అగ్రస్థానంలో ఉన్నాయి. ఆ తర్వాత జాబితాలో వాటర్ బాటిల్స్, తాళాలు, కళ్ళజోడు, ఆభరణాలు వంటివి ఉన్నాయి. చాలా మంది చిన్న గిటార్, నాణేల సేకరణ, ప్రసాదం, హెయిర్ ట్రిమ్మర్ వంటి ప్రత్యేకమైన వస్తువులను కూడా మర్చిపోయారు. రైడర్‌లు తమ ఉబర్ క్యాబ్‌లలో పాస్‌పోర్ట్‌లు, బ్యాంక్ మరియు వ్యాపార పత్రాలు వంటి ముఖ్యమైన పత్రాలను కూడా వదిలేయడం విశేషం.

Uber లాస్ట్ అండ్ ఫౌండ్ ఇండెక్స్ వారి ట్రిప్ సమయంలో తమ వాహనాల్లో ఏదైనా పోగొట్టుకున్నప్పుడు, మర్చిపోతే వారికి అందుబాటులో ఉన్న యాప్ ఆప్షన్‌ల గురించి అవగాహన కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది, ”అని Uber సెంట్రల్ ఆపరేషన్స్ హెడ్ నితీష్ భూషణ్ చెప్పారు.

శుక్ర, శని, ఆదివారాల్లో ప్రజలు తమ వస్తువులను ఉబర్‌ లో మరచిపోయే అవకాశం ఎక్కువగా ఉందని నివేదిక పేర్కొంది. చాలామంది బ్లూ కలర్ వస్తువులను ఎక్కువగా మర్చిపోతున్నారు. ఆ తర్వాత రెడ్, పింక్ కలర్స్ వస్తువులు ఉన్నాయి. అలాగే, ఈవినింగ్స్ లో ఎక్కువమంది తమ వస్తువులు మర్చిపోతున్నారు. క్యాబ్‌ లలో మరచిపోయిన టాప్ ఫోన్ బ్రాండ్‌లలో Apple, Samsung Redmi ఉన్నాయి.

వస్తువులు మర్చిపోతే ఉబర్ యాప్ లో ఇలా రిపోర్ట్ చేయండి..

“Menu” ఐకాన్ పైన క్లిక్ చేయండి.

“Your Trips” క్లిక్ చేసి మీరు ఏ రైడ్ లో అయితే వస్తువులు పోగొట్టుకున్నారో ఆ రైడ్ సెలెక్ట్ చేయండి.

“Report an issue with this trip” ని సెలెక్ట్ చేసుకోండి.

“I lost an item” సెలెక్ట్ చేయండి.

“Contact my driver about a lost item” క్లిక్ చేయండి.

తర్వాత కిందకి స్క్రోల్ చేసి మీ ఫోన్ నెంబర్ టైప్ చేసి సబ్మిట్ ఆప్షన్ క్లిక్ చేయండి. (ఒకవేళ మీరు క్యాబ్ లో మర్చిపోయింది మీ ఫోన్ అయితే మీ ఫామిలీ మెంబెర్స్ లేదా ఫ్రెండ్స్ ఫోన్ నెంబర్ ఇవ్వండి).

నేరుగా డ్రైవర్ ని కాంటాక్ట్ చేసేలా మీకు కాల్ వస్తుంది.

డ్రైవర్ మీ వస్తువు క్యాబ్ లోనే ఉందని నిర్ధారిస్తే నేరుగా కలిసి తీసుకునేందుకు కన్వీనియెంట్ ప్లేస్ డీటెయిల్స్ షేర్ చేసుకోవచ్చు.

ఒకవేళ డ్రైవర్ కి కనెక్ట్ కాకపోతే ‘in-app support’ ఆప్షన్ ద్వారా ఇష్యూని రిపోర్ట్ చేస్తే Uber సపోర్ట్ టీం అందుబాటులోకి వస్తారు.

Read More
Next Story