
బస్తీల బాట పడుతున్న హైదరాబాద్ సాఫ్ట్ వేర్ ఉద్యోగులు
రోజువారీ ప్రయాణ భారం పెరిగినా సరే తక్కువ అద్దె కోసం మరింత దూర ప్రాంతాలకు వెళ్లడానికి రెడీ అవుతున్న టెకీలు.
పికె రాయ్ (37) ఉత్తర ప్రదేశ్ నుంచి వచ్చి హైదరాబాద్ లోని ఒక సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. హైదరాబాద్ కు వచ్చి ఆరేళ్లయింది. అయిదేళ్లు హైటెక్ సిటీ ఏరియాలోని కావూరి హిల్స్ ప్రాంతంలోఉన్నాడు. గత ఏడాది ఉన్నట్లుండి ఫ్లాట్ అద్దె పెరగడంతో అక్కడి నుంచి ఉప్పల్ వైపు వచ్చాడు. ఉప్పల్ ని ఎంచుకోవడానికి కారణం హైదరాబాద్ మెట్రో. దాదాపు పదివేల రుపాయలు తక్కువకు ఆయనకు ఫ్లాట్ దొరికింది.
మయాంక్ (38) పరిస్థితి కూడా అంతే. బోఫాల్‌కు చెందిన మయాంఖ్.. ఎల్ బినగర్‌ను ఎంచుకున్నాడు. కారణం అక్కడికి కూడా మెట్రో ఉంది. ఎల్ బి నగర్ చుట్టూర చాలా కాలనీలు ఉన్నాయి. డబుల్ బెడ్ రూపం రూ.15వేల నుంచి రూ.18 వేల లోపు దొరుకుతుంది. ఇది సిటీలో రూ.25 వేల నుంచి రూ.30 వేలకు తక్కువకురాదు.
ఇలా ఇంతకాలం ఆఫీసులకు సమీపాన ఫ్లాట్స్ లో ఉన్న సాఫ్ట్ వేర్ ఉద్యోగులంతా మెట్రో రూట్స్ లో దూరంగా ఉన్న కాలనీలకు, బస్తీలకు మారుతున్నారు. అంతేకాదు, అక్కడే స్థిరపడాలనుకుంటున్నారు. ఉప్పల్, ఎల్ బినగర్ లు ఇప్పుడు అన్ని హంగులను సంతరించుకుంటున్నాయి. ఇలా హైటెక్ సిటీ ఐటి కారిడార్ నుంచి టెకీలు నగరంలో అన్ని ప్రాంతాలకు విస్తరిస్తున్నారు.
ఇటీవల హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో అద్దెల మోత మోగుతోంది. అధిక జీతాలు తీసుకుంటున్న టెకీలు సైతం ఈ అద్దెలు మా వల్ల కావు మహాప్రభో అంటూ తక్కువ ఖర్చు అయ్యే ప్రాంతాలకు వెళ్లే ప్లాన్స్ చేస్తున్నారు. ఇంతకాలం హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో నివాసం కాస్తంత కాస్ట్లీ అయినా అంతే విలాసంగా ఉండేది. కానీ ఇప్పుడు ఖర్చు తప్పితే విలాసం కనిపించే పరిస్థితి లేదు. ఈ వి పెరుగుతున్న డిమాండ్‌ను అవకాశంగా తీసుకుని మధ్యవర్తులు అద్దెలను భారీగా పెంచేస్తున్నారు. దీంతో హైదరాబాద్‌లో ఇల్లు కొనడం కాదు.. అద్దెకు తీసుకోవాళ్లన్నా కళ్లు చెదిరిపోతున్నాయి. ఏడాది కాలంలో హైదరాబాద్‌లో ఇంటి అద్దెలు 20శాతం పెరిగాయి. అందులోనూ ఐటీ కారిడార్ చుట్టుపక్కల ప్రాతాల్లో ఫ్లాట్ అద్దెకు తీసుకోవాలంటే గట్టి ఉద్యోగం కాదు.. గట్టి జేబు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.
మాదాపూర్, నానక్రామ్‌గుడ, గచ్చిబౌలి, నల్లగండ్ల, ఖాజాగుడ, తెల్లపుర్, గోపన్ పల్లి ప్రాంతాల్లో అద్దెలు విపరీతంగా పెరిగాయి. డబుల్ బెడ్రూం ఫ్లాట్ రూ.40వేలు, త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ రూ.60వేల అద్దెలు పలుకుతున్నాయని అక్కడ ఉంటున్న కొందరు చెప్తున్నారు. అంతేకాకుండా ఫ్లాట్ సైజ్, లొకేషన్, సదుపాయాలను బట్టి అద్దెల్లో హెచ్చుతగ్గులు ఉన్నాయి. ఇక ప్రీమియమ్ సదుపాయాలు ఉంటే ఆ ఫ్లాట్‌లు రూ.1లక్ష అద్దె కూడా పలుకుతున్నాయి. స్టాండ్ ఎలోన్ అపార్ట్‌మెంట్లలో కూడా అద్దె మోతలు మోగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ రూ.30000 నుంచి రూ.35000 వరకు ఉన్నాయి. ఒక త్రిబుల్ బెడ్రూమ్ అయితే రూ.50వేల పైమాటేనని స్థానికంగా ఉన్న రెంట్ హౌస్ బ్రోకర్లు చెప్తున్నారు.
హైదరాబాద్‌లోని ఇంటి అద్దెల పరిస్థితి కరోనా ముందు, కరోనా తర్వాత అన్నట్లు ఉంది. కోవిడ్ వచ్చి కంట్రోల్ అయిన తర్వాత నుంచి భాగ్యనగరంలో ఆఫీసులు, ఫ్లాట్ అద్దెలు పెరుగుతూనే వస్తున్నాయి. అన్ని రంగాల్లోని కార్యాలయాలు మళ్ళీ 100శాతం ఆక్యుపెన్సీతో పనిచేయడం స్టార్ట్ కావడంతో భారీ సంఖ్యలో ఉద్యోగులు హైదరబాద్ బాట పడుతున్నారు. దీంతో అద్దె ఫ్లాట్‌లకు డిమాండ్ పెరుగుతోంది. హెల్త్, ఐటీ రంగాల్లోని ఉద్యోగుల రద్దీ హైదరాబాద్‌కు పెరిగింది. దీంతో రెంటల్ మార్కెట్‌పై ఒత్తిడి అధికమైంది. ఇదే సమయంలో చాలా మంది సొంతింటికి కూడా ప్లాన్ చేశారు. కానీ భూమి రేట్లు పెరగడం, లోన్‌లో తీసుకుందామంటే వడ్డీలు కూడా భారీగా ఉండటంతో చాలా వరకు ఉద్యోగులు అద్దె ఇళ్ల వైపే మొగ్గు చూపారు. దీంతో అద్దె ఇళ్లకు పెరిగిన డిమాండ్‌ను యజమానులు, అద్దె ఇంటి బ్రోకర్‌లు మంచి అవకాశంగా భావించి రేట్స్ పెంచేస్తున్నారు.
మూలిగే నక్కపై తాటికాయ పడినట్లు.. అద్దె భారాన్ని మోయలేక ఇబ్బందులు పడుతున్న ఉద్యోగులకు మెయింటనెన్స్ అనే అదనపు భారం కూడా యాడ్ అయింది. తెల్లాపూర్, నల్లగండ్ల, నార్సింగి వంటి ప్రాంతాల్లో గత 18 నెలల్లో మెయింటెనెన్స్ ఖర్చులు చదరపు అడుగుకు రూ.3 నుంచి రూ.4 వరకు పెరిగాయి. దీంతో నెలవారీ నివాస ఖర్చు మరింత పెరిగిందని అద్దెదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదే అంశంపై తెల్లాపూర్‌కు చెందిన ఐటీ ఉద్యోగి టీ కిరణ్మయి స్పందించారు. తాను 2022లో రూ.20 వేల అద్దె ఉన్న తన 3బీహెచ్‌కే ఇల్లు ప్రస్తుతం రూ.35 వేలకు చేరిందని తెలిపారు. మెయింటెనెన్స్ కలిపితే నెలకు రూ.40 వేలకుపైగా ఖర్చవుతుండటంతో చివరకు 2.5బీహెచ్‌కేకు మారాల్సి వచ్చిందన్నారు. అక్కడ కూడా అద్దె తక్కువ కాలంలోనే పెరిగిందని చెప్పారు.
అయితే ఈ పరిస్థితి రానున్న కాలంలో మరింత ఉధృతం కానుందని రియల్టర్లు హెచ్చరిస్తున్నారు. తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్ ప్రవీణ్ ఈ విషయంపై తన అభిప్రాయం వ్యక్తం చేశారు. నగరంలో టు లెట్ బోర్డులు దాదాపుగా కనుమరుగయ్యాయని చెప్పారు. ‘‘ఇల్లు కావాలంటే బ్రోకర్లు, ఆన్‌లైన్ పోర్టల్స్‌పైనే ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నప్పటికీ కొత్త అద్దె ఇళ్ల సరఫరా తక్కువగా ఉండటంతో అద్దెలు ఇంకా పెరిగే అవకాశముంది’’ అని ఆయన తెలిపారు.
అద్దెల భారం తట్టుకోలేక చాలా మంది నగర కేంద్రానికి దూరంగా ఉన్న ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. బస్తీలలో తక్కువ అద్దెకు దొరికే ఇల్లపై ఆసక్తి చూపుతున్నారు. మణికొండ పంచవటి కాలనీలో నివసించిన జే కార్తిక్ కూడా ఇదే పని చేశారు. తన ఇంటి అద్దె ఒక్కసారిగా రూ.30 వేల నుంచి రూ.40 వేలకు పెరగడంతో అక్కడి నుంచి లక్ష్మీనగర్‌కు మారానని, ఆ తర్వాత అక్కడ కూడా అద్దె పెరిగిందని చెప్పారు.
ఉప్పల్, కొంపల్లి, హయత్‌నగర్ వంటి ప్రాంతాలు గతంలో అద్దె ఇళ్లకు చౌక ప్రత్యామ్నాయాలుగా గుర్తింపు పొందాయి. కానీ ప్రస్తుతం అక్కడ పరిస్థితి కూడా దారుణంగానే ఉంది. అక్కడ కూడా అద్దెలు వేగంగా పెరుగుతున్నాయి. కొంపల్లిలో అద్దెకు నివాసం ఉంటున్న సీ మధుకర్ రావు ఈ విషయాన్ని వివరించారు. తన ఆదాయంలో దాదాపు సగం అద్దెకే ఖర్చవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
కొంతమంది అద్దెదారులు రోజువారీ ప్రయాణ భారం పెరిగినా సరే తక్కువ అద్దె కోసం మరింత దూర ప్రాంతాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. కొంపల్లిలో అద్దె భారం పెరగడంతో గుండ్లపోచంపల్లికి మారాలని యోచిస్తున్నట్లు టెకీ విజయ్ కృష్ణ తెలిపారు. నెలకు సుమారు రూ.6 వేలు ఆదా అవుతుందన్న ఆశతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

