పేరు గొప్ప, లోపలంతా దిబ్బ: హైదరాబాద్ రెస్టారెంట్లు
x
హైదరాబాద్ నగరంలో అపరిశుభ్రంగా ఉన్న రెస్టారెంట్ కిచెన్ (ఫొటో : ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఎక్స్ సౌజన్యంతో)

పేరు గొప్ప, లోపలంతా దిబ్బ: హైదరాబాద్ రెస్టారెంట్లు

ఆహార పదార్థాల కల్తీ కేసుల్లో హైదరాబాద్ అగ్రస్థానం


ఆహార పదార్థాల కల్తీ కేసుల్లో హైదరాబాద్ అగ్రస్థానంలో ఉంది. 2020 నుంచి 2025 సంవత్సరాల మధ్య రాష్ట్ర ఆహార భద్రతా విభాగం మొత్తం 18,283 ఆహార నమూనాలను పరీక్ష కోసం పంపగా, వాటిలో 2,642 అంటే దాదాపు 15శాతం కల్తీవని ఫుడ్ సేఫ్టీ అధికారుల పరీక్షల్లోనే తేలింది.వీటిలో కేవలం 964 ఆహార నమూనాలపై మాత్రమే ఫుడ్ సేఫ్టీ అధికారులు జరిమానాలు విధించారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ రాజ్యసభలో సమర్పించిన డేటా ప్రకారం తెలంగాణలో ఆహార కల్తీ రేటు ఎక్కువగా ఉంది. అందులోనూ హైదరాబాద్‌ నగరంలో ఎక్కువ కేసులు నమోదయ్యాయి.గత నాలుగు నెలల్లోనే 381 హోటళ్లపై తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులు జరిపిన ఆకస్మిక తనిఖీల్లో 60 శాతానికి పైగా హోటళ్లు కల్తీ ఆహార పదార్థాలు విక్రయిస్తున్నారని తేలింది.అంటే తెలంగాణలో అందులోనూ హైదరాబాద్ నగరంలో కల్తీ ఆహార పదార్థాల విక్రయం తీవ్రత ఏమిటో తెలుస్లుంది.


ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ తనిఖీలు
తెలంగాణలో 34,368 లైసెన్సు పొందిన హోటళ్లు, రెస్టారెంట్లు ఉన్నాయి. దీంతోపాటు 1.06 లక్షల చిన్న, వీధి వ్యాపారులు తోపుడు బండ్లు, కాకా హోటళ్లు నడుపుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అందులోనూ హైదరాబాద్ నగరంలో కల్తీ ఆహారం కేసుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూళ్లు, హాస్టళ్లు, ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన కేంద్రాలు, సూపర్ మార్కెట్లు, కేఎఫ్ సీ, హోటళ్లు, స్వీట్ షాపుల్లో సింథటిక్ కలర్స్ వినియోగిస్తున్నారని తెలంగాణ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ టాస్క్ ఫోర్స్ తనిఖీల్లో వెల్లడైంది. గడువు ముగిసిన, పురుగులు పట్టిన పెసరపప్పు, మినుములు, చింతపండు కనిపించడంతో వాటి శాంపిళ్లను సేకరించి పరీక్షకు పంపించారు.



18 మంది యజమానులకు నోటీసులు

తెలంగాణ రాష్ట్రంలో కల్తీ ఆహార పదార్థాల విక్రయాలు పెరగడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు హోటళ్లు, మెస్ లు, చికెన్ దుకాణాలు, హాస్టళ్లలో తాజాగా ఆకస్మిక తనిఖీలు చేశారు. 18 ఆహార శాంపిళ్లను సేకరించి పరీక్షించగా గడువు ముగిసి, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, సింథటిక్ రంగులు కలిపిన ఆహార పదార్థాలు ఉన్నాయని ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో తేలింది. దీంతో 18 మంది యజమానులకు ఫుడ్ సేఫ్టీ కమిషనర్ నోటీసులు జారీ చేశారు.

పిస్తాహౌస్ రెస్టారెంట్లలో బొద్దింకలు, ఎలుకల సంచారం
హైదరాబాద్ నగరంలోని పిస్తాహౌస్ రెస్టారెంట్లపై వచ్చిన ఫిర్యాదులతో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇటీవల 23 చోట్ల ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో 11పిస్తాహౌస్ రెస్టారెంట్ల కిచెన్లు తడిగా పాకుడు పట్టి ఉన్నాయని వెల్లడైంది. అపరిశుభ్ర కిచెన్, శుభ్రం చేయకుండా అధ్వానంగా ఉన్న రిఫ్రిజిరేటర్లు దర్శనమిచ్చాయి. వంట గదుల్లో ఎలుకలు, బొద్దింకలు, ఈగలు తిరుగుతూ కనిపించాయి. నాన్ వెజ్ వంటకాల్లో సింథటిక్ ఫుడ్ కలర్స్ వాడుతున్నారని తేలింది. ఆహారపదార్థాలను అపరిశుభ్రంగా ఉన్న నేలపై ఉంచడం, తుప్పుపట్టిన కత్తులతో కూరగాయలు కోస్తున్నారని వెల్లడైంది. అపరిశుభ్ర వాతావరణంలో నిర్వహిస్తున్న పిస్తాహౌస్ రెస్టారెంట్లపై చర్యలు తీసుకోవాలని ఫుడ్ సేఫ్టీ టాస్క్ పోర్స్ సూచించింది. ఆహార శాంపిల్ రిపోర్టుల ఆధారంగా తాము పిస్తాహౌస్ రెస్టారెంట్లపై చర్యలు తీసుకుంటామని ఫుడ్ సేఫ్టీ అధికారులు చెప్పారు.



ప్రముఖ రెస్టారెంట్లలోనూ అపరిశుభ్రత

హైదరాబాద్ నగరంలోని ప్రముఖ రెస్టారెంట్లపై జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు జరపగా పలు ఉల్లంఘనలు వెలుగుచూశాయి. తెలంగాణ ఆహార భద్రతా విభాగానికి చెందిన టాస్క్‌ఫోర్స్ ప్రముఖ రెస్టారెంట్లపై దాడుల్లో పలు షాకింగ్ వాస్తవాలు బయటపడ్డాయి. నగరంలో పేరొందిన బార్బీక్యూకు చెందిన పది అవుట్ లెట్లపై ఫుడ్ సేఫ్టీ కమిషనరుకు ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. దీంతో హైదరాబాద్‌లోని ఏఎస్ రావు నగర్, కొంపల్లి, మేడిపల్లి, బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్, గచ్చిబౌలి, ఇనార్బిట్, మియాపూర్, వనస్థలిపురం, సికింద్రాబాద్‌లలో ఉన్న ప్రసిద్ధ రెస్టారెంట్లు అయిన బార్బీ క్యూ అవుట్ లెట్లపై టాస్క్‌ఫోర్స్ అధికారులు దాడులు చేశారు.

తనిఖీల్లో ఏం తేలిందంటే...
బార్బీ క్యూ అవుట్ లెట్లలో మురికి పాత్రలు, అపరిశుభ్రంగా ఉన్న ఫ్లోరింగ్, వాష్ ఏరియాలు కనిపించాయి. ఫ్రిడ్జ్ ను శుభ్రం చేయలేదు. చాపింగ్ బోర్డులు దెబ్బతిన్నాయి. బార్బీ క్యూ, పిస్తాహౌస్ రెస్టారెంట్లలో అపరిశుభ్ర పరిస్థితులు నెలకొన్నాయని ఫుడ్ సేఫ్టీ అధికారులు జరిపిన ఆకస్మిక తనిఖీల్లో తేలింది.



కిచెన్ లో బొద్దింకలు, ఈగలు

బార్బీ క్యూ ఔట్లలెట్స్ కిచెన్ లో బొద్దింకలు...ముసురుకున్న ఈగలు...ఎలుకల మలం ఉన్నట్లు ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ గుర్తించింది. బార్బిక్యూ ఔట్లెట్స్ లో అధికారులు జరిపిన ఆకస్మిక తనిఖీల్లో పలు షాకింగ్ వాస్తవాలు వెలుగుచూశాయి. బంజారాహిల్స్, గచ్చిబౌలిలలోని బార్బీ క్యూ అవుట్ లెట్లలో బొద్దింకలు, ఈగలు కనిపించాయి. మేడిపల్లి అవుట్ లెట్ లో గడవు ముగిసిన ఆహారం లభించింది. ఇనార్టిట్ రెస్టారెంట్ లో ఫంగస్ తో పండ్లు కుళ్లి పోయి కనిపించాయి.ఆహార వస్తువులుంచిన రాక్ లు తుప్పు పట్టడంతో పాటు వాటిపై ఎలుకల మలం కనిపించింది. ఆహార పదార్థాల శాంపిళ్లను సేకరించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు.

బిట్స్ మెస్ లోనూ అపరిశుభ్రతే...
హైదరాబాద్ బిట్స్ కాలేజీ మెస్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్‌లో ఫుడ్ సేఫ్టీ ఇన్‌స్పెక్షన్ టాస్క్‌ఫోర్స్ ఆకస్మిక తనిఖీ నిర్వహించింది. ఈ మెస్ లో బహుళ ఉల్లంఘనలు గమనించారు. దీనికి ఫుడ్ లైసెన్స్ లేదు. తెగులు నియంత్రణ/ఆరోగ్య రికార్డులు లేవు. అపరిశుభ్రమైన కిచెన్, జిడ్డుతో ఉన్న ఎగ్జాస్ట్‌లు, దెబ్బతిన్న మెష్‌లు, మురుగునీరు నిల్వ ఉన్న ప్రాంతాలు కనిపించాయి. రెండు మెస్ లకు ఫుడ్ సేఫ్టీ అధికారులు నోటీసులు జారీ చేశారు.ఆహార శాంపిళ్లను ప్రయోగశాల పరీక్ష కోసం పంపించారు.



కేఎఫ్ సీకి రూ.10వేల జరిమానా

నిజామాబాద్ నగరంలోని కేఎఫ్ సీ అవుట్ లెట్ లో ఓ కస్టమరుకు కుళ్లిన చికెన్ వడ్డించినట్లు ఉన్న వీడియో వైరల్ కావడంతో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు.అధికారులు చికెన్ శాంపిళ్లను సేకరించి పరీక్షకు పంపించారు. కేఎఫ్ సీ అవుట్ లెట్ కు రూ.10వేల జరిమానా విధించారు.

ఆహార కల్తీ చేసినా వారిపై చర్యలు నామమాత్రం....
తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులు హోటళ్లు, బేకరీలు, రెస్టారెంట్లపై వరుస దాడులు చేస్తున్నా ఆహార కల్తీకి మాత్రం తెరపడటం లేదు.కల్తీ కేసుల్లో అధికారులు సరైన చర్యలు తీసుకోక పోవడంతో కల్లీ, నాణ్యతలేని ఆహార విక్రయాలకు తెరపడటం లేదు. కల్లీ ఆహార పదార్థాల విక్రేతలపై కేసులు నమోదు చేస్తున్నా వారికి నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. గత నెల రోజులుగా తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులు హోటళ్లపై వరుస దాడులు చేస్తున్నారు. ప్రముఖ హోటళ్లలో సైతం నాణ్యత లేని కల్తీ ఆహారాన్ని విక్రయిస్తున్నారని తనిఖీల్లో తేలింది. బడా బడా హోటళ్లలో కల్తీ బండారం బయటపడింది.



ట్రయల్ దశలోనే కేసులు...

నాణ్యత లేని కల్తీ ఆహారాన్ని విక్రయిస్తున్న హోటళ్లు ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎష్ఎస్ఏఐ) నిబంధనలను పాటించడం లేదని ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో వెల్లడైంది. కల్తీ ఆహార విక్రేతలపై అధికారులు కేసులు నమోదు చేసినా, అవి ట్రయల్ దశలోనే ఉన్నాయి.1669 కేసులు విచారణలోనే ఉన్నాయి.

కేంద్రమంత్రి కల్తీపై ఏమన్నారంటే...
‘‘తెలంగాణ రాష్ట్రంలో అందులోనూ ప్రధానంగా హైదరాబాద్ నగరంలో 2020 నుంచి 2025 వరకు 18,283 శాంపిళ్లను తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులు సేకరించగా, ఇందులో 15 శాతం అంటే 2,642 ఆహార శాంపిళ్లు కల్తీవని తేలింది. కానీ కేవలం 964 శాంపిళ్ల కేసుల్లోనే జరిమానాలు విధించారు’’అని సాక్షాత్తూ కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి ప్రతాప్ జాదవ్ తాజాగా రాజ్యసభలోనే ప్రకటించారు.



ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్ లో తెలంగాణ 23వ స్థానం

దేశంలోని 28 రాస్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్ లో తెలంగాణ రాష్ట్రం 23వ ర్యాంక్ లో ఉంది. ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్ లో కేరళ అగ్రస్థానంలో నిలచింది. తమిళనాడు, జమ్మూకశ్మీర్, గుజరాత్, పంజాబ్ రాష్ట్రాలు ఫుడ్ సేఫ్టీలో టాప్ 5లో నిలిచాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఫుడ్ సేఫ్టీలో అట్టడుగున ఉంది. కల్లీ, నాణ్యత లేని ఆహారాన్ని విక్రయించే హోటళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని వినియోగదారుల సంఘం మాజీ అధ్యక్షుడు బీవి రమణ డిమాండ్ చేశారు.

ఆహార కల్తీ కేసుల్లో చర్యలేవి?
తెలంగాణలో ఆహార కల్తీ కేసుల సంఖ్య పెరుగుతున్నా, ఈ కేసుల్లో యజమానులపై చర్యలు కొరవడ్డాయి. రాష్ట్రంలోని హోటళ్లు, రెస్టారెంట్లు, మెస్ లు, హాస్టళ్లలో కలుషిత, కల్తీ ఆహార వస్తువులను వినియోగిస్తున్నారని ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో తేలింది. దీనిపై ఫుడ్ సేఫ్టీ అధికారులు కేసులు నమోదు చేసినా, వారిపై చర్యలు తీసుకోలేదు. దీంతో ఆహార కల్తీకి తెరపడటం లేదు.2023–24వ సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో కల్తీ కేసులు నమోదయ్యాయి. 973 ఫుడ్ సేఫ్టీ ఉల్లంఘనలు వెలుగుచూశాయి. అయితే వీటిలో 425 హోటళ్లకే జరిమానాలు విధించారు. 2022–23వ సంవత్సరంలో అధికారులు 894 ఆహార భద్రతా నిబంధనలు పాటించని నమూనాలను ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించినా, కేవలం 315 కేసుల్లోనే చర్యలు తీసుకున్నారు. హైదరాబాద్ నగరంలో 1,669 మంది ఫుడ్ సేఫ్టీ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చర్యలు పెండింగ్‌లో ఉన్నాయని నగర అసిస్టెంట్ ఫుడ్ సేఫ్టీ కంట్రోలర్ పాల ధర్మేందర్ చెప్పారు. కొన్ని కేసులు ప్రాసిక్యూషన్‌లో ఉన్నాయని ఆయన తెలిపారు.

ఆహార కల్తీపై కఠిన చర్యలు : డైరెక్టర్ డాక్టర్ సి శివలీల
తెలంగాణ రాష్ట్రంలో ఆహార కల్తీపై వచ్చిన ఫిర్యాదులతోపాటు రాండమ్ గా తాము హోటళ్లు, రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ బృందాలతో అకస్మిక తనిఖీలను ముమ్మరం చేశామని ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ప్రివెన్షన్ మెడిసిన్ పబ్లిక్ హెల్త్ ల్యాబ్ అండ్ ఫుడ్ సేఫ్టీ విభాగం డైరెక్టర్ డాక్టర్ సి శివలీల ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. కల్లీ ఆహార పదార్థాలు, కలుషిత, కాలం చెల్లిన ఆహార పదార్థాలు విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని ఆమె తెలిపారు. తనిఖీలు చేసి శాంపిళ్లను పరీక్షించి కల్తీవని వస్తే హోటళ్లకు నోటీసులు జారీ చేశామని చెప్పారు. పలు పెద్దపెద్ద హోటళ్లు, రెస్టారెంట్లకు తాము షోకాజ్ నోటీసులు జారీ చేశామని, అవసరమైతే వాటిని సీజ్ చేస్తామని శివలీల చెప్పారు.

ఆహార కల్తీపై అప్రమత్తంగా ఉండండి

ఆహార కల్తీపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏవైనా ఆహార భద్రతా నిబంధనల ఉల్లంఘనలను మీరు గుర్తిస్తే వాటిని telanganacfs@gmail.com కు నివేదించాలని లేదా హెల్ప్‌లైన్ 9100105795 ఫోన్ నంబరుకు కాల్ చేయాలని ఫుడ్ సేఫ్టీ డైరెక్టర్ డాక్టర్ పి శివలీల కోరారు.


Read More
Next Story