
మనమణ్ణి అమ్మమ్మకు అప్పజెప్పి.. భార్యను చంపి చెత్తబుట్టలో వేసి..
తన భార్యను చంపడానికి పక్కా వ్యూహాన్ని రచించి అమలు చేసి పరారీ అయ్యారు. తల్లిదండ్రులు లేక పోతే తన పిల్లాడు అనాధ అవుతాడని కట్టుదిట్టం చేసి ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు
పెద్ద చదువులు.. విదేశాల్లో కొలువులు.. లక్షల్లో జీతాలు.. వ్యక్తిగత స్వేచ్ఛపై ప్రసంగాలు.. ఇన్ని ఉన్నప్పుడు అటువంటి మనుషులు సహజంగానే సజ్జనులై ఉంటారనుకునే యోచన మంచిదే గాని అలాగే ఉండాలన్న రూలేమీ నిరూపించారు ఇక్కడో వ్యక్తి. తన భార్యను చంపడానికి పక్కా వ్యూహాన్ని రచించి అమలు చేసి పరారీ అయ్యారు. తల్లిదండ్రులు లేక పోతే తన పిల్లాడు అనాధ అవుతాడని భావించి ఆ చిన్నోడిని ఆస్ట్రేలియా నుంచి తెచ్చి వాళ్లమ్మమ్మకు అప్పగించి మరీ ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. ఇంత ఆలోచన చేసిన ఆ మధ్యవయస్కుడు ప్రేమించి పెళ్లాడిన యువతిని ఎందుకంత దారుణంగా చంపాడనే విచారణలో తేలాల్సిందే.
హైదరాబాద్ ఉప్పల్ నుంచి...
హైదరాబాద్‌కు చెందిన 36 ఏళ్ల మహిళ చైతన్య మాధగాని ఎలియాస్ శ్వేత, హైదరాబాద్ కే చెందిన అశోక్ రాజ్ భార్యాభర్తలు. ఇండియాలో వివాహం చేసుకుని ఆస్ట్రేలియా వించెల్సియా సమీపంలోని బక్లీలో ఉంటున్నారు. వీరికి మూడేళ్ల కుమారుడు ఉన్నారు. కొంతకాలంగా భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అశోక్ రాజ్ ఒకరోజు ఉన్నట్టుండి ఆస్ట్రేలియా నుంచి వచ్చి తమ కుమారుడిని ఉప్పల్ లోని వాళ్లమ్మమ్మకు అప్పగించి ఆ మర్నాడే తిరిగి ఆస్ట్రేలియా వెళ్లిపోయారన్నది చైతన్య కుటుంబ సభ్యుల ఆరోపణ. ఆస్ట్రేలియా నుంచి బయలుదేరే ముందే చైతన్యను హత్య చేశారా లేక తిరిగి వెళ్లిన తర్వాత చేశారా అనేది ఇంకా తేలలేదు. అశోక్ రాజ్ భార్య చైతన్య మాత్రం హత్యకు గురయ్యారు. ఆమెను హత్య చేసింది ఆమె భర్త అశోక్ రాజేనని ఆస్ట్రేలియా పోలీసులు ఆరోపించారు. చైతన్య మాధగాని మృతదేహం శనివారం బక్లీలోని రోడ్డు పక్కన చెత్త వేసే డబ్బాలో కనపడింది. ఆస్ట్రేలియా డిటెక్టివ్ పోలీసులు రంగంలోకి దిగారు. మృతదేహం ఎవరిదో కనిపెట్టారు. ఇండియాకి సమాచారం ఇచ్చారు.
ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఏమన్నారంటే...
చనిపోయిన చైతన్య మాధగాని తన నియోజకవర్గానికి చెందిన వారని, విషయం తెలియడంతో ఆమె తల్లిదండ్రులను కలిసి పరామర్శించానని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి చెప్పారు. ఆ మహిళ తల్లిదండ్రుల అభ్యర్థన మేరకు, చైతన్య మృతదేహాన్ని హైదరాబాద్‌కు తీసుకురావాలని విదేశాంగ కార్యాలయానికి లేఖ రాశానన్నారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కార్యాలయానికి కూడా విషయాన్ని తెలియజేసినట్లు చెప్పారు ఎమ్మెల్యే.
చైతన్య తల్లిదండ్రులు చెప్పిన సమాచారం ప్రకారం, వారి అల్లుడు తమ కుమార్తెను చంపినట్లు, పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో " నేరాన్ని ఒప్పుకున్నట్టు" వివరించారు. ఎమ్మెల్యేకు కూడా ఆ విషయాన్నే చెప్పారు. విక్టోరియా పోలీసులు ఒక ప్రకటనలో "వించెల్సియా సమీపంలోని బక్లీలో మరణించిన వ్యక్తిని గుర్తించాం. డిటెక్టివ్ స్క్వాడ్ దర్యాప్తు చేస్తోంది. మౌంట్ పొల్లాక్ రోడ్‌లో మరణించిన వ్యక్తిని కనుగొన్నాం" అని పేర్కొన్నారు. మిర్కా వే, పాయింట్ కుక్‌లోని నివాసం వద్ద సీన్ రిక్రియేషన్ చేశారు. ఇది కచ్చితంగా హత్యేనని పోలీసులు తేల్చారు. ప్రస్తుతానికి అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేశారు. దర్యాప్తులో కొనసాగుతోందని, నిందితులు ఎవరో తెలుసుకుంటామన్నారు పోలీసులు. నిందితుడు విదేశాలకు పారిపోయి ఉండవచ్చని కూడా ఆస్ట్రేలియా పోలీసులు భావిస్తున్నారు.