పర్యావరణ పరిరక్షణ, జీవ వైవిధ్యం కోసం జంతుప్రేమికులు వన్యప్రాణులను దత్తత తీసుకుంటున్నారు. జంతువులపై ప్రేమ వెల్లివిరియడంతో చిన్నారుల నుంచి పెద్దల దాకా ముందుకు వచ్చి జూపార్కులో జంతువులను దత్తత తీసుకుంటున్నారు. పర్యావరణ పరిరక్షణలో వృక్షాలే కాకుండా అన్ని రకాల జంతువులు కీలక పాత్ర పోహిస్తున్నాయి.వాతావరణ సమతౌల్యతను కాపాడేందుకు వన్యప్రాణులను సంరక్షించుకోవాల్సి ఉందనే వాస్తవాన్ని గుర్తెరిగిన ప్రజలు వన్యప్రాణులను దత్తత తీసుకునేందుకు ముందుకు వస్తున్నారు.
- దేశంలోనే హైదరాబాద్ నగరంలోని నెహ్రూ జూలాజికల్ పార్కు (Hyderabad zoo) కీలక పర్యాటకుల సందర్శన కేంద్రంగా నిలిచింది. ఈ జూ పార్కులో 2,300 వన్యప్రాణులు, 193జాతుల జంతువులు, పక్షులు, పాములు సహజసిద్ధంగా ఏర్పాటు చేసిన ఎన్ క్లోజర్లలో ఉంచారు. ప్రపంచ స్థాయి సౌకర్యాల మధ్య వన్యప్రాణులను 450 మంది జూ ఉద్యోగులు కంటికి రెప్పలా చూసుకుంటున్నారు.
హైదరాబాద్ జూ ప్రత్యేకత
హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్క్(NEHRU ZOOLOGICAL PARK) 380 ఎకరాల్లో విస్తరించి, 600 ఎకరాల మీర్ ఆలం ట్యాంక్ పక్కనే ఉంది. దాదాపు 193 స్థానిక,ఇతర దేశాల జాతుల జంతువులున్నాయి, వీటిలో దాదాపు 2300 జంతువులు, పక్షులు, సరీసృపాలు ఉన్నాయి.భారతీయ ఖడ్గమృగం, ఆసియాటిక్ సింహం, బెంగాల్ టైగర్, పాంథర్, గౌర్, ఇండియన్ ఏనుగు, సన్నని లోరిస్, పైథాన్, జింకలు, పక్షులు ఈ జూలో ఉన్నాయి. 55 సంవత్సరాల పురాతన జూ పర్యాటక గమ్యస్థానంగా మారింది. ఏటా దాదాపు 30 లక్షల మంది సందర్శకులను ఈ జూపార్కు ఆకర్షిస్తుంది. వన్యప్రాణుల జాతుల మనుగడను నిర్ధారించడంలో, అరుదైన,అంతరించిపోతున్న జాతుల సంరక్షణ, సంతానోత్పత్తిలో నెహ్రూ జూ కీలక పాత్ర పోషిస్తుంది.

2001లో అడాప్ట్ ఎ యానిమల్ స్కీమ్ ప్రారంభం
హైదరాబాద్ జూపార్కులో 2001వ సంవత్సరంలో మొదట 'అడాప్ట్ ఎ యానిమల్ స్కీమ్'ను (Adopt an Animal' Scheme) ప్రారంభించారు.ఈ పథకం పట్ల తగినంత మంది ఆసక్తి చూపించలేదు.జూలో పెద్ద లేదా చిన్న ఏ జంతువునైనా దత్తత తీసుకోవచ్చు. దత్తత కార్యక్రమం కింద వ్యక్తులు, కార్పొరేషన్లు, పాఠశాలలు, క్లబ్‌లు, కుటుంబాలు, సమూహాలు పాల్గొనవచ్చు. దత్తత రుసుము జూ జంతువులను జాగ్రత్తగా చూసుకోవడానికి సహాయపడటమే కాకుండా, అంతరించిపోతున్న జంతు జాతుల రక్షణకు కూడా ఉపయోగపడుతుందని జూపార్కు అధికారులు చెప్పారు.
పబ్లిక్ గార్డెన్ నుంచి మీరాలం ట్యాంక్ బండ్ వద్దకు...
హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్క్ 1959లో హైదరాబాద్‌లోని పబ్లిక్ గార్డెన్స్ నుంచి పూర్వ జూ ఎన్‌క్లోజర్‌లను మార్చారు. దీనిని 1963 అక్టోబర్ 6వతేదీన ప్రారంభించారు. హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్క్ విస్తీర్ణం 380 ఎకరాలు. జూ మీరాలం ట్యాంక్ బండ్‌ను ఆనుకుని ఉంది, ఇది 200 సంవత్సరాల క్రితం ఏర్పడిన 24 తోరణాలతో కూడిన స్వదేశీ ఆర్చ్ బండ్ ఆనకట్ట.జూ యొక్క సహజ ప్రకృతి దృశ్యం అనేక వలస పక్షులను,నివాస పక్షులను ఆకర్షిస్తుంది.
మొసళ్ల పెంపక కేంద్రం
1980వ సంవత్సరంలో మొసళ్ల జనాభాను మెరుగుపరచడానికి ,వాటిని అడవిలోకి విడుదల చేయడానికి ఈ జూలో మొసళ్ళ పెంపకం కేంద్నాన్ని(Crocodile breeding station) ప్రారంభించారు. మౌస్ డీర్, రాబందుల పెంపకం బాధ్యతను జూపార్కు చేపట్టింది. ఈ జూ ఆసియా సింహాలు,రాయల్ బెంగాల్ టైగర్ ఖ్యాతిని పొందాయి. నెహ్రూ జూలాజికల్ పార్కులో శాకాహార జంతువులు సంతానోత్పత్తికి కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇక్కడ జన్మించిన మచ్చల జింక, బ్లాక్ బక్, నీలగై,సాంబార్ జింకలను తెలంగాణలోని అభయారణ్యాలలో విడుదల చేశారు. ఈ జూలో సంతానోత్పత్తి ద్వారా జన్మించిన జంతువులను జంతు మార్పిడి కార్యక్రమాల కింద విదేశీ జూలకు ఇస్తున్నారు.
జూపార్కులో జంతువుల దత్తతకు పథకం
హైదరాబాద్ నగరంలోని నెహ్రూ జంతు ప్రదర్శనశాలలో జంతువుల దత్తతకు అటవీశాఖ అధికారులు పథకాన్ని ప్రారంభించారు. ఒక్కో జంతువుకు ఆహారం అందించడంతోపాటు వాటి ఆలనా పాలనా చూసేందుకు ఒక రోజు లేదా నెలరోజులు, లేదా ఏడాది పాటు దత్తతకు చెల్లించాల్సిన విరాళాల మొత్తాన్ని జూపార్కు అధికారులు ప్రకటించారు.
జంతువుల దత్తత ఇలా...
ఉదాహరణకు ఒక ఏనుగు లేదా జిరాఫీని ఒక రోజుకు దత్తత తీసుకోవాలంటే రూ.5వేలు, నెలకు రూ.25వేలు, ఏడాదికి రూ. 5 లక్షలు అవసరమని అధికారులు ప్రకటించారు. ఇలా పులి లేదా సింహానికి రోజుకు రూ.2వేలు, నెలకు రూ.25వేలు, ఏడాదికి రూ.3లక్షలని దత్తత విరాళంగా నిర్ణయించారు. ఇలా చిన్న 5 పక్షులకు నెలకు రూ.5వేలు చెల్లించాలని కోరారు. రినో, హిప్పో, చిరుతపులి, జాగ్వార్, ఎలుగుబంటి, హైనా, తోడేలు, అడవి కుక్క, అడవి పిల్లి, కోతి, లంగూర్, ఆస్ట్రిచ్ పక్షి. మకావో, నీళ్ల పక్షులు, నెమళ్లు, మొసళ్లు, నాగుపాములను దత్తత తీసుకోవచ్చని నెహ్రూ జంతుప్రదర్శన శాల క్యూరేటర్ వసంత ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
జంతువులను దత్తత తీసుకుంటే...పన్ను మినహాయింపు
జూపార్కులోని జంతువులను దత్తత తీసుకునే వారికి ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80 జి ప్రకారం ఆదాయపన్ను మినహాయింపు కల్పిస్తారు. జూపార్కుకు విరాళాలు అందించినా, వన్యప్రాణులను దత్తత తీసుకున్న వారికి జూపార్కులోని అతిథి గృహాన్ని కేటాయిస్తారు. ఏడాదికి రెండు సార్లు 10 మందికి ఉచితంగా జూ ఎంట్రీ టికెట్లు ఇస్తామని జూపార్కు పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ హనీఫ్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. జంతువులను దత్తత తీసుకుంటే దత్తత తీసుకున్న వారి పేర్లను ఆయా జంతువుల వద్ద బోర్డుల్లో డిస్ ప్లే చేస్తామని ఆయన చెప్పారు.
వన్యప్రాణులకు పోషకాహారం
జూపార్కులోని వన్యప్రాణులకు పోషకాహారం అందించడంతోపాటు మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించేందుకు కార్పొరేట్ సోషల్ రెస్సాన్స్ బులిటీ కింద పలు కార్పొరేట్ సంస్థలు ముందుకు వచ్చి ఆర్థికసాయం అందిస్తున్నాయి.

టాయ్ ట్రైన్‌లో పిల్లల విహారం
గ్లాండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ రోడ్ ట్రైన్‌ను విరాళంగా ఇచ్చింది. ఈ టాయ్ ట్రైన్ మూడు బోగీలతో జూపార్కులో సందర్శకులను వన్యప్రాణుల సందర్శనకు తీసుకెళుతోంది. చిన్న పిల్లలు కేరింతలు కొడుతూ ఈ టాయ్ ట్రైన్ లో జూపార్కులో విహరిస్తున్నారు.
ఖడ్గ మృగాలకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నైట్ ఎన్ క్లోజర్
ఖడ్గ మృగాలకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నైట్ ఎన్ క్లోజర్ ను నిర్మించింది. ఖడ్గ మృగాలు సేదతీరేందుకు వీలుగా నిర్మించిన ఈ ఎన్ క్లోజర్ కు సీఎస్సార్ కింద నిధులిచ్చింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2011 వ సంవత్సరం నుంచి పులులను దత్తత తీసుకుంది. పులుల ఆలనా పాలన, వాటి తిండి కోసం అవుతున్న ఖర్చును ఎస్బీఐ విరాళం కింద అందజేస్తుంది.
జూపార్కులో సోలార్ వెలుగులు
హైదరాబాద్ నగరంలోని ఖైరతాబాద్ పిత్తి ఇంజినీరింగ్ లిమిటెడ్ జూపార్కులో ఏనుగు, ఒక సింహాన్ని దత్తత తీసుకుంది. దీంతోపాటు జూపార్కులో 5 కేవీఏ సామర్ధ్యంతో కూడిన సోలార్ పవర్ గ్రిడ్ ను నిర్మించి సోలార్ వెలుగులు పంచింది.
ఎన్ఆర్ఐ ఔదార్యం
ఎన్ఆర్ఐ ఎన్ ఎస్ రాంజీ వన్యప్రాణుల పట్ల ఔదార్యం చూపించారు. 2011వ సంవత్సరం నుంచి ఏనుగు, నీటిగుర్రం, నిప్పుకోడి, ఖడ్గమృగాన్ని దత్తత తీసుకుంటూ వన్యప్రాణుల పట్ల రాంజీకి ఉన్న ప్రేమను చూపిస్తున్నారు. పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు గడ్డం వంశీకృష్ణ ముందుకు వచ్చి జూపార్కుకు రెండు బైక్ లను విరాళంగా అందించారు.
చిన్నారులు సైతం...
పెద్దలే కాకుండా చిన్నారులు సైతం వారి ప్యాకెట్ మనీతో హైదరాబాద్ జూపార్కులోని జంతువులను దత్తత తీసుకున్నారు. హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలి నాసర్ స్కూలు విద్యార్థులు జూపార్కులోని తెల్లపులిని దత్తత తీసుకున్నారు.చిన్నారులు సైతం తమకు వన్యప్రాణుల పట్ల ప్రేమ ఉందని నిరూపించారు. తమ పాఠశాల విద్యార్థులు జంతువుల దత్తతకు ముందుకు రావడం అభినందించదగ్గ విషయమని నాసర్ స్కూలు ప్రిన్సిపల్ వ్యాఖ్యానించారు.
జంతువుల దత్తతకు ముందుకు వచ్చిన కొణిదెల ఉపాసన
ప్రముఖ సినీ హీరో కొణిదెల రాంచరణ్ భార్య, అపోలో ఆసుపత్రి వైస్ ఛైర్మన్ కొణిదెల ఉపాసన గత ఏడాది ఏనుగును దత్తత తీసుకున్నారు. ఈ ఏడాది కూడా జూపార్కులోని ఇతర జంతువులను దత్తత తీసుకుకోవాలని యోచిస్తున్నట్లు జూపార్కు పీఆర్ఓ హనీఫ్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
అటవీశాఖ అధికారి కుమారుడి జంతువుల దత్తత
తెలంగాణ ఐఎఫ్ఎస్ అధికారి, జూపార్కు డైరెక్టర్ డాక్టర్ ఎస్ హీరేమత్ కుమారుడు ఏడేళ్ల యువన్ ఎస్ హీరేమత్ ఏడు జంతువులను దత్తత తీసుకున్నాడు. తన ఏడవ జన్మదినం సందర్భంగా యువన్ హీరేమత్ ఖడ్గమృగం, కొండముచ్చు,. పులి, నక్క, నిప్పుకోడి, అడవి కుక్క, ఆస్ట్రిచ్ పక్షిని నెలరోజుల పాటు దత్తత తీసుకొని వాటికయ్యే ఖర్చును చెక్కు రూపంలో తన తండ్రి అయిన హీరేమత్ కు అందజేశారు. జంతువుల దత్తతకు జంతుప్రేమికుడైన తన కుమారుడు యువన్ కూడా ఆసక్తి చూపించారని అటవీశాఖ అధికారి హీరేమత్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. వన్యప్రాణుల పరిరక్షణతోనే పర్యావరణ పరిరక్షణ, జీవ వైవిధ్యం సాధ్యమవుతుందని హీరేమత్ పేర్కొన్నారు.
సీనియర్ ఐఎఎస్ కుమార్తె ఇషికా రంజన్ ...
తెలంగాణ రాష్ట్ర ఐటీ విభాగం కార్యదర్శి, సీనియర్ ఐఎఎస్ అధికారి జయేష్ రంజన్ కుమార్తె ఇషికా రంజన్ జూపార్కులోని ఖడ్గమృగాన్ని ఏడాది పాటు దత్తత తీసుకున్నారు. తన తండ్రి జయేష్ రంజన్, తల్లి, సోదరుడితో కలిసి జూపార్కుకు వచ్చిన ఇషితా రంజన్ ఖడ్గమృగాన్ని దత్తత తీసుకొని దానికయ్యే ఖర్చును అందజేశారు.తనకు చిన్న నాటి నుంచి జంతువులంటే ప్రేమ అని, అందుకే తాను ఈ ఏడాది ఖడ్గ మృగాన్ని దత్తత తీసుకున్నానని ఇషికా రంజన్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
ఆర్మీ అధికారి పెన్షన్ డబ్బుతో జంతువుల దత్తత
ఇండియన్ ఆర్మీకి చెందిన మాజీ అధికారి అల్లాడి కృష్ణమూర్తి గత కొన్నేళ్లుగా హైదరాబాద్ జూపార్కులో పలు జంతువులను దత్తత తీసుకుంటున్నారు. ఈ ఏడాది కొండ చిలువను మూడు నెలల పాటు దత్తత తీసుకున్నారు.మాజీ సైనికుడిగా తనకు వస్తున్న పెన్షన్ డబ్బులో నుంచి కొంత భాగాన్ని తాను జంతువుల దత్తత కోసం వెచ్చిస్తున్నానని అల్లాడి కృష్ణమూర్తి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. పర్యావరణ పరిరక్షణ కోసం మనం వన్యప్రాణులను కాపాడు కోవాల్సిన అవసరముందని ఆయన పేర్కొన్నారు. తనకు జంతువులంటే అమితమైన ప్రేమ అని, అందుకే పెన్షన్ డబ్బులో కొంతభాగాన్ని వన్యప్రాణుల కోసం వెచ్చిస్తున్నానని అల్లాడి కృష్ణ మూర్తి వివరించారు.
జంతువుల దత్తతకు ముందుకు రాని సెలబ్రిటీలు
జూపార్కులో జంతువుల దత్తతకు సెలబ్రిటీలు ముందుకు రావడం లేదు.హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్‌లో ఏ సెలబ్రిటీ కూడా ఏ జంతువును దత్తత తీసుకోలేదు. అయినప్పటికీ కొంతమంది జంతుప్రేమికులు,కార్పొరేట్ కంపెనీలు కలిసి 2016-17 సంవత్సరంలో 25 జంతువుల సంరక్షణ కోసం రూ. 43.62 లక్షల మొత్తాన్ని విరాళంగా ఇచ్చాయి. ఈ ఏడాది జూపార్కుకు జంతువుల దత్తత, కార్పొరేట్ రెస్సాన్స్ బులిటీ ద్వారా కోటి ఇరవై లక్షల ఆదాయం వచ్చింది.