వరదల నివారణకు  నాలాల ఆక్రమణలు, చెత్త తొలగింపుపై హైడ్రా దృష్టి
x
నాలాలో పూడిక తొలగింపు

వరదల నివారణకు నాలాల ఆక్రమణలు, చెత్త తొలగింపుపై హైడ్రా దృష్టి

ఇన్నాళ్లు చెరువుల ఆక్రమణలను తొలగించిన హైడ్రా వర్షాకాలం ఆరంభంతో నాలాల ఆక్రమణలు, చెత్త తొలగింపుపై దృష్టి సారించింది.


హైదరాబాద్ నగరంలోని పలు నాలాలు ఆక్రమణలతో కుచించుకు పోవడంతో వరదనీరు పారే మార్గం లేక లోతట్టు బస్తీలు, కాలనీలు వర్షమొస్తే చాలు జలమయం అవుతున్నాయి. వర్షాకాలం ఆరంభంతో నాలాల ఆక్రమణల తొలగింపు, నాలాల్లో పేరుకుపోయిన చెత్త ఎత్తివేతపై హైడ్రా దృష్టి సారించింది. నగరంలోని పలు నాలాల్లో చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోయాయి. దీంతో రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు పొక్లెయినర్లతో నాలాల్లో చెత్త‌ను తొల‌గిస్తున్నారు. వరదనీటి ప్రవాహానికి ఏర్పడిన ఆటంకాలను తొలగిస్తున్నారు.


పూడుకుపోయిన నాలాలు
చెత్త‌తో నాలాలు పూడుకుపోయాయి. క‌ల్వ‌ర్టులు జామ‌య్యాయి. ఏ క‌ల్వ‌ర్టును చూసినా ట‌న్నుల కొద్ది చెత్త బ‌య‌ట‌ప‌డుతోంది. కొన్ని చోట్ల నాలా ఆన‌వాళ్లే లేని ప‌రిస్థితి నగరంలో నెలకొంది. మ్యాన్‌హోళ్ల మూత‌లు తీస్తే చాలు ఇసుక మేట‌లు క‌నిపిస్తున్నాయి. ఇలాంటి ప‌రిస్థితిలో వ‌ర్షపు నీరు వెళ్లే ప‌రిస్థితి క‌నిపించ‌డంలేదు. దీంతో నగరంలోని 150 మాన్సూన్ ఎమ‌ర్జెన్సీ టీమ్‌(ఎంఈటీ)లు ,51 హైడ్రా డీఆర్ ఎఫ్ బృందాలు క‌ల‌సి నాలాలు, క‌ల్వ‌ర్టుల వ‌ద్ద పూడిక తీత ప‌నులు చేపట్టాయి.

నాలాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు
నాలాల్లో పూడిక తీసే పనులను హైడ్రా చేపట్టింది. ఈ క్రమంలో పూడిక తీస్తుంటే కొన్ని చోట్ల ట‌న్నుల కొద్దీ ప్లాస్టిక్ వ్య‌ర్థాలు, చెత్త బ‌య‌ట ప‌డుతోంది. యూసుఫ్‌గూడ ప‌ర‌స‌రాల్లోని మ‌ధురాన‌గ‌ర్, కృష్ణాన‌గ‌ర్ వ‌ద్ద వ‌ర‌ద కాల్వలో పేరుకుపోయిన చెత్త‌ను హైడ్రా బృందాలు తొల‌గించాయి.గ‌చ్చిబౌలిలోని జ‌నార్ద‌న్‌రెడ్డి న‌గ‌ర్‌లోని నాలాల్లో పేరుకుపోయిన చెత్త‌ను హైడ్రా తొల‌గించింది. కాప్రా సర్కిల్ వార్డు నెం.2 మార్కండేయ కాలనీలో నాలా క్యాచ్‌పిట్ ఏరియాలో పేరుకుపోయిన చెత్త‌ను తొల‌గించారు. ఎల్‌బీన‌గ‌ర్ స‌ర్కిల్ ప‌రిధిలో ఆర్‌సీఐ రోడ్డు, మిథిలానగర్ దగ్గర మంత్రాల చెరువు నుంచి జిల్లెలగూడ చెరువునకు వెళ్లే నాలా లో ఉన్న పూడికను హైడ్రా డీఆర్ ఎఫ్‌,ఎంఈటీ బృందాలు జేసీబీ ద్వారా తొలగించాయి.

వర్షం లేని సమయంలో...
వర్షాలు లేని సమయంలో ఖాళీగా ఉండకుండా హైడ్రా ఆ సమయాన్ని వరద నివారణకు చేపట్టే చర్యలపై దృష్టి పెడుతోంది. పరిధులు గీసుకొని ఉండకుండా 150 హైడ్రా మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు, 51 హైడ్రా డీ ఆర్ ఎఫ్ బృందాలు నాలాల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించే పనుల్లో నిమగ్నం అయ్యాయి. ఈ క్రమంలోనే జీహెచ్ఎంసీ పరిధిలోని 940 కల్వర్టుల వద్ద పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్తను తొలగించాయి.నాలాల్లో చెత్త/సిల్ట్ తొలగించడం వల్ల నీటి ప్రవాహాన్నిమెరుగుపరుస్తోంది.

నాలా ఆక్రమణల తొలగింపు
రెండు కిలోమీట‌ర్ల మేర నిర్మించాల్సి ఉన్న నాలా కేవ‌లం 230 మీట‌ర్ల మేర పూర్త‌య్యింది. న‌ల్ల‌గండ్ల హుడా కాల‌నీలో స‌మ‌స్య త‌లెత్తింది. ఒక అపార్టుమెంట్ ప్ర‌హ‌రీతో పాటు కొంత నిర్మాణం నాలాపైనే ఉంది.ఇలా మ‌రి కొన్ని చోట్ల కూడా స‌మ‌స్య త‌లెత్త‌డంతో ఎస్ ఎన్‌డీపీ అధికారులు హైడ్రాను ఆశ్ర‌యించారు.దీంతో హైడ్రా రంగంలోకి దిగింది.నాలా ప‌రిధిలో ఉన్న నిర్మాణాన్ని హైడ్రా తొల‌గించింది.నాలాకు ఇరువైపులా ఉన్న ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించి ప‌నులు జ‌రిగేందుకు అవ‌కాశం క‌ల్పించింది.న‌ల్ల‌గండ్ల చెరువు నుంచి మొద‌లై డాక్ట‌ర్స్ కాల‌నీ, రైల్ విహార్‌, న‌ల్ల‌గండ్ల హుడా కాల‌నీ, ఓల్డ్ శేరిలింగంప‌ల్లి విలేజ్‌, నేతాజీన‌గ‌ర్ మీదుగా బీహెచ్ఈఎల్ చౌర‌స్తా వ‌ద్ద ఉన్న ప్ర‌ధాన నాలాలో ఈ నాలా క‌లుస్తుంది. నాలా ఆక్ర‌మ‌ణ‌ల‌కు గుర‌వ్వ‌డంతో ప్ర‌తి ఏటా వ‌ర్షాకాలంలో నీట మునిగే ముప్పు ఈ కాల‌నీల‌కు త‌ప్పుతోంద‌ని స్థానికులు సంతోషం వ్య‌క్తంచేశారు.


Read More
Next Story