చెరువుల కబ్జాదారులపై ‘హైడ్రా’ ఉక్కుపాదం
x

చెరువుల కబ్జాదారులపై ‘హైడ్రా’ ఉక్కుపాదం

హైదరాబాద్‌లో చెరువులు, కుంటలు, నాలాల పరిరక్షణకు హైడ్రా రంగంలోకి దిగింది. చెరువుల్లో ఆక్రమణలను తొలగించేందుకు అధికారులు కబ్జాదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు.


హైదరాబాద్ నగరంతోపాటు నగర శివారు ప్రాంతాల్లో ఉన్న 400కు పైగా చెరువులు, కుంటలు 60 నుంచి 80 శాతం వరకు కబ్జాదారుల కబంధ హస్తాల్లో చిక్కుకున్నాయి.

- హైదరాబాద్ నగరంతోపాటు శివారు ప్రాంతాలను కలుపుకొని 2,500 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో హైడ్రా పరిధిని నిర్ణయించారు. చెరువుల పరిరక్షణపై హైడ్రా మేథోమథనం చేసి ప్రణాళిక రూపొందించనున్నారు.
- చెరువులు, కుంటలే కాకుండా పార్కు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణే పరమావధిగా హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) ఏర్పాటైంది. హైడ్రా కమిషనరుగా ఐపీఎస్ అధికారి ఏవీ రంగనాథ్ రంగంలోకి దిగి చెరువు స్థలాల్లో అక్రమంగా నిర్మించిన భవనాల కూల్చివేతకు చర్యలు చేపట్టారు.

ఎన్ఆర్ఎస్‌సీ నివేదిక ఏం చెప్పిందంటే...
నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ విడుదల చేసిన తాజా నివేదికలో హైదరాబాద్ నగరంతోపాటు శివారు ప్రాంతాల్లో చెరువుల కబ్జాలు వెలుగుచూశాయి. హైదరాబాద్ నగరంలో 400 కు పైగా చెరువులు, కుంటలు ఉండగా వాటిలో 60 నుంచి 80 శాతం కబ్జాదారుల కబంధ హస్తాల్లో చిక్కుకున్నాయి. మరికొన్ని చెరువులైతే కబ్జాలతో అంతర్థానం అయ్యాయి. గడచిన 44 ఏళ్లలో జరిగిన చెరువులు,కుంటలు, నాలాల కబ్జాలను ఎన్ఆర్ఎస్‌సీ నివేదిక వెల్లడించింది.

ఎన్ఆర్ఎస్‌సీ నివేదిక సాయంతో ఆక్రమణల కూల్చివేతలు
ఎన్ఆర్ఎస్‌సీ నివేదిక సాయంతో హైడ్రా అధికారులు పోలీసు బలగాలతో వచ్చి బుల్డోజర్ల సాయంతో ఆక్రమణల కూల్చివేతలు ప్రారంభించారు.చందానగర్ లో ఈర్ల చెరువులో ఆక్రమణలను తొలగించేందుకు హైడ్రా అధికారులు చర్యలు తీసుకోనున్నారు.. గతంలో చెరువు బఫర్ జోన్, ఎఫ్ టీఎల్ పరిధిలో పలు భవనాల నిర్మాణానికి మున్సిపాలిటీ అనుమతి ఇచ్చింది. చెరువు స్థలాలుగా గుర్తించి హైడ్రా వాటిని తొలగించేందుకు సమాయత్తం అయ్యారు. నేషనల్ రీమోట్ సెన్సింగ్ ఏజెన్సీ నివేదిక ప్రకారం గత 44 ఏళ్ల కాలంలో పలు చెరువులు అంతర్ధానం అయ్యాయి.

మూడు దశలవారీగా హైడ్రా ప్రణాళిక
చెరువులు, కుంటలను పరిరక్షించడంతోపాటు జలవనరులను పునర్జీవం కల్పించేందుకు హైడ్రా మూడు దశలవారీగా ప్రణాళిక రూపొందించిందని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ప్రస్థుతం చెరువు శిఖం భూములు, బఫర్ జోన్లలో ఆక్రమణలను అడ్డుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. రెండో దశలో భాగంగా చెరువు స్థలాలు, కుంటలు, పార్కు స్థలాలు, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి నిర్మించిన భవనాల యజమానులకు నోటీసులు జారీ చేసి వాటిని కూల్చివేస్తామని రంగనాథ్ తెలిపారు. మూడో దశ కింద చెరువుల్లోని పూడికను తొలగించి వర్షపునీటిని గొలుసుకట్టు చెరువులకు మళ్లించడం ద్వారా వాటికి పునరుజ్జీవనం కల్పిస్తామని కమిషనర్ వివరించారు.

చెరువు శిఖం భూమిలో ఆక్రమణల తొలగింపు
హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా)అధికారులు పోలీసు బలగాలతో కలిసి శివరాంపల్లిలోని బం రుక్ ఉద్-దౌలా చెరువు స్థలంలో అనధికారిక నిర్మాణాలపై విరుచుకుపడ్డారు. పలు భవనాలను బుల్డోజర్లతో కూల్చివేశారు. దీంతోపాటు కింగ్స్‌ కాలనీ, శాస్త్రిపురం ప్రాంతాల్లో కొందరు వీఐపీల ఇళ్లను కూడా కూల్చివేశారు. ఆక్రమణదారులు, మజ్లిస్ నేతలు నిరసనలు తెలిపినా చెరువు స్థలంలో ఆక్రమణలను అధికారులు తొలగించారు. నాలాలు కూడా పూడుకుపోవడం అవి మాయమయ్యాయి.

ప్రజాప్రతినిధుల ఇళ్ల కూల్చివేత
బహదూర్ పురా ఎమ్మెల్యే ముహ్మద్ ముబీన్, ఎమ్మెల్సీ మీర్జా రహమత్ బేగ్ లు ప్రభుత్వ స్థలాల్లో నిర్మించిన భవనాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, నీటిపారుదల శాఖ, పోలీసు, అగ్నిమాపకశాఖ, రెవెన్యూ అధికారులతో కలిసి చెరువు స్థలాల్లో అక్రమంగా నిర్మించిన భవనాలను కూల్చివేశారు. బం రుక్ ఉద్-దౌలా చెరువుకు చెందిన పది ఎకరాల స్థలంలో నిర్మించిన ఆక్రమణలను తొలగించామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ చెప్పారు.

బం రుక్ ఉద్-దౌలా చెరువు
నాడు నిజాం నవాబు ప్యాలెస్ కు మంచినీరు అందించిన బం రుక్ ఉద్-దౌలా చెరువు కబ్జాదారుల వల్ల నేడు అంతర్థానం అయిందని సోషల్ యాక్టివిస్టు, కాంగ్రెస్ నాయకురాలు డాక్టర్ లూబ్నా సర్వత్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. తాను 2018వ సంవత్సరంలో ఈ చెరువును పరిరక్షించాలని కోరుతూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ లో కేసు వేశానన్నారు. చెరువు శిఖం భూముల్లో రోడ్లు కూడా నిర్మించారని ఆమె పేర్కొన్నారు.చెరువు స్థలం సంరక్షించేందుకు సర్వే చేయాలని తాను కోరగా అధికారులు కబ్జాదారులకు భయపడుతున్నారని ఆమె చెప్పారు. దీంతో తాను ఓ అధికారిని తీసుకువెళ్లి సర్వే చేసి కబ్జాలను గుర్తించామన్నారు. చెరువు స్థలం కబ్జాపై తాను హైకోర్టులో కూడా పిటిషన్ వేశానన్నారు.

చెరువు స్థలాలు కొనవద్దు : హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్
హైదరాబాద్ నగరంలోని చెరువులు, పార్కు, ప్రభుత్వ స్థలాలు కొనవద్దని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సూచించారు.56 చెరువులను రియల్టర్లు కబ్జా చేసి భవనాలు నిర్మించి విక్రయించారు. కాలనీ సంక్షేమ సంఘాలు పార్కు స్థలాలను పరిరక్షించుకోవాలని ఆయన కోరారు. హైడ్రాకు చెరువులు, ప్రభుత్వ, పార్కు స్థలాల కబ్జాలపై ప్రతీ రోజూ ప్రజల నుంచి వందల సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయని, వీటిపై తాము చర్యలు తీసుకుంటున్నామని రంగనాథ్ చెప్పారు. ప్రజలు మేలుకోలని, చెరువు స్థలాలను ప్రజలు కొనుగోలు చేయవద్దని ఆయన కోరారు.

76 హైడ్రా బృందాలు
చెరువులు, పార్కులు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు హైడ్రా 76 అధికారుల బృందాలను ఏర్పాటు చేయనున్నట్లు ఆ సంస్థ కమిషనర్ ఏవీ రంగనాథ్ చెప్పారు. హైడ్రా రాజకీయాలకు అతీతంగా ఎంత పెద్ద వారున్నా కబ్జాలను తొలగిస్తామని ఆయన స్పష్టం చేశారు. హైడ్రా ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఓ పోలీసుస్టేషన్ ను ఏర్పాటు చేయబోతున్నట్లు ఆయన వివరించారు.


Read More
Next Story