హైడ్రాకు చట్టబద్దత వచ్చేసింది
విమర్శకుల నోళ్ళని రేవంత్ రెడ్డి క్యాబినెట్ మూయించేసింది. ఏ విషయంలో అంటే హైడ్రాకు చట్టబద్దత కల్పించటం ద్వారా.
విమర్శకుల నోళ్ళని రేవంత్ రెడ్డి క్యాబినెట్ మూయించేసింది. ఏ విషయంలో అంటే హైడ్రాకు చట్టబద్దత కల్పించటం ద్వారా. చెరువులు, కాల్వలు, కుంటల ఆక్రమణలను తొలగించటం, ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకుని ఆయా శాఖలకు అప్పగించటంతో పాటు మళ్ళీ ఆక్రమణలు జరగకుండా జలవనరులను కాపాడటమే హైడ్రా ముఖ్య ఉద్దేశ్యం. అందుకనే ఉత్తర్వులు జారీచేయటం ద్వారా హైడ్రాను ప్రభుత్వం ఏర్పాటుచేసింది. హైడ్రాను ఉత్తర్వాల ద్వారా ఏర్పాటైతే చేసింది కాని చట్టబద్దతను చాలామంది ప్రశ్నిస్తున్నారు.
ఈ నేపధ్యంలోనే శుక్రవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో హైడ్రాకు చట్టబద్దత కల్పిస్తు తీర్మానం జరిగింది. క్యాబినెట్ తీర్మానం అయినంత మాత్రాన హైడ్రాకు చట్టబద్దత వచ్చినట్లు కాదు. అయితే చట్టబద్దత ఇవ్వటానికి క్యాబినెట్ నిర్ణయం చాలా అవసరం. క్యాబినెట్ నిర్ణయం జరిగింది కాబట్టి తొందరలోనే జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు పెట్టి పాస్ చేయించి తర్వాత గవర్నర్ ఆమోదం తీసుకోవాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయించింది. ఒకవేళ సమావేశాల నిర్వహణ ఆలస్యమైతే ఆర్డినెన్స్ జారీచేయటం ద్వారా హైడ్రాకు గవర్నర్ ఆమోదం పొందాలనే ఆలోచనలో ఉంది. ఏదేమైనా తొందరలోనే హైడ్రాకు చట్టబద్దత రావటం ఖాయం.
ఎందుకంటే హైడ్రాపై ప్రభుత్వం చాలా కీలకమైన బాధ్యతలను మోపబోతోంది. మూసీ నది ప్రక్షాళన, చెరువులు, కాల్వలతో పాటు కుంటలను ఆక్రమించిన మరిన్ని నిర్మాణాలను తొలగించటం లాంటి చాలా బాధ్యతలు హైడ్రాకు ఉన్నాయి. ఇవన్నీ జరగాలంటే వీలైనంత తొందరలోనే హైడ్రాకు చట్టబద్దత రావాలి. హైడ్రాకు చట్టబద్దత నిర్ణయం తీసుకోవటంతో పాటు 169 మంది సిబ్బందిని ఇవ్వాలని కూడా డిసైడ్ చేసింది. ఇప్పటికే హైడ్రాకు 359 మంది సిబ్బంది ఉన్న విషయం తెలిసిందే. ఎలాగూ హైడ్రాకు చట్టబద్దత ఇస్తు నిర్ణయం జరిగిపోయింది కాబట్టి దాని విధివిధనాలపైన కూడా తొందరలోనే ప్రభుత్వం ప్రకటన చేయబోతోంది.