మహబూబ్ నగర్లో హైడ్రా తరహా కూల్చివేతలు
x

మహబూబ్ నగర్లో హైడ్రా తరహా కూల్చివేతలు

హబూబ్ నగర్ జిల్లాలో హైడ్రా తరహా కూల్చివేతలు కలకలం రేపాయి.


మహబూబ్ నగర్ జిల్లాలో హైడ్రా తరహా కూల్చివేతలు కలకలం రేపాయి. జిల్లా కేంద్రం పరిధిలోని ఆదర్శ్ నగర్ లోని ఇళ్లను మున్సిపల్ అధికారులు నేలమట్టం చేశారు. సుమారు 75 కు పైగా ఇళ్లను కూల్చివేయడంతో నివాసితులంతా నిరాశ్రయులయ్యారు. నిర్మాణాలు అనధికారమని గురువారం తెల్లవారుజామున మున్సిపల్ అధికారులు కూల్చివేతలు ప్రారంభించారు. తమ కళ్ళముందే ఇళ్ళు కూలిపోతుంటే నివాసితులంతా బోరున విలపించారు. శిథిలాల కింద నుంచి పిల్లలు, పెద్దలు తమ వస్తువులను సేకరిస్తున్న భావోద్వేగ దృశ్యాలకు సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి.

తాము ఎంతోకాలంగా ఇక్కడ నివశిస్తున్నామని, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అధికారులు తమ ఇళ్లను ఆకస్మికంగా కూల్చివేశారని బాధితులు వాపోతున్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమే తమకు పట్టాలు ఇచ్చిందని చెబుతున్నా వినకుండా అక్రమ నిర్మాణాలు అంటూ కూల్చివేతలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హయాంలోనే పట్టాలు ఇచ్చి ఇప్పుడు అదే కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చివేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

"చాలా ఏళ్లుగా ఇక్కడే నివసిస్తున్నాం. మున్సిపల్ పన్ను చెల్లించి విద్యుత్ కనెక్షన్లు కూడా పొందాము. అయినా అధికారులు మా ఇళ్లను కూల్చేశారని లబోదిబోమంటున్నారు. తెల్లవారుజామున 3 నుంచి 4 గంటల ప్రాంతంలో మేము గాఢ నిద్రలో ఉండగా కూల్చివేతలు ప్రారంభించారని, కట్టుబట్టలతో అప్పటి నుంచి నిద్రాహారాలు లేకుండా బయటే ఉన్నామని మీడియాకి తెలిపారు.

Read More
Next Story