
Hydraa target | హైడ్రా అసలు టార్గెట్ వివరించిన రంగనాధ్
ఆక్రమణలకు గురైన చెరువులను పరిశీలించి, ఆక్రమణలను తొలగించిన తర్వాత చుట్టుపక్కల భూముల ధరలు బాగా పెరుగుతున్నట్లు రంగనాధ్ తెలిపారు.
ఇప్పుడు హైడ్రా చేపడుతున్న చెరువుల పునరుద్ధారణ 100 ఏళ్ళను దృష్టిలో పెట్టుకుని చేస్తున్నదని హైడ్రా కమీషనర్ ఏవీ రంగనాధ్(Hydraa Commissioner AV Ranganath) చెప్పారు. శనివారం బషీర్ బాగ్(Basheerbagh)లో జరిగిన ‘మీట్ ది ప్రెస్’ లో కమీషనర్ మాట్లాడారు. చెరువుల(Tanks)పునరుద్ధారణ జరగకపోవటం వల్లే జనాలకు తీవ్రమైన అనారోగ్యాలు వస్తున్నట్లు రంగనాధ్ అభిప్రాయపడ్డారు. సున్నంచెరువు మురుగు నీటిని పరీక్షచేయిస్తే ఆనీటిలో క్యాన్సర్ కారకాలు ఉన్నట్లు తేలిందన్నారు. చాలాకాలంగా చుట్టుపక్కలున్న జనాలు ఇదే చెరువునీటిని ఉపయోగిస్తున్న విషయాన్ని కమీషనర్ గుర్తుచేశారు. ఇలాంటి కలుషిత నీటి చెరువులు ఇంకా చాలా ఉన్నాయని కూడా అన్నారు.
అలాగే మరో చేరువు నీటిని పరిశీలిస్తే అందులో కూడా తీవ్రమైన అనారోగ్యా కారకాలు ఉన్నట్లు తేలిందన్నారు. కోర్టు, ప్రజల ముందు చెరువుల కబ్జా వివరాలు ఉంచేటప్పుడు ఫుల్ ట్యాంక్ లెవల్(ఎఫ్టీఎల్), బఫర్ జోన్ వివరాలు పక్కాగా ఉండేట్లు చూసుకుంటున్నామన్నారు. తాము ఆక్రమణలను తొలగించి సుందరీకరణ చేసిన చెరువుల చుట్టుపక్కల భూముల ఖరీదు సగటున ఎకరం 50 కోట్లుంటుందని చెప్పారు. ఆక్రమణలకు గురైన చెరువులను పరిశీలించి, ఆక్రమణలను తొలగించిన తర్వాత చుట్టుపక్కల భూముల ధరలు బాగా పెరుగుతున్నట్లు రంగనాధ్ తెలిపారు. చెరువుల కబ్జాలను తొలగించినట్లుగానే తొందరలోనే నాలాల కబ్జాలను కూడా తొలగించి అభివృద్ధి చేయబోతున్నట్లు వివరించారు.
జలవనరుల సంరక్షించటమే హైడ్రా ముఖ్యఉద్దేశంగా చెప్పారు. హైడ్రాకు సాయంచేయటానికి చాలా స్వచ్ఛందసంస్థలు ముందుకు వస్తున్నాయన్నారు. ఫాతిమా సంస్థ గురించి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తు తమ పరిధిలో 900 చెరువులు వున్నట్లు చెప్పారు. అన్నీ అంశాలను పరిశీలించి ఎఫ్టీఎల్, బఫర్ జోన్ను నిర్ధారించి ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చింది 130 చెరువులకు మాత్రమే అన్నారు. ఫాతిమా సంస్థ వున్న చెరువు ఫైనల్ నోటిఫికేషన్ ప్రక్రియ ఇంకా కాలేదన్నారు. అందుకనే ఫాతిమా జోలికి ఇంకా వెళ్ళలేదన్నారు.
ఎఫ్టీఎల్, బఫర్ జోన్ అంశాలను ఫైనల్ చేయటానికి అనేక అంశాలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఇప్పుడు జరుగుతున్న కసరత్తు అంతా దానికోసమే అన్నారు. బఫరజన్లో ఇప్పటికే వున్న ప్రాపర్టీలను ముట్టుకోబోమని రంగనాధ్ హామీ ఇచ్చారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్ లో జరిగిన ఆక్రమణలుపోను మిగిలిన చెరువులను కాపాడటమే హైడ్రా ముఖ్యఉద్దేశంగా చెప్పారు. కూకటపల్లి సున్నంచెరువు ప్రాతంలో ఇళ్లను ముట్టుకోకుండా కేవలం కమర్షియల్ ప్రాపర్టీని మాత్రమే తొలగించిన విషయాన్ని గుర్తుచేశారు.
ప్రైవేటు ప్రాపర్టీలజోలికి హైడ్రా వెళ్ళటంలేదని అవసరం అనుకుంటే ఎవరైనా ఓనర్లు కోర్టుకి వెళ్లి తమ ఓనర్షిప్పును నిరూపించుకోవచ్చన్నారు. గండిపేట ప్రాంతంలో చాలామంది ప్రజాప్రనిధుల ఫార్మ్ హౌసులను తొలగించినట్లు మరో ప్రశ్నకు జవాబిచ్చారు. ఏఐఎంఐఎం మద్దతుదారుల చెరువుల ఆక్రమణల తొలగింపు విషయంలో హైడ్రా ఎలాంటి ఉపేక్ష చూపటంలేదని ఒక ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఎప్టీఎల్ పరిధిలో ఉన్నాయనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫామ్ హౌసుల వివరాలను స్టడీ చేస్తున్నట్లు చెప్పారు. ఎప్టీఎల్, బఫర్ జోన్ అంశాలపై తమకు పక్కాగా సమాచారం అందిన తర్వాత సర్వేలు నిర్వహించి నిర్ధారణ అయిన ఫామ్ హౌసులను తొలగించబోతున్నట్లు చెప్పారు.
హైడ్రా అనే సంస్థ ప్రభుత్వానికి వరమా శాపమా అన్నది కాలమే సమాధానం చెబుతుందని ఇంకో ప్రశ్నకు రంగనాధ్ సమాధానమిచ్చారు. కూకట్ పల్లి చెరువు బఫర్ జోన్లో ఉన్న ఆక్రమణలను తొలగించేటపుడు గోలచేసిన జనాలే ఇప్పుడు తమను అభినందిస్తున్నట్లు చెప్పారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్ ను శాస్త్రీయంగా ఫైనల్ చేయటానికి నిపుణులతో మాట్లాడుతు అవసరమైన కసరత్తులు చేస్తున్నట్లు చెప్పారు. చెరువుల మధ్య లింకులు ఏర్పాటు విషయాన్ని పరిశీలిస్తున్నామని ఇంకో ప్రశ్నకు సమాధానమిచ్చారు. అధ్యయనం చేయాల్సిన బుల్కపూర్ చెరవు, నాలా లాంటి గొలుసుకట్టు చెరువులు, నాలాలు చాలా వున్నాయన్నారు. చెరువుల లింకప్ ప్రక్రియకు సుమారు 2ఏళ్ళు పట్టవచ్చని అభిప్రాయపడ్డారు.
బీరమ్మాలగూడ చెరువు విషయంలో గూడా యాక్షన్ తీసుకుంటామన్నారు. చెరువుల ఆక్రమణలు, నాలాల కబ్జాలకు సంబంధించి హైడ్రా దగ్గర 25 వేల ఫిర్యాదులున్నాయన్నారు. హుస్సేన్ సాగర్ నీటిని తాగు నీటిగా మార్చేందుకు, ఆక్రమాణల తొలగింపుకు చాలా సమయం పడుతుందన్నారు. దానికి చాలా బడ్జెట్ అవసరమని, ఆ బడ్జెట్ తో 100 చెరువులను పునరుద్దరించవచ్చని రంగనాధ్ చెప్పారు. ఎంఎల్ఏలు, ప్రజా ప్రతినిధులు తనతో మాట్లాడుతూ జిల్లాల్లో కూడా హైడ్రాను విస్తరించాలని అడుగుతున్నట్లు చెప్పారు. అయితే ఈ విషయమై నిర్ణయం తీసుకోవాల్సింది ప్రభుత్వమే అన్నారు. వర్షపునీటిని ఒడిసి పట్టుకునేందుకు అవసరమైన ఇంకుడుగుంతలు తవ్వకం కోసం భూగర్భనీటి పరిస్ధితిని అధ్యయనం చేస్తున్నట్లు చెప్పారు. ఇంకుడు గుంతల తవ్వకం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయన్నారు.
చెవువులన్నింటినీ పునరుద్ధరించి అన్నింటినీ లింకప్ చేసి అల్టిమేట్ గా అన్నింటిలోని నీటిని మూసీనదిలో కలిపేట్లు చేయాలన్నదే ఎనుముల రేవంత్ రెడ్డి ముఖ్య లక్ష్యంగా కమీషనర్ వివరించారు. హైదరాబాదులో కురుస్తున్న భారీవర్షాల గురించి మాట్లాడుతు ప్రతి 100 లీటర్ల వర్షపు నీటిలో 99 లీటర్లు డ్రైనేజ్ లో కలిసిపోతోందన్న ఆవేధన వ్యక్తంచేశారు. రోడ్లు, డ్రైనేజీ వ్యవస్ధ సక్రమంగా లేకపోవటమే దీనికి కారణమన్నారు. మామూలుగా అయితే కురిసే ప్రతి 100 లీటర్ల వర్షపు నీటిలో 40లీటర్లు భూమిలోకి ఇంకితే భూగర్భజలాలు బాగా పెరుగుతాయన్నారు. మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఇండియన్ జర్నలిస్టు యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. రామనారాయణ తదితరులు పాల్గొన్నారు.