అన్ని జిల్లాల్లోకి హైడ్రా -సీఎం రేవంత్
x

అన్ని జిల్లాల్లోకి హైడ్రా -సీఎం రేవంత్

జిల్లాల్లో కూడా చెరువులు, కుంటల కబ్జాలపై నివేదిక సిద్ధం చేయాలని కలెక్టర్లను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి.


తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం ఉదయం మహబూబాబాద్ జిల్లాలో పర్యటించారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, అధికారులతో కలిసి వరద ప్రభావం పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదయిందని తెలిపారు. వరదల్లో నలుగురు మృతి చెందడం చాలా బాధాకరమన్నారు. దాదాపు 30 వేల ఎకరాల పంట నాశనమైందన్నారు. సహాయక చర్యల్లో నిరంతరం పనిచేసిన రెవెన్యూ, పోలీస్ సిబ్బందికి సీఎం అభినందనలు తెలిపారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ... అధికారుల చర్యలతో ప్రాణ నష్టం తగ్గించగలిగామన్నారు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించామన్నారు. పంట నష్టం అంచనా వేసి పరిహారం అందజేస్తామన్నారు. నష్టపోయిన మూడు తండాల వాసులకు ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తామని ప్రకటించారు. నష్టం పై కేంద్రానికి నివేదించడానికి నివేదిక తయారు చేయాలని చెప్పారు. కేంద్రం దీన్ని జాతీయ విపత్తుగా గుర్తించాలన్నారు. ఆస్తి, ప్రాణ నష్ట పరిశీలనకు ప్రధాని మోదీని ఆహ్వానించామని తెలిపారు. తక్షణమే రాష్ట్రానికి రూ. 2వేల కోట్లు కేటాయించాలని కోరినట్లు వెల్లడించారు. వర్షం తగ్గినందున బురద తొలగించే పనులను అధికారులు ప్రారంభించాలని సూచించారు. ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేస్తే ఇళ్లలోని బురద తొలగించవచ్చన్నారు. విష జ్వరాలు ప్రబలే ప్రమాదం ఉంది కాబట్టి ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

అన్ని జిల్లాల్లో హైడ్రా..

జిల్లాల్లో కూడా చెరువులు, కుంటల కబ్జాలపై నివేదిక సిద్ధం చేయాలని కలెక్టర్లను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. హైడ్రా తరహా వ్యవస్థను జిల్లాల్లో ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. కబ్జాలకు పాల్పడింది ఎంతటి వాళ్ళైనా సరే వదిలిపెట్టొద్దని అధికారులకు సూచించారు. స్థానిక కోర్టుల నుంచి అనుమతులు తీసుకుని ఆక్రమణలను వెంటనే తొలగించాలని చెప్పారు. ఖమ్మంలో పువ్వాడ ఆక్రమణల వల్లే భారీగా వరదలు వచ్చాయని సీఎం ఆరోపించారు. ఆయన ఆక్రమించిన స్థలంలో ఆసుపత్రి కట్టారన్నారు. పువాడ ఆక్రమణలపై హరీష్ రావు స్పందించాలని డిమాండ్ చేశారు. 75 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా 42 సెంటీమీటర్ల వర్షం పడింది. ప్రభుత్వం ముందుచూపు వల్లనే ప్రాణ నష్టం తగ్గిందని సీఎం తెలిపారు.

హరీష్ రావుకి సీఎం సవాల్..

మీడియాతో చిట్ చాట్ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాజీ మంత్రి హరీష్ రావుకు సవాల్ విసిరారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆక్రమించుకున్న కాలువలను తొలగించడానికి ఖమ్మంలో డిమాండ్ చేయగలరా అంటూ హరీష్ రావుకి చాలెంజ్ చేశారు. "నేను మీ దగ్గరికి అధికారులను పంపిస్తాను. గతంలో మీరే ఇరిగేషన్ శాఖ మినిస్టర్ గా పనిచేశారు. రాష్ట్రంపై పూర్తి అవగాహన మీకుంది. పువ్వాడ అజయ్ కుమార్ ఆక్రమణలను తొలగించడానికి చిత్తశుద్ధితో సహకరిస్తారా? ఈ ప్రశ్నకు మీరు సమాధానం చెప్పిన తర్వాతే మా చిత్తశుద్ధిని ప్రశ్నించండి. మా ఎమ్మెల్యేలు 24 గంటలు అప్రమత్తంగా ఉన్నారు. వరదలలో సహాయక చర్యల్లో పాల్గొన్నారు. రెండు రోజుల నుంచి నేను వరద ముంపు ప్రాంతాలను పరిశీలిస్తున్నాను. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇస్తున్నాం. పదేళ్లలో మాజీ సీఎం కేసీఆర్ ఒక్కరోజైనా వరద బాధితులను పరామర్శించారా? వరదలు వచ్చినా, ప్రమాదంలో ప్రజలు చనిపోయినా.. ఒక్కరోజైనా బయటకి వచ్చాడా? ఏ ప్రజలను కలిసాడో ఒక ఆధారమైన చూపించండి. కేసీఆర్ సొంత నియోజకవర్గంలో పసిపిల్లలు చనిపోతే పరామర్శించలేదు. మానవత్వం లేని వ్యక్తిగా కేసీఆర్ పదేళ్లు ప్రభుత్వం నడిపాడు అంటూ సీఎం రేవంత్ మండిపడ్డారు.

యువ శాస్త్రవేత్త కుటుంబానికి సీఎం పరామర్శ

వరదల్లో కొట్టుకుపోయి దుర్మరణం పాలైన వ్యవసాయ శాస్త్రవేత్త అశ్విని కుటుంబాన్ని సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించారు. వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అశ్విని సోదరుడికి ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చేందుకు కృషి చేస్తానని తెలిపారు. కాగా, ఢిల్లీలోని జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్‌లో ఖమ్మం జిల్లా సింగరేణి మండలం గంగారం తండాకు చెందిన నునావత్ అశ్విని శాస్త్రవేత్తగా విధులు నిర్వహిస్తున్నారు. ఆమె ఛత్తీస్‌ఘడ్‌లోని రాయ్‌పూర్‌లో జరిగే ఓ సదస్సులో పాల్గొనేందుకు తండ్రి మోతీలాల్‌తో కలిసి ఆదివారం కారులో హైదరాబాద్ విమానాశ్రయానికి బయలుదేరారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం పురుషోత్తమయ్య గూడెం వద్ద వంతెనపై ఆకేరువాగు ప్రవాహానికి వారి కారు కొట్టుకుపోవడంతో అశ్వినితో పాటు ఆమె తండ్రి మృతి చెందారు.

Read More
Next Story