
ప్రజావాణి కార్యక్రమంలో హైడ్రా అధికారికి సమస్యలు విన్నవిస్తున్న ప్రజలు
రూపు మారిన ‘హైడ్రా’, కార్పొరేట్ విరాళాలతో చెరువుల పునరుద్ధరణ
బాధితుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ‘హైడ్రా’రూపు మార్చింది.ప్రజలకు మేలు చేసే పనులు, కార్పొరేట్ విరాళాలతో చెరువుల పునరుద్ధరణకు శ్రీకారం చుట్టింది.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి బ్రెయిన్ ఛైల్డ్ విభాగమైన హైడ్రాపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో రూపు మార్చింది. కూల్చివేతలే కాకుండా ప్రజోపయోగ పనులపై హైడ్రా దృష్టి సారించింది. ప్రజలకు మేలు చేసేలా పలు సహాయ చర్యలు చేపట్టడం, రోడ్ల ఆక్రమణలను తొలగించి ప్రజల రాకపోకలకు దారి చూపించడం, భారీవర్షాలు, అగ్నిప్రమాదాలు, ఇతర విపత్తులు సంభవించినపుడు సహాయ కార్యక్రమాలు చేపట్టడం లాంటి పనులతో హైడ్రా ప్రజలకు చేరువ కావాలని లక్ష్యంగా పెట్టుకుంది.
హైడ్రాతో రియల్ ఎస్టేట్ పడిపోయింది : అక్బరుద్దీన్ ఒవైసీ
హైదరాబాద్ నగరంలో హైడ్రా వల్ల రియల్ ఎస్టేట్ కుప్పకూలిందని మజ్లిస్ శాసనసభా పక్ష నాయకుడు అక్బరుద్దీన్ ఒవైసీ సోమవారం అసెంబ్లీలో ఆరోపించారు.రియల్ ఎస్టేట్ పడిపోవడానికి కారణమైన హైడ్రాకు కృతజ్ఞతలు అంటూ అక్బరుద్దీన్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. మరో వైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద అసెంబ్లీలో మాట్లాడుతూ, రియల్ ఎస్టేట్ రంగం కుదేలైందని, బిల్డర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. హెచ్ఎండీఏ సంవత్సర ఆదాయం రూ.200 కోట్ల నుంచి రూ.50కోట్లకు పడిపోయిందని వివేకానంద ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయని ప్రాప్ ఈక్విటీ సంస్థ తాజాగా తన నివేదికలో వెల్లడించింది. అయితే హైడ్రాతో రియల్ రంగం పడిపోయిందని ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారం అని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆరోపించారు.
కార్పొరేట్ సంస్థల విరాళాలతో చెరువుల పునరుద్ధరణ
ఆక్రమణలను తొలగించిన చెరువుల పునరుద్ధరణ కోసం హైడ్రా కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బుల్ పథకం కింద కార్పొరేట్ కంపెనీల నుంచి విరాళాలను సేకరించాలని హైడ్రా నిర్ణయించింది. ఔటర్ రింగ్ రోడ్డు లోపల వెయ్యికి పైగా చెరువులు ఆక్రమణల పాలయ్యాయి.ఈ నేపథ్యంలో సరస్సుల రక్షణ, మురుగునీటి శుద్ధిపై హైడ్రా దృష్టి సారించింది. పర్యావరణ సమతుల్యతను కాపాడటానికి,నీటి వనరులను పునరుద్ధరించాల్సిన ఆవశ్యకతను హైడ్రా గుర్తించింది.
సరస్సులను సంరక్షించుకుందాం
ఔటర్ రింగ్ రోడ్డు లోపల హైదరాబాద్ నగరంలో 1,025 చెరువులున్నాయి. వీటిలో 61 శాతం చెరువుల జాడ తెలియడం లేదు. మిగిలిన 39 శాతం చెరువులను రక్షించడం హైడ్రా లక్ష్యంగా పెట్టుకుంది. ఇటీవల 72 మంది కార్పొరేట్ ప్రతినిధులతో జరిగిన సమావేశంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ జల వనరులను రక్షించాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు.నగరంలో సరస్సులను రక్షించకపోతే, పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని ఆయన హెచ్చరించారు.మాదాపూర్‌లోని సున్నం చెరువు, తమ్మిడికుంట, కూకట్‌పల్లిలోని నల్ల చెరువు, ఉప్పల్‌లోని నల్ల చెరువు,అంబర్‌పేటలోని బతుకమ్మ కుంట వంటి కీలక నీటి వనరులను హైడ్రా అభివృద్ధి చేస్తోంది.
నీట మునిగిన అండర్ పాస్‌లు...వరద నీటిని తొలగించిన హైడ్రా
హైదరాబాద్ నగరంలో ఇటీవల కురిసిన భారీ వర్షానికి కొండాపూర్‌లోని కొత్తగూడ, మాదాపూర్ అయ్యప్ప సొసైటీలలోని అండర్ పాస్‌లు నీట మునిగాయి.ప్రజల నుంచి ఫిర్యాదు అందగానే హైడ్రా డీఆర్ఎఫ్ విభాగపు స్టేషన్ ఫైర్ ఆఫీసర్ సతీష్ నేతృత్వంలో రెండు బృందాలు రంగంలోకి దిగి నీటి ఇంజిన్లతో నీటిని బయటకు పంపారు.నగరంలోని పలు ప్రాంతాల్లో రహదారులపై నిలిచిన వరద నీటిని కూడా హైడ్రా బృందాలు తొలగించాయి.
మ్యాన్‌హోల్‌లో పడిన మూగజీవిని కాపాడిన హైడ్రా
మాధాపూర్‌లోని అయ్యప్ప సొసైటీ వందఫీట్ల రహదారికి సమీపంలోని సిగ్నల్ వద్ద మ్యాన్ హోల్‌లో ప్రమాదవవశాత్తు పడిపోయిన గేదెను హైడ్రా డీఆర్ ఎఫ్ బృందాలు కాపాడాయి. మ్యాన్ హోల్ తెరచి ఉండడంతో మూగజీవి ప్రమాదవశాత్తూ అందులో పడిపోయి కూరుకుపోయింది. అర్ధరాత్రి 12 గంటలకు ఈ ఘటన జరిగింది. భారీ వర్షాన్ని లెక్క చేయకుండా హైడ్రా బృందాలు గేదెను కాపాడాయి.
ఫిర్యాదు అందిన 48 గంటల్లోనే హైడ్రా చర్యలు
ముషీరాబాద్ నియోజకవర్గం కవాడీగూడలోని 2 బీహెచ్‌కే డిగ్నిటీ హౌసింగ్ కాలనీలో రోడ్డు ఆక్రమణకు సంబంధించి ఫిర్యాదు వచ్చిన 48 గంటల్లో హైడ్రా యాక్షన్ తీసుకుంది. రోడ్డు ఆక్రమించి వేసిన ఫెన్సింగ్‌తో పాటు ఆక్రమణలను హైడ్రా తొలగించింది.రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మండలం తుర్కయాంజల్‌లోని మాసబ్ చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో నిర్మించిన రహదారిని హైడ్రా తొలగించింది.గంగారాం చెరువులో మట్టి నింపుతున్నవారిపై హైడ్రా చర్యలు తీసుకుంది.శేరిలింగంపల్లి మండలం చందానగర్‌లోని గంగారం చెరువును హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పరిశీలించి చందానగర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
హైడ్రా పేరిట అవతవకలకు పాల్పడితే కఠిన చర్యలు
హైడ్రా పేరు చెప్పి లావాదేవీలకు, అవకతవకలకు ఎవరైనా పాల్పడితే కఠిన చర్యలుంటాయని హైడ్రా హెచ్చరించింది. ఈ మేరకు గతేడాది సెప్టెంబరు 3వ తేదీన హైడ్రా స్పష్టమైన ప్రకటన చేసింది. అవకతవకలు జరిగినట్టు ఆధారాలుంటే వెంటనే తన దృష్టికి తీసుకు రావాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కోరారు. లేని పక్షంలో ఏసీబీ, విజిలెన్స్ ఎన్‌ఫోర్సుమెంట్ విభాగానికి, స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు.
9,800 ఫిర్యాదుల పరిష్కారం
ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై హైడ్రా వెంటనే స్పందిస్తుంది. నేరుగా క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకుంటోంది.హైడ్రాకు ఫిర్యాదు చేస్తే దశాబ్దాల సమస్యలకు కూడా వెంటనే పరిష్కారం లభిస్తుందని ప్రజలు నమ్ముతున్నారని రంగనాథ్ చెప్పారు. ఇలా హైడ్రాకు 9,800ల ఫిర్యాదులందాయి. వీటిలో చాలా వరకు పరిష్కారమయ్యాయని ఆయన తెలిపారు.ప్రతి సోమవారం ఉదయం 11 గంటల నుంచి రాత్రి వరకూ నిర్వహించే ప్రజావాణిలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్వయంగా ఫిర్యాదులను పరిశీలిస్తారు. ఫిర్యాదు దారుల ముందే గూగుల్ మ్యాప్స్, శాటిలైట్ ఇమేజెస్, సర్వే ఆఫ్ ఇండియా మ్యాపుల ఆధారంగా.. అప్పటికప్పుడే సమస్యపై చర్చించి,సంబంధిత అధికారులకు వాటి పరిష్కార బాధ్యతలను అప్పగిస్తారు. బండ్లగూడ జగీర్ మున్సిపాలిటీ లోని కిస్మత్ పురాలో రోడ్డు వివాదానికి హైడ్రా శాశ్వత పరిష్కారం చూపించింది.బండ్లగూడ జాగీర్ మున్సిపాలిటీ పరిధిలో కిస్మత్‌పురాలో రెండు కాలనీలను కలిపే రహదారికి అడ్డంగా నిర్మించిన ప్రహరీని హైడ్రా తొలగించింది.మణికొండలో హైటెన్షన్ విద్యుత్ తీగల కింద ఉన్న స్థలంతో పాటు నాలాను ఆక్రమించి ఏర్పాటు చేసిన రేకుల ప్రహరీని శనివారం హైడ్రా తొలగించింది.
హైడ్రా ప్రజావాణికు 63 ఫిర్యాదులు
ప్రజావసరాలకు ఉద్దేశించిన భూమిని స్థానికంగా పలుకుబడి ఉన్న వ్యక్తులు కబ్జా చేసేస్తున్నారని,వాటిని కాపాడాలని పలువురు హైడ్రా ప్రజావాణికి సోమవారం ఫిర్యాదు చేశారు. పాఠశాలకు, పిల్లలు ఆడుకునేందుకు ఉద్దేశించిన స్థలాలను కూడా వదలడంలేదని వాపోయారు. ఫుట్ పాత్‌లను,సర్వీసు రోడ్డులను వదలకుండా తోపుడు బళ్ల నుంచి ఏకంగా డబ్బాలు పెట్టేసి వ్యాపారాలు చేసుకుంటున్నారని.. వాటిని తొలగిస్తే ప్రదాన రహదారులకు ఆనుకుని ఉన్న నివాస ప్రాంతాలకు ఎంతో ఉపశమనంగా ఉంటుందని పలువురు పేర్కొన్నారు. శిఖం భూములలో పక్కన పట్టా భూమి సర్వే నంబరు చూపించి అనుమతులు తీసుకుని ఇళ్లు కట్టేస్తున్నారని ఫిర్యాదులందాయి. దీంతో తాము వ్యవసాయ భూమిని కోల్పోవాల్సి వస్తోందని వాపోతున్నారు. ఇలా సోమవారం హైడ్రా నిర్వహించిన ప్రజావాణికి మొత్తం 63 ఫిర్యాదులందాయి.
Next Story