
బతుకమ్మకుంటకు ప్రాణంపోసిన హైడ్రా
చెత్తా, చెదారం, నిర్మాణాల వ్యర్ధాలతో నిండిపోయిన బతుకమ్మకుంటకు హైడ్రా(Hydra) మాత్రమే ప్రాణంపోసింది
హైడ్రాను కచ్చితంగా అభినందించాల్సిందే. ఆల్ క్రెడిట్ గోస్ టు హైడ్రా ఓన్లీ. ఏర్పడిన దగ్గర నుండి మిశ్రమస్పందనను ఎదుర్కొంటున్న హైడ్రాను ఇపుడు ఎందుకు అభినందించాలి ? ఎందుకంటే ఒక కుంటకు ప్రాణంపోసింది కాబట్టే. పైన కనబడుతున్న ఫోటోను జాగ్రత్తగా గమనిస్తే విషయం అర్ధమైపోతుంది. ఫొటోలో ఎడమవైపు కనబడుతున్నది జలంతో కళకళలాడుతున్న చెరువు. ఆ పక్కనే ఉన్న మరో ఫోటో కూడా ఇదే చెరువు. కాకపోతే ఒకపుడు చెత్తా, చెదారం, మట్టిదిబ్బలు, చుట్టుపక్కల నిర్మాణాల వ్యర్ధాలతో నిండిపోయింది. చెత్తా, చెదారం, నిర్మాణాల వ్యర్ధాలతో నిండిపోయిన బతుకమ్మకుంటకు హైడ్రా(Hydra) మాత్రమే ప్రాణంపోసింది. కబ్జాలతో కుచించుకుపోతున్న చెరువును హైడ్రా కాపాడింది. రికార్డుల ప్రకారం 15 ఎకరాలుండాల్సిన కుంట ఇపుడు 5 ఎకరాలు మాత్రమే ఉంది. రికార్డుల ప్రకారం చెరువు వైశాల్యం ఎంతుందో గమనించిన తర్వాత పునరుద్ధరణ చర్యలు తీసుకోవటంతో జలంతో చూడటానికి ఎంతో సుందరంగా కనబడుతోంది.
ఇపుడు విషయం ఏమిటంటే హైడ్రా ఏర్పడిన దగ్గర నుండి ఒకవైపు వ్యతిరేకతను మరోవైపు అభినందనలను అందుకుంటున్న విషయం తెలిసిందే. చెరువులు, నీటికుంటలు, జలవనరులను కాపాడటం, పరిరక్షించటమే లక్ష్యంగా ఎనుముల రేవంత్ రెడ్డి(Revanth) ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటుచేసింది. దీనికి ఐపీఎస్ అధికారి ఏవీ రంగనాధ్ ను కమీషనర్ గా నియమించింది. ఏర్పాటైన తర్వాత మొదటిసారిగా సినీనటుడు అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna)కు చెందిన ఎన్ కన్వెన్షన్ ను కూల్చేయటంతో అందరి ప్రశంసలను అందుకుంది. తర్వాత మరికొన్ని కబ్జాలను తొలగించినా ఇదేసమయంలో మధ్య, దిగువతరగతి జనాలు అప్పులుచేసి, బ్యాంకుల్లో రుణాలు తీసుకుని కొనుక్కున్న ప్రాపర్టీలను కూల్చేసింది.
మధ్య, దిగువతరగతి జనాలు బ్యాంకులోన్లతో సమకూర్చుకున్న ప్రాపర్టీలను హైడ్రా కూల్చేయటంతో జనాల్లో బాగా వ్యతిరేకత పెరిగిపోయింది. ఒకవైపు పలువురు బడాబాబులు జలవనరులను ఆక్రమించుకుని నిర్మించుకున్న ఫామ్ హౌసులు కళ్ళకి కనబడుతున్నా ఇప్పటివరకు హైడ్రా వాటిజోలికి వెళ్ళలేదు. ఇదే విషయాన్ని ఓ కేసు విచారణలో హైకోర్టు కూడా హైడ్రాను సూటిగా ప్రశ్నించటమే కాకుండా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తంచేసింది. బడాబాబుల ఫామ్ హౌసుల సంగతి ఏమిటో చూసిన తర్వాత మధ్య తరగతి, పేదల ఇళ్ళను ఏమిచేయాలో డిసైడ్ చేయమని సూచించింది. హైకోర్టు ఆగ్రహం తర్వాత హైడ్రా దూకుడు కాస్త తగ్గింది.
సరిగ్గా ఇలాంటి నేపధ్యంలోనే నగరంలోని అంబర్ పేట మండలం పెద్ద అంబర్ పేటపై ఆక్రమణలకు గురైన బతుకమ్మకుంటపై పడింది. బతుకమ్మకుంట పునరుద్ధరణపై మాజీ ఎంపీ వీ హనుమంతరావు(వీహెచ్)పదేపదే ప్రభుత్వంతో పాటు హైడ్రాకు కూడా విజ్ఞప్తులు అందించారు. దాంతో ఈ కుంటకు సంబంధించిన రెవిన్యు రికార్డులను ఫిబ్రవరి నెలలో రంగనాధ్ తెప్పించుకున్నారు. ఇరిగేషన్, రెవిన్యు, మున్సిపల్ అధికారులతో కుంటపై సమీక్షించారు. కుంటను పునరుద్దరించాలని డిసైడ్ అయ్యారు. అయితే ఈ కుంట స్ధలం మొత్తం తనది అని ఒక వ్యక్తి కోర్టులో కేసు వేశాడు. దాంతో కొంతకాలం విచారణలతో సరిపోయింది. ఫైనల్ గా కుంట ప్రభుత్వానికి చెందినదిగా హైకోర్టు తీర్పిచ్చింది. దాంతో కుంటపునరుద్ధరణ మొదలైంది. కుంటలో హైడ్రా పనులు చేపట్టినపుడు రెండు అడుగుల లోతులోనే నీరు బయటపడింది.
బయటపడిన నీటిని హైడ్రా టెస్టింగ్ కోసం ల్యాబుకు పంపింది. బయటపడిన నీరు భూగర్భజలమే అని డ్రైనేజీ నీరుకాదని వాటర్ బోర్డు ల్యాబ్ అధికారులు స్పష్టంచేశారు. దాంతో కుంటలో పేరుకుపోయిన చెత్త, నిర్మాణాల వ్యర్ధాలు మొత్తాన్ని హైడ్రా తొలగించింది. తర్వాత పూడిక తీయించింది. ఆ తర్వాత కుంట కట్టను పటిష్టపరచటంలో భాగంగా మొత్తం రివిటింగ్ చేయించింది. కుంటమొత్తానికి కంచెవేసి పరిరక్షించింది. కుంటకట్టపై వాకర్స్ ట్రాక్ ఏర్పాటుచేయించింది. పిల్లలు ఆడుకోవటానికి, పార్క్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటోంది. కుంటను స్వాధీనం చేసుకున్న నాలుగు నెలల్లోనే బతుకమ్మకుంటను హైడ్రా ఇంత సుందరంగా తీర్చిదిద్దింది. తమ కళ్ళముందే కనుమరుగైపోతున్న బతుకమ్మకుంట మళ్ళీ ఈవిధంగా జలంతో కళకళలాడుతుండని స్ధానికులు ఎవరూ ఊహించలేదు.
అందుకనే హైడ్రా చేస్తున్న పునరుద్ధరణ పనుల్లో చాలామంది తమవంతుగా సాయం అందించారు. స్ధానికుల సహకారంతో హైడ్రా అధికారులు రెట్టించిన ఉత్సాహంతో నాలుగు నెలల్లోనే బతుకమ్మకుంటకు పునరుజ్జీవనం కల్పించారు. మిగిలిన పనులు రాబోయే సెప్టెంబర్ నెలలోగా పూర్తిచేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు కమీషనర్. సెప్టెంబర్ లో మొదలయ్యే బతుకమ్మ పండుగను ఈ కుంటలోనే జరిపేందుకు ప్రత్యేక వేదికను కూడా శాశ్వతంగా ఏర్పాటు చేయాలని కమీషనర్ అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. మొత్తానికి బతుకమ్మకుంట పునరుజ్జీవనం క్రెడిట్ మొత్తం హైడ్రాకే దక్కుతుంది అనటంలో ఎలాంటి సందేహంలేదు.