HYDRAA | ఈదులకుంటపై కన్నేసి ఉంచండి.. అధికారులకు రంగనాథ్ ఆదేశాలు..
x

HYDRAA | ఈదులకుంటపై కన్నేసి ఉంచండి.. అధికారులకు రంగనాథ్ ఆదేశాలు..

మాదాపూర్‌లో ఉన్న ఈదులకుంట విషయంలో అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు హైడ్రా కమిషనర్ రంగనాథ్.


మాదాపూర్‌లో ఉన్న ఈదులకుంట విషయంలో అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు హైడ్రా(HYDRAA) కమిషనర్ రంగనాథ్(Ranganath). ఈదులకుంటను పూర్తిగా కొలిచి సరిహద్దుతు ఖరారు చేసే వరకు అక్కడ ఎటువంటి నిర్మాణాలు చేపట్టకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రెవెన్యూ అధికారులతో కలిసి మాదాపూర్ ఈదులకుంటను రంగనాథ్ ఈరోజు పరిశీలించారు. ఇది ఖానామెట్ విలేజ్ సర్వేనెంబర్ 7 లో 6.5 గుంటల విస్తీర్ణంలో విస్తరించి ఉన్నట్లు గుర్తించారు. కాగా ఈ కుంట శిఖాన్ని పూడ్చేసి కొందరు బిల్డర్లు నిర్మాణాలు చేపడుతున్నట్లు గుర్తించారు. తక్షణం వాటి విషయంలో చర్యలు చేపట్టారు.

వర్షం నీటిని చెరువులోకి తీసుకొచ్చే నాలాను దారి మళ్లించి ఆ ప్రాంతాన్ని బిల్డర్లు కబ్జా చేశారు. పక్కనే ఉన్న పట్టా భూమి సర్వే నెంబర్‌తో నకిలీ డాక్యుమెంట్‌లను సృష్టించి చెరువులో నిర్మాణాలకు బిల్డర్లు అనుమతులు తీసుకున్నారు. వీటిని గుర్తించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్.. చెరువులో నిర్మాణాలకు గుడ్డిగా అనుమతులు జారీ చేసిన ఇరిగేషన్, జిహెచ్ఎంసి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కూకట్పల్లి శేరిలింగంపల్లి రెవెన్యూ సరిహద్దుల్లో ఉన్న ఈదులకుంట సర్వే చేసి సరిహద్దులు గుర్తించే వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు.

శేరిలింగంపల్లి కూకట్పల్లి రెండు మండలాల మధ్య సర్వేనెంబర్ 67 హోలాఫింగ్ అయింది. దాంతో హైడ్రా కమిషనర్‌కు ఇరిగేషన్ అధికారులు తప్పుడు సమాచారం ఇచ్చారు. చేరువు కాదంటూ హైడ్రా కమిషనర్‌ను తప్పుదారి పట్టించడానికి కూడా ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు ప్రయత్నాలు చేశారు. దీంతో అసలు విషయం తెలియడంతో రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు రంగనాథ్. అయితే ఈదులకుంట చెరువును ఆసరా చేసుకొని ప్రభుత్వం దోబీగాట్లు నిర్మించింది. ఇప్పుడు చెరువు కబ్జా కావడంతో ధోబీ కార్మికులు ఉపాధి కోల్పోయారు. ఈ క్రమంలోనే సీపీఎం నాయకులు శోభన్ నేతృత్వంలో బాధితులంతా కలిసి హైడ్రా కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పరిశీలించిన రంగనాథ్.. అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.

దీంతో పాటుగా నిజంపేటలోని నిజాం తలాబ్ లేక్ (తురకచెరువు), నార్సింగ్ లోని నెక్నాంపూర్ చెరువు, తెల్లాపూర్లోని వనం చెరువు, చెల్లికుంట, మేళ్ళ చెరువులను కూడా రంగనాథ్ పరిశీలించారు. యీ సందర్భంగా పలువురు స్థానికులు చెరువులు కబ్జాలపై హైడ్రా కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. చెరువులను పునరుద్ధరించాలని వినతిపత్రాలు అందజేశారు. చెరువుల చరిత్రను వివరించారు. చెరువుల సుందరీకరణ పేరుతో కట్టలు చుట్టూ నిర్మించి బఫర్ జోన్ ప్రాంతాలను కబ్జా చేస్తున్నారని పలువురు ఫిర్యాదు చేశారు. గేటెడ్ కమ్యూనిటీల నుంచి మురుగు చేరి చెరువులు కలుషితం అవుతున్నాయి అని ఆరోపించారు. వారి వినతులను స్వీకరించిన రంగనాథ్ చెరువులు కబ్జా కాకుండా చూస్తామని స్థానికులకు హామీ ఇచ్చారు. చెరువుల పూర్తి వివరాలు సేకరించి కబ్జా కాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

Read More
Next Story