
హైడ్రా సిబ్బంది జీతాలపై కమిషనర్ క్లారిటీ..
జీతాలు తగ్గే అవకాశమే లేదని చెప్పిన ఏ రంగనాథ్.
జీతాలు తగ్గడంతో హైడ్రా మార్షల్స్‌లో సమ్మె బాట పట్టారు. 150 డివిజన్‌లలో సేవలను బహిష్కరించారు. దీంతో భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో హైడ్రా ఎమర్జెన్సీ సేవలను నిలిచిపోయాయి. దీంతో ప్రజల్లో ఆందోళన పెరిగింది. ఈ క్రమంలోనే సిబ్బంది జీతాల తగ్గింపు అంశంపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. అందుకు ఆస్కారమే లేదన్నారు. ఎవరి జీతాలు తగ్గలేదని చెప్పారు. ఇటీవల జారీ చేసిన జీవో ప్రకారం ఒక స్కేల్ జీతం విడుదలైనా ఎవరి జీతం తగ్గే అవకాశం లేదని చెప్పారు. ఉద్యోగులంతా కూడా చిన్న కన్ఫ్యూజన్ కారణంగా ఆందోళన చెందుతున్నారని, వారికి ఈ విషయాన్ని పూర్తి వివరించడంతో వారికి భరోసా కలిగిందని రంగనాథ్ వివరించారు. అదే విధంగా మార్షల్స్‌గా ఉన్నవారి జీతాలు రానున్న కాలంలో ఇంకా పెరుగుతాయని కూడా చెప్పారు. దాంతో పాటుగానే ఎంఏ యూడీ సెక్రటరీ కూడా జీతాలు పెంచే అంశాన్ని పరిశీలిస్తోందని చెప్పారు.
‘‘ఇతర రాష్ట్రాల పరిస్థితిని సమీక్షించి, వాటి ఆధారంగా జీతాల పెంచే దిశగా చర్చలు చేపడతాం. మార్షల్స్ పట్ల అమర్యాదగా ఎవరు ప్రవర్తించినా ఊరుకునేది లేదు. అలా ఎక్కడైనా జరిగితే.. దానిని నేరుగా మా దృష్టికి తీసుకురావాలి. ఓవర్ టైమ్ చెల్లింపులను కూడా పరిశీలిస్తున్నాం’’ అని తెలిపారు.
అసలు సమ్మె కథ ఇది..
జీతాలు తగ్గించడంతో అసంతృప్తికి గురైన మార్షల్స్ సమూహంగా పనికి హాజరుకాకపోవడంతో హైడ్రా కంట్రోల్ రూమ్ సేవలు అంతరాయానికి గురయ్యాయి. ట్రైనింగ్ కార్యక్రమాలు, ప్రజావాణి వంటి ప్రజా సేవలు నిలిచిపోయాయి. గ్రేటర్ హైదరాబాద్‌లోని 150 డివిజన్లలో మార్షల్స్ అందించే సాయాన్ని పూర్తిగా నిలిపివేశారు. ఈ ప్రభావం కారణంగా హైడ్రా విభాగంలోని 51 భారీ వాహనాలు పనిలోకి రాలేదు. వర్షాకాలంలో అత్యవసర పరిస్థితులు, వరద నివారణ చర్యలు, రోడ్లపై చెట్లు కూలడం వంటి ఘటనలకు వెంటనే స్పందించే బృందాలు అందుబాటులో లేకపోవడంతో నగరంలో ఎమర్జెన్సీ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి.