మూసీ ఆక్రమణలపై హైడ్రా బుల్డోజర్
x

మూసీ ఆక్రమణలపై హైడ్రా బుల్డోజర్


ఆక్రమణలపై హైడ్రా మరోసారి ఉక్కుపాదం మోపింది. మూసీ నదిలో ఇష్టారాజ్యంగా జరిగిన ఆక్రమణలను తొలగించింది హైడ్రా. ఎకరాల మేర జరిగిన ఆక్రమణలపై హైడ్రా బుల్డోజర్లను నడిపింది. ఈ ఆక్రమణల తొలగింపుకు సంబంధించిన పూర్తి వివరాలను హైడ్రా.. ఎక్స్(ట్విట్టర్) వేదికగా ప్రకటించింది. ‘‘ చాదర్‌ఘాట్ బ్రిడ్జ్ నుంచి పాతబస్తీ ఉస్మానియా ఆసుపత్రి మార్చురీ వరకు పలు ప్రాంతాల్లో ఆక్రమణలు జరిగాయి. మూసీ స్థలాన్ని ఆక్రమించిన ఆ ప్రాంతాన్ని పార్కింగ్ కోసం వినియోగిస్తున్నారు. మరికొందరు మరో అడుగు ముందుకేసి ఆక్రమించిన స్థలంలో షెడ్లు వేసి ఆద్దెలకు ఇచ్చి డబ్బు సంపాదిస్తున్నారు. ఈ ఆక్రమణలపై ఫిర్యాదు అందడంతో చర్యలు చేపట్టాం’’ అని హైడ్రా తెలిపింది. అంతేకాకుండా ఆక్రమణలకు పాల్పడ్డ కొందరు పేర్లను కూడా వెల్లడించింది.

‘‘ 3.10 ఎకరాల మేర కబ్జా చేసి షెడ్డు నిర్మించి అక్రమ వ్యాపారం చేస్తున్న తికారం సింగ్. 1.30 ఎకరాల మేర కబ్జా చేసిన పూనమ్ చాంద్ యాదవ్. 5.22 ఎకరాల మేర కబ్జా చేసిన జయకృష్ణ. కబ్జా చేసిన వారంతా అక్కడ షెడ్డు లు వేసి.. వాటిని అద్దెకు ఇచ్చి వ్యాపారం చేస్తున్నారు’’ అని హైడ్రా వెల్లడించింది. ‘‘బస్సులు, లారీల పార్కింగ్ కోసం కిరాయికి ఇస్తూ డబ్బులు ఆర్జిస్తున్నారు. అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నట్టు పరిసర ప్రాంతాల ప్రజల ఫిర్యాదు చేశారు. నర్సరీ బిజినెస్ నిర్వహణ. మూసి గర్భంలో మట్టిపోసి షెడ్డుల నిర్మాణం జరిగింది’’ అని హైడ్రా తెలిపింది. ఫిర్యాదు అందిన వెంటనే రంగంలోకి దిగి ఆక్రమణలను హైడ్రా తొలగించడంపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read More
Next Story