ఈటల రాజేందర్ బంధువు స్థలంలో హైడ్రా కూల్చివేతలు..
x

ఈటల రాజేందర్ బంధువు స్థలంలో హైడ్రా కూల్చివేతలు..

హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ను కోర్టుకు ఈడుస్తానన్న ఈటల బంధువు నల్లమల్లారెడ్డి.


గ్రేటర్ పరిధిలో కూల్చివేతలపై హైడ్రా కన్నెర్ర చేసింది. ప్రభుత్వ స్థలం కబ్జాకు గురైందని తెలియడం ఆలస్యం.. ఆఘమేఘాలపై యాక్షన్ తీసుకుంటుంది. దీంతో పాటుగా ప్రజల నుంచి కూడా ఫిర్యాదులు స్వీకరిస్తూ.. కబ్జా రహిత గ్రేటర్ నిర్మాణమే లక్ష్యంగా చర్యలు చేపడుతోంది. ఈనేపథ్యంలో ఘట్‌కేసర్‌లో ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి నిర్మించిన 4 కిలోమీటర్ల కాంపౌండ్ వాల్‌ను హైడ్రా శనివారం కూల్చివేసింది. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ బంధువు నల్లమల్లారెడ్డికి చెందిన ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్ నిర్మించినట్లు దివ్యనగర్ లేఔట్ ప్లాట్ ఓనర్లు ఫిర్యాదులు చేయడంతో హైడ్రా రంగంలోకి దిగింది. సదరు ఇన్‌స్టిట్యూషన్ దగ్గర సర్వే చేపట్టి.. కాంపౌండ్‌ వాల్‌ను ప్రభుత్వ స్థలంలోనే కట్టినట్లు నిర్ధారించింది. వెంటనే కూల్చివేతలకు సిద్ధమైంది. భారీ పోలీసులు బందోబస్తు మధ్య హైడ్రా.. కూల్చివేతలను చేపట్టింది.

దివ్యనగర్ లేఔట్ ప్లాట్‌లకు వెళ్లడానికి తమకు దారి లేకుండా లేఔట్ చుట్టూ ప్రహరీ నిర్మించారని, ప్రహరీకి గేటు పెట్టి తమను లోపలికి అనుమతించడం లేదని ప్లాట్ల యజమానులు ఫిర్యాదులు చేశారు. వీటి నేపథ్యంలో జనవరి 23న ఇరు పక్షాలతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ చర్చించారు. నల్లామల్లారెడ్డి చేసిన పనికి తాము తమ ప్లాట్లను అమ్ముకునే పరిస్థితులు కూడా లేవని ఫిర్యాదుదారులు ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఒకవేళ ప్లాట్లు అమ్మినా.. అమ్మకాలు ఆయన సమక్షంలో జరిగాలని, అందుకు రూ.50 చెల్లించాలని కూడా డిమాండ్ చేసినట్లు ఫిర్యాదుదారులు పేర్కొన్నారు. లేఔట్ డెవలప్‌మెంట్ ఛార్జీల పేరిట డబ్బులు వసూలు చేసి.. డ్రైనేజీ వ్యవస్థ, రహదారులు నిర్మించకుండా లేఔట్ చుట్టూ భారీ ప్రహరీ నిర్మించారని వివరించారు. ఇదే విష‌యాన్ని నిల‌దీస్తే త‌మ‌ను కొట్టారంటూ న‌ల్ల‌మ‌ల్లారెడ్డి స‌మ‌క్షంలోనే క‌మిష‌న‌ర్‌కు ఫిర్యాదు చేశారు.

వారి ఫిర్యాదుపై స్పందించిన హైడ్రా.. శనివారం లేఔట్ చుట్టూ ఉన్న ప్రహరీని కూల్చివేశింది. దీంతో హైడ్రా చేపట్టిన చర్యలపై కాలనీవాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దివ్య‌న‌గ‌ర్ లేఔట్ చుట్టూ ఉన్న ప్ర‌హ‌రీ కూల్చివేత‌తో ఏక‌శిలా లే ఔట్‌, వెంక‌టాద్రి టౌన్‌షిప్‌, సుప్ర‌భాత్‌ వెంచ‌ర్ -1 , మ‌హేశ్వ‌రి కాల‌నీ, క‌చ్చ‌వాణి సింగారం, ఏక‌శిలా - పీర్జాదిగూడ రోడ్డు, బాలాజీన‌గ‌ర్‌, సుప్ర‌భాత్ వెంచర్ -4 , వీజీహెచ్ కాల‌నీ, ప్ర‌తాప్ సింగారం రోడ్డు, సుప్ర‌భాత్ వెంచ‌ర్ -2, 3, సాయిప్రియ‌, మేడిప‌ల్లి, ప‌ర్వ‌త‌పురం, చెన్నారెడ్డి కాల‌నీ, హిల్స్ వ్యూ కాల‌నీ, ముత్తెల్లిగూడ కాలనీలకు మార్గం సుగమం అయింది.

కమిషనర్‌ను కోర్టుకు ఈడుస్తా: మల్లారెడ్డి

ప్రహరీని హైడ్రా కూల్చివేయడంపై నల్లమల్లారెడ్డి స్పందించారు. హైడ్రా అక్రమంగా కూల్చివేతలు చేపడుతోందని ఆయన ఆరోపించారు. ఈ అంశంపై తాను హైకోర్టుకు వెళ్తానన్నారు. హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌కు కోర్టుకు ఈడుస్తానని, అదంతా కూడా తన వ్యక్తిగత భూమి అని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘నేను ఎలాంటి కబ్జాలు చేయలేదు. కొందరు కావాలనే నాపై హైడ్రాకు ఫిర్యాదులు చేశారు. హైడ్రా కూడా నేను అందించిన ఫైల్స్, ఆధారాలు పరిశీలించకుండా కూల్చివేతలు ప్రారంభించింది. దివ్య నగర్ లేఔట్‌ను నేనే కాపాడాను. అక్రమంగా నిర్మాణాలు చేసేవారికి అలా చేయొద్దని చెప్పారు. నేను ఎవరినీ బెదిరించలేదు’’ అని నల్ల మల్లారెడ్డి పేర్కొన్నారు.

Read More
Next Story