
హైడ్రా ప్రజావాణికి 64 ఫిర్యాదులు
రహదారులన్నీ అందరూ వినియోగించుకునేలా చూడాలని, ఎవరికీ ఆటంకాలు కలిగించకుండా చేయాలన్నారు
గత నెల నుంచి ప్రతి సోమవారం హైడ్రా కూడా ప్రజావాణి నిర్వహిస్తోంది. ఇందులో ప్రజలు తమ ఫిర్యాదులను నేరుగా హైడ్రా అధికారులకు అందించవచ్చు. ఈ కార్యక్రమంలో అందుకున్న అన్ని ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఈరోజు నిర్వహించిన ప్రజావాణికి ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. తమకు కాలనీల్లో సమస్యలు ఉన్నాయంటూ ఫిర్యాదులు ఇచ్చారు. సోమవారం ప్రజావాణిలో తమకు 64 ఫిర్యాదులు వచ్చాయని హైడ్రా అధికారులు తెలిపారు. తమ కాలనీలకు వెళ్లేందుకు వీలు లేకుండా.. కొంతమంది కాలనీ వాసులు చుట్టూ ప్రహరీలు నిర్మించుకుంటున్నారని, నాలాలు కబ్జా చేసి.. వరదనీరు వెళ్లడానికి వీలు లేకుండా చేస్తున్నారని ఎక్కువ సంఖ్యలో ఫిర్యాదులందాయని వివరించారు.
కాగా రహదారులకు అడ్డంగా నిర్మాణాలు, ప్రహరీలు నిర్మించి ప్రజలకు ఇబ్బంది కలిగించిన వాటిని ప్రాధాన్యాంశాలుగా పరిగణించాలని అధికారులకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ సూచించారు. ప్రహరీ నిర్మించడానికి అనుమతులున్నాయా లేదా పరిశీలించి, అనుమతులు లేనివాటిని వెంటనే తొలగించాలని ఆదేశించారు. రహదారులన్నీ అందరూ వినియోగించుకునేలా చూడాలని, ఎవరికీ ఆటంకాలు కలిగించకుండా చేయాలన్నారు. ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి ఆన్‌లైన్లో గూగుల్ మ్యాప్స్ ద్వారా ఫిర్యాదుదారులతో చర్చించి.. తగిన చర్యలను అధికారులకు కమిషనర్ ఆదేశించారు. అక్కడికక్కడే అధికారులకు ఫిర్యాదుదారులకు పరిచయం చేసి.. వారితో ఫాలోఅప్ చేయండని సూచించారు.
హైడ్రాకు అందిన ఫిర్యాదులు ఇలా..
మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ మండలంలోని కాచవని సింగారం గ్రామంలోని సర్వే నంబరు 54లో ఉన్న లేఔట్‌లోని భాగ్యనగర్ నందనవనం పార్కును కబ్జా చేశారంటూ ఫిర్యాదు. 1977లో 340 ప్లాట్లతో లే ఔట్ వేయగా.. 2007లో 110 ప్లాట్లతో గ్రామపంచాయతీ లే ఔట్‌గా తీర్మానం జరిగింది. ఇదే లే ఔట్‌ను 2006లో కొన్నట్టు చూపించి 2010లో హెచ్ ఎండీఏ అనుమతి కోసం కబ్జాదారులు దరఖాస్తు చేసుకున్నారు. హెచ్‌ఎండీఏ అనుమతి మంజూరు చేయకపోయినా.. దివ్య నగర్ ప్లాట్ ఓనర్ల సంక్షేమ సంఘం ఆ ప్లాట్లను అమ్ముకున్నారని అందులో పార్కు స్థలం కూడా ఉందని పలువురు ఫిర్యాదు చేశారు.
మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట మండలం, తుర్కయాంజల్ మున్సిపాలిటీలోని దేవరయాంజల్ గ్రామంలోని సర్వే నంబరు 452, 453లో 3.39 ఎకరాలలో లే ఔట్ వేసి ప్రహరీ నిర్మించడంతో తమకు దారి లేకుండా పోయిందని ఆ ప్రాంత నివాసితులు ఫిర్యాదు చేశారు.
జూబ్లీహిల్స్ ఫిల్మ్‌నగర్‌లోని రాక్‌గార్డెన్స్ పేరిట లే ఔట్‌లో పేర్కొని.. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఫిల్మ్‌నగర్ కల్చరల్ క్లబ్ పేరిట వ్యాపారం చేస్తున్నారని స్థానికుడు ఫిర్యాదు చేశారు.
మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా కాప్రా మున్సిపాలిటీలోని కుషాయిగూడ విలేజ్‌లో సర్వే నంబరు 177లో ఉన్న పార్కు స్థలాన్ని కబ్జా చేసి ప్లాట్లుగా అమ్మేశారని.. ఆ పార్కు స్థలాన్ని పక్కన ఉన్న తమ లే ఔట్‌లో చూపిస్తున్నారని పలువురు వాపోయారు. ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేయడమే కాకుండా.. అక్కడ కల్లు కాంపౌండ్ ఏర్పాటుచేశారంటూ పేర్కొన్నారు.