HYDRAA | ‘ఆ నిర్మాణాల జోలికి వెళ్లం’.. హైడ్రా కమిషనర్ రంగనాథ్
x

HYDRAA | ‘ఆ నిర్మాణాల జోలికి వెళ్లం’.. హైడ్రా కమిషనర్ రంగనాథ్

గ్రేటర్ పరిధిలో చేపట్టే కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్లారిటీ ఇచ్చారు. వాటిని మాత్రమే కూలుస్తామని తేల్చి చెప్పారు.


తెలంగాణ హైడ్రా(HYDRAA) కలవరం ఇంకా తగ్గలేదు. ఎప్పుడు ఎక్కడ కూల్చివేతలు చేపడతారో అన్న ఆందోళనలు ఇంకా ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. గ్రేటర్ పరిధిలోని చెరువులు, కుంటలు, కాలువల సంరక్షణ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేరసిందే ఈ హైడ్రా. హైదరాబాద్‌లోని అన్ని చెరువులు, కుంటలు, వాగులను పరిశీలిస్తూ వాటి పరిసరాల్లోని ఆక్రమణలపై కొరడా ఝులిపిస్తోంది. చిన్నా పెద్దా అన్న తేడా లేకుండా ఎవరి నిర్మాణమైనా కూల్చి వేస్తోంది. దీంతో ఎప్పుడు ఎవరి ఇల్లు కూలుతుందో అన్న ఆందోళనలో అనేక మంది ఉన్నారు. చెరువులకు సమీపంలో ఉంటున్నవారికి ఈ భయం భూతంలా పట్టుకుని ఉంది. తాము అన్ని అనుమతులతోనే ఇల్లు నిర్మించుకున్నామని ఇప్పటికే పలువరు హైడ్రాను సంప్రదించి క్లారిటీ తీసుకున్నారు. కానీ ఇంకా చాలా మందిలో ఈ భయం తగ్గలేదు. కాగా తాజాగా తాము కూల్చే నిర్మాణాలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్లారిటీ ఇచ్చారు. తాము ఏ నిర్మాణాలను పడితే వాటిని కూల్చమని చెప్పారు. 2024 జూలై తర్వాత ప్రారంభించిన అక్రమ నిర్మాణాలను మాత్రమే కూలుస్తామని ఆయన తేల్చి చెప్పారు.

వాటి జోలికి వెళ్లం..

‘‘హైడ్రా ఏర్పడటానికి ముందు ఉన్న నిర్మాణాల జోలికి వెళ్లం. గతంలో అనుమతులు తీసుకొని ఇప్పుడు నిర్మిస్తున్నవాటి వైపు వెళ్లం. ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్న వాటి కూల్చివేతలు తప్పదు. కొత్తగా తీసుకున్న అనుమతులను హైడ్రా తనిఖీలు చేస్తుంది. ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా చెరువుల పరిరక్షణకు హైడ్రా పనిచేస్తుంది. పేదవాళ్లు, చిన్నవాళ్ల జోలికి హైడ్రా రాదు.. పేదవాళ్ల ఇండ్లు హైడ్రా కూల్చివేస్తుందనే తప్పుడు ప్రచారం నమ్మొద్దు’’ అని ఆయన కోరారు. అక్రమ నిర్మాణం ఎవరిదైనా వెనకడుగు వేయకుండా కూల్చివేస్తామని ఆయన వివరించారు. హైడ్రా పనితీరుపై కొంతకాలంగా తప్పుడు ప్రచారం జరుగుతుందని, వాటిని ఎవరూ నమ్మొద్దని ఆయన ప్రజలను కోరారు.

ఇదిలా ఉంటే నేరుగా హైడ్రానే సమస్యలను గుర్తించడం కాస్తంత కష్టతరం అవుతున్న క్రమంలో ప్రజల నుంచి కూడా ఫిర్యాదులు స్వీకరించాలని ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే వచ్చే ఏడాది నుంచి ప్రతి సోమవారం బుద్ధభన్‌లో ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం చేపడతామని, వచ్చిన ఫిర్యాదులను ప్రాధాన్యత ఆధారంగా పరిష్కరించే ప్రయత్నం చేస్తామని హైడ్రా ఇప్పటికే ప్రకటించింది. ఇకపై ప్రతి ఒక్కరూ కూడా చెరువులు, నాలాలు, పార్కుల ఆక్రమణలపై అర్జీలు ఇవ్వొచ్చని హైడ్రా తెలిపింది. ప్రజల నుంచి స్వీకరించిన ప్రతి ఫిర్యాదును పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. గ్రేటర్ పరిధిలోని చెరువులు, వాగులు వంటి జలవనరులను సంరక్షించుకోవడం ప్రతి ఒక్కరికి బాధ్యత అని, భావి తరాలకు సురక్షితమైన, అందమైన సమాజం అందించడానికి వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని హైడ్రా పేర్కొంది.

Read More
Next Story