
హైడ్రా అధికారుల సదస్సు
హైదరాబాద్ లేఅవుట్‌లలో పార్కుల ఆక్రమణలపై హైడ్రా దృష్టి
హైదరాబాద్ నగరంలోని లేఅవుట్‌లలో పార్కు స్థలాల ఆక్రమణలపై హైడ్రా దృష్టి సారించింది.
హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) చెరువులు, నాలాల పరిరక్షణే కాకుండా లేఔట్లలోని పార్కు స్థలాల రక్షణకు ముందడుగు వేసింది. హైదరాబాద్ నగరంలో వేలాది లేఔట్లలోని పార్కులు, ప్రజావసరాల స్థలాలు, రోడ్లు ఆక్రమణల పాలవుతున్న నేపథ్యంలో హైడ్రా అప్రమత్తమైంది. ఎన్ని ఏళ్లు గడచినా లే ఔట్‌లలో పార్కులు.. రహదారులు మారవని హైడ్రా అధికారులు స్పష్టం చేశారు. లేఔట్లలోని పార్కు స్థలాలు కబ్జా అయితే ప్లాట్ యజమానుల ఫిర్యాదులతో లేఔట్ రివైజింగ్ చేపడతామని తాజాగా హైడ్రా ప్రకటించింది.
పార్కు స్థలాల కబ్జాల తొలగింపునకు చర్యలు
ఇటీవల లే ఔట్‌లలో పార్కు స్థలాలు, ప్రజోపయోగ స్థలాలు కబ్జా అవుతుండటంపై వస్తున్న ఫిర్యాదులతో హైడ్రా సదస్సు ఏర్పాటు చేసి, కబ్జాల తొలగింపునకు ప్రణాళిక రూపొందించింది.లే ఔట్ ఏదైనా అందులోని పార్కులు, రహదారులు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలను కాపాడడం ప్రభుత్వ బాధ్యత అని హైడ్రా శనివారం నిర్వహించిన సదస్సులో పేర్కొన్నారు.హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ నేతృత్వంలో జరిగిన ఈ సదస్సులో హైడ్రా, జీహెచ్ ఎంసీ, హెచ్ ఎండీఏ, డీటీసీపీ, ఇరిగేషన్, రెవెన్యూ విభాగాలకు చెందిన పలువురు నిపుణులు హాజరయ్యారు.
లేఔట్ లలో 10 శాతం భూమిపై ప్రభుత్వానికి హక్కు
నగరంలో 10 శాతం ప్లాట్లు రిజిస్ట్రేషన్ అయితే ఆ లేఔట్లను గుర్తించాల్సినవసరం ఉంది.లేఔట్ లో మార్పులు చేయాల్సి ఉంటే అప్పటికే ప్లాట్లు కొన్నవారి అనుమతితో రివైజ్ చేయాల్సి ఉంది. లేఔట్ లలోని భూమిలో 10 శాతం పార్కులు, ప్రజావసరాలకు కేటాయించాల్సి ఉంది. పంచాయతీ, మున్సిపాలిటీ, డీటీసీపీ, హెచ్ ఎండీఏ ఇలా ఏ స్థాయిలో లే ఔట్ అనుమతులు పొందినా అందులోని పార్కులు, రహదారులు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలపై ప్రభుత్వానికి హక్కులుంటాయి.
రెవెన్యూ రికార్డుల్లో మార్చాలి
దశాబ్దాల క్రితం గ్రామపంచాయతీలు అనుమతి ఇచ్చిన లే ఔట్ల విషయం రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయాలి. సదరు భూమి లే ఔట్‌గా మారిందనే విషయం రెవెన్యూ రికార్డుల్లో నమోదు కాకపోవడంతోనే కొందరు పాసు పుస్తకాలు తెచ్చుకుని ఆయా స్థలాల మీదకు వెళ్లి,వ్యవసాయ భూమి పేరిట ఆక్రమణలు చేస్తున్నారు. గ్రామ పంచాయతీ అనుమతి పొందిన పాత లే ఔట్ల విషయంలో కొన్ని ప్లాట్లు రెగ్యులరైజ్ అయితే ఆ లే ఔట్‌ను గుర్తించినట్టేనన్నారు. తర్వాత ఆ భూమిని వ్యవసాయ భూమిగా మార్చడం జరగదు. ఒక వేళ రద్దు చేస్తే అందులో ప్లాట్లు కొన్న వారి అనుమతితో మాత్రమే చేయాల్సి ఉంది.
అక్రమ నిర్మాణాలను తొలగించవచ్చు
ఇళ్ల నిర్మాణానికి తీసుకున్న అనుమతులకు విరుద్ధంగా నిర్మించిన వాటిపైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.. ఇందుకు సంబంధించి సుప్రింకోర్టు, హైకోర్టు ఇచ్చిన తీర్పులపై సదస్సు కూలంకుషంగా చర్చించారు. చెరువు పరిధిలో నిర్మించిన కట్టడాల విషయంలో కూడా నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేకుండా తొలగించ వచ్చనని నిపుణులు చెప్పారు. రహదారులు, పార్కుల్లో నిర్మాణాలు చేపట్టినా ఇది వర్తిస్తుంది.రెగ్యులరైజ్‌చేసిన ఇంటి స్థలాలు చెరువు ఎప్‌టీఎల్ పరిధిలోకి వస్తే వాటిని రద్దు చేసే అధికారం కూడా ఉంది.హైడ్రా చర్యలతో ఇంటి స్థల పరిరక్షణపై భరోసా వస్తోందని పలువురు పేర్కొన్నారు.
హైడ్రా కమిషనర్ కు ఆత్మీయ సత్కారం
శేరిలింగంపల్లి మండలంలోని రాయదుర్గంలో చెరువును కాపాడిన హైడ్రాను ప్రశాంతి హిల్స్ కాలనీ సంక్షేమ సంఘం అభినందించింది. అప్పటికే కొంత ఆక్రమణలకు గురి కాగా.. ప్రస్తుతం 29 గుంటలుగా మిగిలిన కుమ్మరి కుంటను కాపాడడంలో హైడ్రా చొరవను కొనియాడింది. తాము వినతి పత్రం అందించిన వెంటనే క్షేత్రస్థాయిలో పరిశీలించి,కుమ్మరికుంట పరిరక్షణకు చర్యలు తీసుకున్న హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ను అభినందించింది. కాలనీ ప్రతినిధులు శనివారం హైడ్రా కమిషనర్ ను కలిసి శాలువతో సత్కరించారు.
హైడ్రా పనితీరుపై ప్రశంసలు
ఫిర్జాదిగూడలో కబ్జాల చెర నుంచి 2 ఎకరాల మేర ఉన్నశ్మశానవాటికను కాపాడుకున్నామని స్థానికులు పండగ చేసుకున్నారు. టెంట్లు వేసి సహఫంక్తి భోజనాలు ఏర్పాటు చేసి ఆనందం పంచుకున్నారు. టపాసులు పేల్చి సంతోషం వ్యక్తం చేశారు. హైడ్రాను ఏర్పాటు చేసిన ప్రభుత్వాన్ని అభినందించారు.ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గారిని, హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కు పాలాభిషేకం చేశారు.
జూబ్లీహిల్స్‌లో ఆక్రమణలను తొలగించిన హైడ్రా
జూబ్లీహిల్స్ రోడ్డు నంబరు 41లో రోడ్డుతో పాటు నాలాను ఆక్రమించి నిర్మించిన కట్టడాలను హైడ్రా తొలగించింది. 30 అడుగుల రహదారిలో ఆక్రమణలు తొలగించి 2 ఎకరాల పార్కుకు దారి చూపింది. రూ.200ల కోట్ల రూపాయల ఆస్తిని కాపాడి, ప్రజావినియోగంలోకి హైడ్రా తెచ్చింది.
హైడ్రాకు రూ.25కోట్ల విడుదల
వర్షాకాలం వచ్చిన నేపథ్యంలో 2025-26 సంవత్సరానికి హైడ్రాకు రాష్ట్ర ప్రభుత్వం రూ.25 కోట్లను విడుదల చేస్తూ జీఓ ఆర్టీనంబరు 258ను శనివారం విడుదల చేసింది.
Next Story