Hydra Grievance Cell|కొత్తసంవత్సరంలో హైడ్రా మంచినిర్ణయం
ప్రతివారంలో ఒకరోజు అంటే సోమవారాన్ని గ్రీవెన్స్ డేగా నిర్ణయించింది.
కొత్తసంవత్సరంలో హైడ్రా మంచినిర్ణయం తీసుకున్నది. ఇంతకీ ఆ నిర్ణయం ఏమిటంటే ప్రతివారంలో ఒకరోజు అంటే సోమవారాన్ని గ్రీవెన్స్ డేగా నిర్ణయించింది. మొదటి గ్రీవెన్స్ డేను జనవరి 6వ తేదీనుండి ప్రారంభించబోతోంది. ఈ గ్రీవెన్స్ డేకి స్వయంగా హైడ్రా కమీషనర్ ఏవీ రంగనాధ్(Hydra Commissioner Ranganadh) హాజరవుతారు. ఉదయం 10.30 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటలవరకు ప్రజలనుండి రంగనాధ్ ఫిర్యాదులను తీసుకుంటారు. అందిన ఫిర్యాదులను పరిశీలించి వారంరోజుల్లోపు పరిష్కరించాలని హైడ్రా డిసైడ్ అయ్యింది. చెరువులు, కుంటలు, కాల్వల పరిరక్షణకోసమే హైడ్రాను రేవంత్ రెడ్డి(Revanth reddy) ప్రభుత్వం ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. సంక్రాంతి పండుగలోపే(Sankranti Festival) హైడ్రాకు ప్రత్యేకంగా పోలీసుస్టేషన్(Hydra Police Station) కూడా ఏర్పాటు కాబోతోంది. పోలీసుస్టేషన్ ఏర్పాటైతే బాధితుల నుండి ఫిర్యాదులు తీసుకుని ఎఫ్ఐఆర్ నమోదుచేసే అధికారం హైడ్రాకు వస్తుంది. భవిష్యత్తులో హైడ్రా తీసుకోబోయే చర్యలపై ఎలాంటి న్యాయవివాదాలు లేకుండా చూడాలని ఇప్పటికే రంగనాధ్ డిసైడ్ అయ్యారు. అందుకనే లీగల్ సలహాదారులను కూడా హైడ్రా సమకూర్చుకున్నది.
నిజానికి తొందరలో ప్రారంభించబోతున్న గ్రీవెన్స్ డే ను ఎప్పుడో ప్రారంభించాల్సింది. హైడ్రా ఏర్పడినపుడే గ్రీవెన్స్ డేను కూడా ప్రారంభించుంటే ఈపాటికి జలవనరుల కబ్జాలన్నీ సాక్ష్యాధారాలతో సహా ఫిర్యాదుల రూపంలో హైడ్రాకు అందేదే అనటంలో సందేహంలేదు. అప్పట్లో గ్రీవెన్స్ డే ప్రారంభించకుండా డైరెక్టుగా హైడ్రా సిబ్బందే జేసీబీలు, బుల్ డోజర్లను పెట్టుకుని రంగంలోకి దిగేశారు. అందిన ఫిర్యాదులను పరిశీలించి వెంటనే క్షేత్రస్ధాయిలోకి దిగేసి కూల్చివేతలు మొదలుపెట్టేశారు. దాంతో జనాల్లో గగ్గోలుమొదలైపోయింది. కారణం ఏమిటంటే హైడ్రా కూల్చేసినదాంట్లో ఎక్కువగా మధ్య, ఎగువమధ్య తరగతి జనాల ప్రాపర్టీలే ఉన్నాయి. జీవితకాల కష్టార్జితాన్ని పెట్టి బ్యాంకులు లేదా ఆర్ధికసంస్ధల్లో అప్పులు తీసుకుని ఇళ్ళు, అపార్టుమెంట్లు కొనుక్కున్నారు. అయితే అవి చెరువులు, కాల్వల ఫుల్ ట్యాంకు లెవల్, బపర్ జోన్ పరిధిలో ఉన్నాయని చెప్పి హైడ్రా కూల్చేసింది. సుమారుగా 200 ప్రాపర్టీలను హైడ్రా ఏకపక్షంగా కూల్చేయటంతో బాధితుల్లో బాగా వ్యతిరేకత పెరిగిపోయింది.
తనచర్యలను రంగనాధ్ ఎంత సమర్ధించుకున్నా రోడ్డునపడింది ఆస్తులు పోగొట్టుకున్న మధ్యతరగతి జనాలే అన్నదివాస్తవం. అందుకనే బాధితులు కోర్టులో కేసులు వేయగానే హైకోర్టు హైడ్రా మీద బాగా సీరియస్ అయిపోయింది. హైడ్రా చర్యలపై హైకోర్టు కూడా ఫుల్లుగా క్లాసులు పీకింది. కారణం ఏమిటంటే చెరువులు, కాల్వలను కబ్జాలు చేసి బడాబాబులు నిర్మించుకున్న పెద్దపెద్ద ఫాంహౌసులు(Farmhouses), విలాసవంతమైన విల్లాలు, గేటెడ్ కమ్యూనిటీలో రో హౌసులు కంటిముందు కనబడుతున్నా హైడ్రా వాటిజోలికి మాత్రం వెళ్ళలేదు. రాజకీయంగా ఎలాంటి మద్దతులేని మధ్య, ఎగువమధ్య తరగతి జనాల ప్రాపర్టీలను మాత్రం కూల్చేసింది. ఈ విషయంలోనే హైడ్రా కమీషనర్ పై హైకోర్టు బాగా సీరియస్ అయ్యింది. బాధితులకు అండగా కోర్టుస్టే ఇవ్వటంతో కూల్చివేతలకు బ్రేకులు పడ్డాయి.
కోర్టు అక్షింతల తర్వాత ఇపుడు కమీషనర్ హైడ్రా కార్యాలయంలో గ్రీవెన్స్ డే ఏర్పాటుచేస్తున్నారు. ఇదేదో ముందే చేసుంటే 200 ప్రాపర్టీల యజమానులు రోడ్డునపడేవారు కారేమో. ఎందుకంటే ప్రాపర్టీలను కూల్చేసేముందు సక్రమంగా నోటీసులు జారీచేస్తే వాటి యజమానులు హైడ్రా ఆఫీసుకు వచ్చి తమ దగ్గరున్న డాక్యుమెట్లను చూపించి తమ వాదనను వినిపించుకునే అవకాశం ఉండేది. అప్పుడు డాక్యుమెంట్లను పరిశీలించి యజమానులు చెప్పింది నిజమో కాదో తేల్చుకునే అవకాశం హైడ్రాకు ఉండేది. ఆక్రమణలను కూల్చేందుకు నోటీసులు ఇవ్వాల్సిన అవసరంలేదన్న ఒకే ఒక వెసులుబాటును కమీషనర్ యధేచ్చగా ఉపయోగించుకున్నారు. దాంతో వేలాదిమంది బాధితులు రోడ్డునపడ్డారు. చెరువులు, కాల్వలను ఆక్రమించుకుని ప్రాజెక్టులు వేసిన రియల్టర్లు బాగానే ఉన్నారు. అప్పులిచ్చిన బ్యాంకులు, ఆర్ధికసంస్ధలు బాగానే ఉన్నాయి. ప్రాపర్టీలను కూల్చేసిన హైడ్రా కూడా హ్యాపీయే. నష్టపోయి రోడ్డునపడింది మాత్రం అప్పులుచేసి ప్రాపర్టీలను కొనుగోలుచేసిన వాళ్ళే.
సరే, ఆలస్యంగా అయినా హైడ్రా ఆధ్వర్యంలో గ్రీవెన్స్ డే ఏర్పాటవుతుండటం సంతోషించాల్సిన విషయం అనే చెప్పాలి. గ్రీవెన్స్ డే ని జనాలు సమర్ధవంతంగా ఉపయోగించుకున్నపుడే గ్రీవెన్స్ డే ఏర్పాటు సార్ధకమవుతుంది. ఇపుడు కూడా కొందరు చెరువులు, కాల్వల కబ్జాలను ఆధారాలతో సహా హైడ్రాకు ఫిర్యాదులు చేస్తున్నారు. హైడ్రా అధికారులు వెళ్ళి ఫిర్యాదులు ఎంతవరకు నిజమనే విషయాన్ని క్షేత్రస్ధాయిలో నిర్ధారించుకుంటున్నారు. వచ్చినఫిర్యాదు నిజమే అని తేలితే వెంటనే రంగంలోకి దిగి ఆక్రమణను తొలగిస్తున్నారు. రామ్ నగర్లో కాల్వను ఆక్రమించేసి సారాయికొట్టు ఏర్పాటు చేసుకున్న ఘటన వెలుగుచూసింది. వెంటనే రంగనాధ్ స్వయంగా పరిశీలించి సారాయికొట్టుతో పాటు మరో అక్రమనిర్మాణాన్ని కూడా తొలగించారు. భారీవర్షం పడినపుడు అడ్డంకులు తొలగిపోవటంతో మురుగునీరంతా కాల్వలో నుండి వెళిపోయింది. దాంతో స్ధానికులు బాగా సంతోషపడిపోయారు. మొత్తంమీద హైడ్రా ఆధ్వర్యంలో గ్రీవెన్స్ డే ఏర్పాటవుతుండటం సంతోషించాల్సిన విషయమనే చెప్పాలి.