Revanth Reddy | ‘ఎవరి సలహాలైనా స్వీకరిస్తా’
ప్రజలకు సుభిక్ష పాలన అందించాలన్న విషయంలో ఎవరు ఏ సలహా ఇచ్చినా వారి ఏ పార్టీ వారు అనేది చూడకుండా తాను స్వీకరిస్తానని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
హైదరాబాద్ అభివృద్ధే లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకు వెళ్తోందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. చాలా మంది అమరావతితో హైదరాబాద్ పోటీ పడుతుందా అని చర్చిస్తునస్నారని, కానీ హైదరాబాద్ పోటీ పడాల్సింది అమరావతితో కాదని, ప్రపంచంతో అని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రం అభివృద్ధి విషయంలో ఏమాత్రం వెనక్కు తగ్గమని, ఆ విషయంలో ఎవరు ఏ సలహా ఇచ్చినా వారి ఏ పార్టీ వారు అనేది చూడకుండా తాను స్వీకరిస్తానని అన్నారు. తెలంగాణ అభివృద్ధి విషయంలో తనకు ఎటువంటి భేషజాలు లేవని, ప్రతి ఒక్కరి సలహాను స్వీకరిస్తానని చెప్పారు. ఒరిసా మాజీ గవర్నర్ విద్యాసాగరరావు ఆత్మకథ ‘ఉనిక’ పుస్తకాన్ని ఈరోజు హైదరాబాద్‌లోని తాజ్‌కృష్ణలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం పలు కీలక విషయాలు పంచుకున్నారు. విపక్ష నేతలు అయినా.. అవసరం అనిపించిన చోట వారి అనుభవాన్ని వినియోగించుకుంటామని రేవంత్ చెప్పారు.
విద్యార్థులు రాజకీయాల్లోకి రావాలి
‘‘నా 35 ఏళ్ల జీవితంలో నేను ఆదర్శంగా తీసుకున్న వారందరిని ఒకే వేదిక మీద కలిసే అవకాశం వచ్చింది. విద్యాసాగర్ రావును అభిమానించేవారంతా సాగర్ జీ అని పిలుస్తారు.. మాకూ వారు సాగర్ జీ నే. రెండు రాష్ట్రాల్లో సమర్థవంతంగా గవర్నర్‌గా విధులు నిర్వహించి తెలంగాణ గౌరవాన్ని నిలబెట్టారు. ఐదు దశాబ్దాల పాటు రాజకీయ జీవితం గడిపిన విద్యాసాగర్ రావు ఒక్క ఆరోపణ ఎదుర్కొక పోవడం అభినందనీయం. తెలంగాణ సమాజానికి ఆదర్శంగా నిలబడే రాజకీయ వేత్తగా ఉన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ రాజకీయాల్లో జార్జి రెడ్డి, విద్యాసాగర్ రావు తాము నమ్మిన సిద్ధాంతం కోసం గట్టిగా నిలబడ్డారు. ప్రస్తుతం యూనివర్సిటీలు ఉనికి కోల్పోయేలా ఉన్నాయి. యూనివర్సిటీల్లో విద్యార్థులు రాజకీయాల్లో ఉండటం అవసరం. ముఖ్యమంత్రి కాగానే యూనివర్సిటీలకు పూర్వవైభవం తీసుకురావడం కోసం నిర్ణయాలు తీసుకున్నాను. తెలంగాణ ఉద్యమంలో యూనివర్సిటీ విద్యార్థులు ముందుండి పోరాటాలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నామంటే విద్యార్థులు రాజకీయాల్లో అత్యంత క్రియాశీలకంగా వ్యవహరించడం వల్లనే. రాజకీయాల్లో సిద్దాంతపరమైన భావజాలం లేకపోవడం వల్లనే ఈనాడు పార్టీ ఫిరాయింపులు అధికమయ్యాయి. ఏదో ఒక పదవి కోసం పార్టీలు మారుతున్నారు’’ అని రేవంత్ అన్నారు.
చెప్పుకోదగ్గ నాయకులు లేరు
‘‘విద్యార్థి దశలో సిద్దాంతపరమైన రాజకీయాలు చేస్తే పార్టీకి కట్టుబడి ఉంటారు. సిద్దాంతపరమైన విద్యార్థి రాజకీయాలను రాష్ట్రంలో పునరుద్దించాల్సిన అవసరం ఉంది. రాజకీయాల్లో రాణించాలని భావించే వారు ఉనిక పుస్తకాన్ని చదవాలి. మూడో తరంలో చెప్పుకోదగిన నాయకులు లేకుండా పోయారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రితో పాటు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వేలు చూపిస్తే స్పీకర్ మైక్ ఇవ్వాలి. ప్రభుత్వం అంటే ప్రతిపక్షం, పాలక పక్షం .. 119 మంది ఎమ్మెల్యేలు కలిస్తేనే ప్రభుత్వం. ప్రభుత్వంలోని లోపాలను ఎత్తి చూపించడం ప్రతిపక్షం పాత్ర. కాల క్రమేణా ప్రజాస్వామ్య స్ఫూర్తిని కోల్పోతున్నాం. పాలక పక్షానికి, ప్రతిపక్షానికి మధ్య సభలో ప్రతిష్టంభన వచ్చినప్పుడు కమ్యూనిస్టులు, బీజేపీ పార్టీలు సలహాలు, సూచనలు ఇచ్చేవి. ఇప్పుడు మా ప్రభుత్వం ప్రజాస్వామ్య స్ఫూర్తి ని చూపిస్తోంది. 13 నెలల్లో ఇప్పటి వరకు అసెంబ్లీ నుంచి ప్రతిపక్ష సభ్యులను మా ప్రభుత్వం బహిష్కరించలేదు. ఉత్తర తెలంగాణ ప్రాంతం సస్యశ్యామలం కావాలంటే గోదావరి జలాలు తీసుకురావాలని సాగర్ జీ పాదయాత్ర చేశారు. గోదావరి జలాల వినియోగం కోసం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రాణహిత , చేవెళ్ల ప్రాజెక్టు ను తీసుకువచ్చారు. గోదావరి జలాల వినియోగంపై సాగర్ జీ సలహాలు, సూచనలు ఎంతో అవసరం’’ అని తెలిపారు.
ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే ధ్యేయం
‘‘మహారాష్ట్రలో మునుగుతున్న భూములకు సంబంధించిన ఆ ముఖ్యమంత్రితో మాట్లాడమని గతంలో నేను సాగర్ జీ కోరారు. గోదావరి జలాల వినియోగంలో సాగర్ జీ అనుభవం చాలా అవసరం. తుమ్మడి హెట్టి దగ్గర భూసేకరణ కోసం సాగర్ జీ సహకారం తీసుకుంటాం. నాకు భేషజాలు లేవు... తెలంగాణ కోసం ఎవరినైనా కలుస్తా.. సహకారం తీసుకుంటా. తెలంగాణను వన్ ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తయారు చేయడం కోసం సహకరించాలని ప్రధాని మోదీ ని కోరాను. తెలంగాణలో 60 శాతం ఆదాయం హైదరాబాద్ నుంచి వస్తుంది. విశ్వనగరంగా హైదరాబాద్ మారాలంటే రీజనల్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రైల్ కావాలని ప్రధాని మోదీని కోరారు. తెలంగాణకు తీర ప్రాంతం లేదు కాబట్టి డ్రైపోర్టు ఇవ్వాలని అడిగాను. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ని త్వరితగతిన పూర్తి చేయడం కోసం ప్రధాని మోదీ సహకారం కోరాను. అమరావతితో మనకు పోటీ లేదు.. ప్రపంచంతో మనం పోటీ పడదాం’’ అని పిలుపునిచ్చారు.
పోటీ ప్రపంచంతో
‘‘న్యూయార్క్, టోక్యో వంటి నగరాలతో పోటీ పడదాం. ప్రపంచంతో హైదరాబాద్ పోటీ పడాలంటే మెట్రో రైల్‌కు అనుమతులు తెచ్చుకోవాలి. తమిళనాడు డీఎంకే ప్రభుత్వం ఉన్నప్పటికి అక్కడ మెట్రో కి ప్రధాని మోదీ సహకరించారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా ప్రధాని మోదీ బెంగళూరు కి మెట్రో ఇచ్చారు. తెలంగాణ ప్రస్తుతం తొమ్మిదో స్థానానికి పడిపోయింది. కేంద్ర మంత్రి బండి సంజయ్, బీఆర్ఎస్ నేత వినోద్ రావు లాంటి నాయకులు పార్టీలకు అతీతంగా తెలంగాణ అభివృద్ధికి సహకరించాలి. కలిసి కట్టుగా తెలంగాణ కోసం పని చేయాలి. తమిళనాడు లో వారి భాష కోసం, జల్లికట్టు కోసం పార్టీలకు అతీతంగా నాయకులంతా కలిసి పోరాడారు. 39 మంది తమిళనాడు ఎంపీలు లోక్ సభలో తమిళంలో ప్రమాణ స్వీకారం చేశారు. రాబోయో కేంద్ర మంత్రి వర్గ సమావేశంలో హైదరాబాద్ మెట్రో కు అనుమతి ఇస్తే బాగుంటుంది. విద్యార్థుల్లో నైపుణ్యం పెంచడం కోసం 75 ఐటీఐలను ఐటీసీలు మారుస్తున్నాం. రూ.2100 కోట్లతో టాటా సంస్థ యువతకు శిక్షణ, ఉపాధి కల్పించడానికి ముందుకు వచ్చింది. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ బోర్డు చైర్మన్ గా ఆనంద్ మహీంద్రా నియమించాం’’ అని వెల్లడించారు.
ఒలింపిక్స్‌లో బంగారు పతాకాలే లక్ష్యం
‘‘యూనివర్సిటీ కోసం రూ.600 కోట్ల కార్పస్ ఫండ్‌ను ఏర్పాటు చేస్తున్నాం. జూన్ 2 లోపల మేఘా సంస్థ నిర్మిస్తున్న యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ భవనం పూర్తి అవుతుంది. 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశం ఒలంపిక్స్ లో పతకాలు తేలేకపోయిది. స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేస్తున్నాం. 2028 లో తెలంగాణ నుంచి ఒలింపిక్స్ లో బంగారు పతకాలు తెచ్చేలా లక్ష్యం పెట్టుకుని పనిచేస్తున్నాం. ప్రధాని మోదీ నుంచి అనుమతులు ఇప్పించగల్గే నాయకులు ఈ వేదికపై ఉన్నారు. ప్రధాని ని కలిసి మన రాష్ట్రానికి కావాల్సిన నిధులు తెచ్చుకున్నాం. వన్ ట్రిలియన్ ఎకానమి గా తెలంగాణ ను తీర్చిదిద్దాలన్న కోరిక నాకుంది’’ అని అన్నారు.