
‘నేను బీఆర్ఎస్‌లోనే ఉన్నా’
అందరిదీ ఒకే మాటా.. దానంకు చిక్కులు తప్పవా..
పార్టీఫిరాయింపుల విషయంలో అసలు తానే పార్టీనే మారలేదని ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి తేల్చి చెప్పారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా సంచలనంగా మారాయి. తెలంగాణలో ఎమ్మెల్యేల ఫిరాయింపులపై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అత్యున్నత న్యాయస్థానం తీర్పు మేరకు ఫిరాయింపులపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారణ చేపట్టారు. పార్టీ ఫిరాయించారని బీఆర్ఎస్ చెప్తున్న పది మంది ఎమ్మెల్యేలకు నోటీసులు కూడా జారీ చేశారు. వాటిని స్వీకరించిన కృష్ణ మోహన్ తాజాగా నోటీసులకు బదులిచ్చారు. తాను ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నానని అన్నారు. అదే విషయాన్ని స్పీకర్‌కు వివరించినట్లు చెప్పారు. పరిస్థితుల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీలోకి చేరానని అన్నారు. అధికార పార్టీలో ఉంటే నియోజకవర్గ పనులు జరుగుతాయిన కాంగ్రెస్‌లోకి వచ్చానని అన్నారు.
పార్టీ మారి తప్పు చేశా..
‘‘నేను పార్టీ మారి తప్పు చేశాను. కాంగ్రెస్‌లో ఉంటే అద్దె ఇంట్లో ఉన్న భావన కలుగుతోంది. ప్రస్తుతం నేను బీఆర్ఎస్‌లోనే ఉన్నాను. హరీష్ రావు నాతో రెగ్యులర్‌గా టచ్‌లో ఉంటారు’’ అని ఆయన వివరించారు. కాగా ఇప్పటికే స్పీకర్ నోటీసులకు ఐదుగురు ఎమ్మెల్యేలు తమ సమాధానం ఇచ్చారు. వారంతా కూడా తాము ఇంకా బీఆర్ఎస్‌లోనే ఉన్నామని చెప్పారు. కావాలంటే అసెంబ్లీ రికార్డుల్లో చూడాలని అన్నారు.
అసలు చిక్కు దానంకేనా..!
అయితే ఇప్పటి వరకు మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారని, వారిపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్.. సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కానీ వారంతా కూడా తాము బీఆర్ఎస్‌లోనే ఉన్నామని చెప్పి వేటు నుంచి తప్పుకోవచ్చు. అయితే ఇక్కడ అసలు చిక్కు దానం నాగేందర్‌కే వచ్చి పడేలా కనిపిస్తోంది. అందుకు కారణం.. ఆయన ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ తరుపు పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత పార్టీ మారి కాంగ్రెస్ తరపున ఎంపీగా పోటీ చేశారు. ఒకవేళ విచారణ సమయంలో ఈ విషయాన్ని లేవనెత్తితే మాత్రం ఆయన చిక్కులు తప్పవని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒక పార్టీ ఎమ్మెల్యేగా ఉండి మరో పార్టీ ఎంపీగా ఎలా పోటీ చేస్తావ్? అని ప్రశ్నిస్తే దానికి దానం ఏమని సమాధానం చెప్తారో మరి.