నేను పోను బాపూ సర్కారు బడికి,తగ్గిన 4.45 లక్షల మంది విద్యార్థులు
x
పాఠశాల విద్యార్థులు

నేను పోను బాపూ సర్కారు బడికి,తగ్గిన 4.45 లక్షల మంది విద్యార్థులు

తెలంగాణలో సర్కారు బడుల్లో చదివే విద్యార్థుల సంఖ్య నానాటికి తగ్గుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గత మూడేళ్లలో 4.45 లక్షల మంది విద్యార్థులు సర్కారు పాఠశాలలను వీడారు.


తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగానికి 2024-25 వ ఆర్థిక సంవత్సరానికి గాను రూ.21,292 కోట్ల బడ్జెట్ కేటాయించినా ప్రభుత్వ పాఠశాలల పనితీరు అంతంత మాత్రంగానే ఉంది. అరకొర ఉపాధ్యాయులు, అసౌకర్యాల సర్కారు పాఠశాలల్లో చదువుకునేందుకు విద్యార్థులు ముందుకు రావడం లేదు. విద్యా ప్రమాణాల్లో వెనుకబడిన ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్య ఏ యేటి కాఏడు తగ్గుతూనే ఉంది. దీంతో తెలంగాణలో నేను పోను బాపూ సర్కారు బడికి అని విద్యార్థులు పాడుకుంటున్న పరిస్థితులు తెలంగాణలో నెలకొన్నాయి.


మూడేళ్లలో సర్కారు బడుల్లో తగ్గిన విద్యార్థుల సంఖ్య
తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు తగ్గుముఖం పట్టాయి.ప్రభుత్వ పాఠశాలల్లో 4.45 లక్షల మంది విద్యార్థుల నమోదు తగ్గిపోయిందని పాఠశాల విద్యాశాఖ అధికారిక రికార్డులే చెబుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలలు ఆంగ్ల మాధ్యమ బోధనను అందిస్తున్నప్పటికీ, ఇందులో చదివే విద్యార్థుల సంఖ్య తగ్గుతూనే ఉంది. ప్రైవేట్ పాఠశాలల్లో గత మూడేళ్లలో 5.37 లక్షల మంది కొత్త విద్యార్థులు అడ్మిషన్లు పొందారు. సర్కారు బడుల్లో విద్యార్థుల అడ్మిషన్లు తగ్గుతుండగా, ప్రైవేటు పాఠశాలల్లో చేరే వారి సంఖ్య పెరుగుతోంది.

ప్రైవేటు పాఠశాలలకు లాభం
తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలకు నష్టం వాటిల్లుతుండగా, ప్రైవేట్ పాఠశాలలకు లాభంగా మారింది. ప్రభుత్వ విద్యాసంస్థల్లో అడ్మిషన్లు 2021-22 విద్యా సంవత్సరంలో 30,78,189 మంది నుంచి 2023-24 నాటికి 26,36,630మంది విద్యార్థులకు తగ్గారు. అదే విద్యా సంవత్సరంలో ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థుల అడ్మిషన్లు 28,67,895 నుంచి 34,05,430కి పెరిగాయి.

సర్కారు బడుల్లో విద్యా ప్రమాణాలు పెంచాలి
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సెక్రటరీ సోమ శ్రీనివాసరెడ్డి కోరారు. ఇరుకు గదులు, క్రీడామైదానాలు లేకున్నా ప్రైవేటు పాఠశాలల ఏర్పాటుకు ప్రభుత్వం ఎలా అనుమతిస్తుందని ఆయన ప్రశ్నించారు.ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ల ఖాళీలను భర్తీ చేసి విద్యార్థులకు మెరుగ్గా పాఠాలు చెప్పాలని ఆయన కోరారు.

ప్రాథమిక పాఠశాలల్లోనూ...
ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల తగ్గుదల అన్ని స్థాయిల్లో ఉంది.ప్రాథమిక పాఠశాలల స్థాయిలో సర్కారు బడుల నుంచి మానేసిన విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉంది.ప్రభుత్వ పాఠశాలల్లో 3 లక్షల కంటే ఎక్కువ మంది వదిలి వెళ్లారు. ప్రభుత్వ పాఠశాలలు అన్ని తరగతుల్లోనూ ఇంగ్లీష్ మీడియం బోధనను ప్రవేశపెడుతున్నప్పటికీ ప్రైవేట్ విద్యకు ప్రాధాన్యం పెరుగుతుందని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

హైస్కూల్ విద్యార్థులు ప్రైవేటు వైపు మొగ్గు
ప్రాథమిక పాఠశాలల్లో ప్రభుత్వ పాఠశాలల్లో చేరిన విద్యార్థుల సంఖ్య పెరుగుతుండగా, అప్పర్ ప్రైమరీ, హయ్యర్ ఎడ్యుకేషన్ పాఠశాలల్లో విద్యార్థులు ఎక్కువ మంది ప్రైవేటు పాఠశాలల్లో చేరుతున్నారు. గత మూడు విద్యా సంవత్సరాల నుంచి ఇదే పద్ధతి కొనసాగుతోంది. 2023-24 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో 8,15,505 మంది విద్యార్థులు చేరగా, ప్రైవేటు పాఠశాలల్లో చేరిన విద్యార్థుల సంఖ్య కేవలం 59,143 మంది మాత్రమేనని తేలింది.
అప్పర్ ప్రైమరీ పాఠశాలల్లో 2,33,312 మంది విద్యార్థులు చేరగా, ప్రైవేటు పాఠశాలల్లో చేరిన విద్యార్థుల సంఖ్య 5,35,347 మందికి పెరిగింది. అలాగే ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో కంటే ప్రైవేటు పాఠశాలల్లో చదివే విద్యార్థుల సంఖ్య అధికంగా ఉంది. 2023-24 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో కేవలం 15,87,813 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రైవేటు పాఠశాలల్లో అత్యధికంగా 28,10,940 మంది విద్యార్థులు చదువుతున్నారని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.

నాణ్యమైన విద్య కోసం...
దిగువ మధ్యతరగతి కుటుంబాలతో సహా చాలా కుటుంబాల వారు తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలల్లో చేర్చాలని భావిస్తున్నారు. ప్రధానంగా నాణ్యమైన విద్య, మౌలిక సదుపాయాలు, వ్యక్తిగత శ్రద్ధతో నడుస్తున్న ప్రైవేటు పాఠశాలల్లో తమ పిల్లల్ని చేర్చేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు ఆసక్తి చూపిస్తున్నారు.

ఉపాధ్యాయుల కొరతతో...
విద్యా ప్రమాణాలు తగ్గడం, మౌలిక సదుపాయాలు కొరవడటంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు తగ్గడానికి కారణమవుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లోని ఖాళీలను సకాలంలో భర్తీ చేయకపోవడంతో చాలా మంది తల్లిదండ్రులు మెరుగైన కెరీర్ అవకాశాల కోసం తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేట్ పాఠశాలలకు మారుస్తున్నారు.

ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలి
ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని తెలంగాణ ఉపాధ్యాయ సంఘం నాయకుడు సయ్యద్ షౌకత్ అలీ డిమాండ్ చేశారు.ఒకే ఉపాధ్యాయుడితో 6,500 కంటే ఎక్కువ పాఠశాలలు పనిచేస్తున్నాయని, దీనికితోడు మౌలిక వసతులతో పాటు సరైన పర్యవేక్షణ యంత్రాంగం కూడా లేదని ఆయన ఆరోపించారు.ప్రాథమిక స్థాయిలో ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండేలా ప్రభుత్వం ఖాళీలను భర్తీ చేయాలని ఉపాధ్యాయ సంఘం నాయకుడు సయ్యద్ షౌకత్ అలీ కోరారు.


Read More
Next Story