‘అందరినీ తొక్కుకుంటూ వెళ్తా’
x

‘అందరినీ తొక్కుకుంటూ వెళ్తా’

మరోసారి సంచలనంగా మారిన కవిత వ్యాఖ్యలు.


మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ఇచ్చిన పదవి కాబట్టే ఎమ్మెల్సీగా రాజీనామా చేశానన్నారు. బీఆర్ఎస్ ఇచ్చే పదవి తనకు అక్కర్లేదన్నారు. అంతేకాకుండా రాజకీయాల్లో ఎవరూ ఎవరికీ దారివ్వరని, అందరినీ తొక్కుకుంటూ వెళ్లాలని అన్నారు. తాను అదే ఫార్ములా పాటిస్తానన్నారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీ ఎవరైనా పెట్టుకోవచ్చని, తనకయితే సొంత పార్టీ పెట్టాలన్న ఆలోచన ప్రస్తుతానికి లేదని స్పష్టం చేశారు. అంతేకాకుండా కవిత.. కాంగ్రెస్‌లో చేరనున్నారని వస్తున్న వార్తలకు కూడా ఆమె ఫుల్‌స్టాప్ పెట్టారు. తనను కాంగ్రెస్ పెద్దలు ఎవరూ సంప్రదించలేదని చెప్పారు. కాగా బీఆర్ఎస్ నేతలు చాలా మంది తనతో టచ్‌లో ఉన్నారని, ఆ జాబితా చాలా పెద్దగానే ఉందని కూడా చెప్పారు. తనపై బీఆర్ఎస్ సోషల్ మీడియా దాడి చేస్తోందని కవిత ఆరోపించారు. అదొక్కటే కాకుండా హరీష్ రావు, జోగినపల్లి సంతోష్‌ల సోషల్ మీడియాలు కూడా తననే టార్గెట్ చేస్తున్నాయని అన్నారు.

హరీష్ రావంటే అందుకే కోపం..

‘‘హరీష్ రావు అంటే నాకు కాళేశ్వరం విషయంలో తప్ప మరే అంశంలో కోపం లేదు. ఘోష్ కమిషన్ నివేదిక చూస్తే అన్నీ తేటతెల్లం అవుతాయి. చాలా విషయాల్లో హరీష్ రావు తనకు సంబంధం లేదని అన్నారు. అంతా కేసీఆర్ నిర్ణయమే అని చెప్పారు. ఈ విషయాలు నివేదికలోనే ఉన్నాయి. వివిధ శాఖ ఫైల్స్ నేరుగా కేసీఆర్‌కు వెళ్తున్నాయి. ఇది చూసుకోవాలని 2016లోనే కేటీఆర్‌కు చెప్పాను. కానీ పట్టించుకోలేదు. ఇప్పుడు కేసీఆర్‌పై అవినీతి మచ్చ పడుతుంటే తట్టుకోలేకపోతున్నా’’ అని కవిత అన్నారు.

ఆ అర్హత కాంగ్రెస్‌కు లేదు..

‘‘మళ్ళీ అధికారంలోకి వచ్చే అర్హత కాంగ్రెస్‌కు లేదు. నాకు కాంగ్రెస్‌లో చేరాలన్న ఆలోచన కూడా లేదు. వాళ్లెవరూ నన్ను సంప్రదించలేదు. అందరం కలిసి బీసీ రిజర్వేషన్ల కోసం పోరాడాలి. వాటిని సాధించుకోవాలి. బీసీల కోసం కొట్లాడదాం. ముందు రిజర్వేషన్లు సాధించుకుందాం’’ అని పిలుపునిచ్చారు. అనంతరం తన రాజీనామాపై కూడా మాట్లాడారు. తన రాజీనామాను స్పీకర్ ఫార్మాట్‌లో పంపానని చెప్పారు. తన రాజీనాను ఆమోదించాలని ఫోన్ కూడా చేసిన కోరాను. అవసరం అయితే మరోసారి రాజీనామా లేఖను పంపుతా. బీఆర్ఎస్ ఇచ్చిన పదవి నాకేదీ అక్కర్లేదు. తండ్రి పార్టీ నుంచి సస్పెండ్ అయిన మొదటి కూతుర్ని నేనే’’ అని కవిత వ్యాఖ్యానించారు.

Read More
Next Story