ఢిల్లీని అయినా ఢీ కొడతా, కేంద్రానికి రేవంత్ వార్నింగ్
x

ఢిల్లీని అయినా ఢీ కొడతా, కేంద్రానికి రేవంత్ వార్నింగ్

తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం కావాలనే అన్యాయం చేస్తోందంటూ ధ్వజమెత్తిన రేవంత్.


ప్రజల ఆశీర్వాదాలు ఉంటే తాను ఢిల్లీని కూడా ఢీకొడతానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణకు మోదీ ప్రభుత్వం కావాలనే అన్యాయం చేస్తోందని, ప్రజలు తనతో ఉంటే మోదీ సర్కార్‌ను ఎదిరిస్తానని పునరుద్ఘాటించారు. అసలు తెలంగాణ అభివృద్ధికి కేంద్రం ఎందుకు సహకరించడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ విజయోత్సవాల్లో భాగంగా నర్సంపేటలో నిర్వహించిన కార్యక్రమంలో రేవంత్ పలు కీలక అంశాలు లేవనెత్తారు. ఈ పర్యటనలో భాగంగా రూ.508 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు రేవంత్. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం, బీఆర్ఎస్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు.

తెలంగాణకు న్యాయం చేయట్లేదు

ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణపై వివక్ష చూపుతున్నారని ఆరోపించిన సీఎం రేవంత్, రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన సహకారం కేంద్రం ఎందుకు అందించడం లేదని ప్రశ్నించారు. “తెలంగాణ ప్రజలు మనకు ఆశీర్వదిస్తే ఢిల్లీని ఢీకొట్టడానికి కూడా వెనుకాడను. నాకు వయస్సు, ఓపిక రెండూ ఉన్నాయి… కేంద్రం సమాధానం చెప్పక తప్పదు’’ అని స్పష్టం చేశారు.

బీఆర్ఎస్ నేతలపై వ్యాఖ్యలు

జూబ్లీహిల్స్ ఫలితాలు ప్రజల తీర్పునకు నిదర్శనమని పేర్కొంటూ, బీఆర్ఎస్‌పై తీవ్రమైన విమర్శలు చేశారు. “మళ్లీ అబద్ధాలు చెబుతూ తిరిగితే ప్రజలు బండకేసి కొడతారు’’ అని హెచ్చరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో డబ్బు రాజకీయాలకు తావివ్వకూడదని, గ్రామాల్లో యువత సర్పంచ్ ఎన్నికల్లో బరిలో దిగాలని పిలుపునిచ్చారు.

వరంగల్ అభివృద్ధికి స్పష్టమైన రోడ్‌మ్యాప్

వరంగల్‌ను హైదరాబాద్ స్థాయిలో అభివృద్ధి చేయడమేకాక, మార్చి 31లోపు వరంగల్ ఎయిర్‌పోర్ట్ పనులు ప్రారంభించనున్నట్లు సీఎం హామీ ఇచ్చారు. కేసీఆర్ హయాంలో ఎయిర్‌పోర్ట్‌లపై ఎటువంటి దృష్టి పెట్టలేదని విమర్శించారు.

డబుల్‌ బెడ్‌రూమ్ ఇళ్లపై బీఆర్ఎస్ చేసిన మోసాన్ని ప్రస్తావిస్తూ, “ఇందిరమ్మ ఇళ్లను మేము ఇచ్చిన ప్రాంతాల్లోనే మేము ఓట్లు అడుగుతాం’’ అన్నారు. నర్సంపేట నియోజకవర్గానికి మాత్రమే 3,500 ఇళ్లు, వచ్చే ఏడాదిలో మరో 3,000 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ప్రకటించారు.

రైతులకు భరోసా – విద్యుత్‌, రేషన్‌, వరి కొనుగోలు

రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌ అందిస్తున్నామన్న సీఎం, “వరి వేస్తే ఉరే అన్న కేసీఆర్ మాటలు ప్రజలు మరచిపోలేదు’’ అని తెలిపారు. రాష్ట్రంలో కోటి పది లక్షల రేషన్ కార్డులు ఇచ్చి, మూడు కోట్ల మందికి సన్నబియ్యం అందజేస్తున్నామని చెప్పారు. “వరి పండించండి… ప్రతిగింజ మేమే కొనుగోలు చేస్తాం’’ అని హామీ ఇచ్చారు.

మహిళలు – పేదల కోసం కొత్త కార్యక్రమాలు

ఇరిగేషన్‌, ఎడ్యుకేషన్‌కు ప్రాధాన్యం ఇస్తామని, కోటి మహిళలను కోటీశ్వరులుగా మార్చే లక్ష్యంతో కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు. 18 ఏళ్లు పైబడిన ప్రతి మహిళకు చీరల పంపిణీ కొనసాగుతుందన్నారు. మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు ఆన్‌లైన్‌ మార్కెట్‌ సదుపాయం కల్పించనున్నట్లు తెలిపారు.

ఉద్యోగాలు, రోడ్ల నిర్మాణానికి హామీలు

త్వరలో 40 వేల ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు సీఎం వెల్లడించారు. నిరుద్యోగులు అవకాశాన్ని వినియోగించుకుని చదువులో మెరుగుపడాలని సూచించారు. గ్రామాల్లో రూ.20 వేల కోట్లు ఖర్చుతో రోడ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు కూడా తెలిపారు.

Read More
Next Story