
మూడు సార్ల ఎమ్మెల్యే రాజాసింగ్‌కు ఈ విషయం కూడా తెలీదా..?
అసెంబ్లీకి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా హాజరయి అనేక విషయాలు లేవనెత్తుతానన్న గోషామహల్ ఎమ్మెల్యే.
అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో తాను ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పాల్గొంటానని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ చెప్పారు. ఆయన చేసిన వ్యాఖ్యలు కాస్తంత విచిత్రంగా ఉన్నాయి. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రాజాసింగ్ ఏంటి ఇలా మాట్లాడుతున్నారు? ఆయనకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలియవా? లేదంటే తన గోయి తానే తీసుకుంటున్నారా? అన్న చర్చలు తీవ్రతరం అవుతున్నాయి. శనివారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో రాజాసింగ్ శుక్రవారం ఈ వ్యాఖ్యలు చేశారు. తనకు ఇప్పుడు మరింత స్వేచ్ఛ ఉంటుందని అన్నారు. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా తాను అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొంటానని, అనేక అంశాలు లేవనెత్తుతానని చెప్పుకొచ్చారు.
ఇన్నాళ్లూ తొక్కేశారు..
‘‘ఇన్నాళ్లూ కూడా అసెంబ్లీలో మాట్లాడాలంటే పార్టీ అధినాయకత్వం నుంచి ఆమోదం రావాల్సి ఉండేది. కానీ నాకిప్పుడు ఆ అవసరం లేదు. ఇండిపెండెంట్ నేతగా నేను స్వేచ్ఛగా మాట్లాడొచ్చు. గతంలో అయితే అసెంబ్లీ సమావేశాలు ఆఖరికి చేరుకునే వరకు మాట్లాడే అవకాశం ఇచ్చే వాళ్లు కాదు. ఆ ఛాన్స్ వచ్చి ఉంటే ఎన్నో విషయాలు లేవనెత్తేవాడిని. నాలాగే పార్టీలో చాలా మంది నేతలు అసంతృప్తితో ఉన్నారు. చేవెళ్ల ఎంపీ వ్యవహారం ఇందుకు ఉదాహరణ. తమ పదవులు పోతాయన్న ఆలోచనతోనే చాలా మంది పార్టీలో ఇబ్బందులపై నోరువిప్పడం లేదు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలను కొందరు సర్వనాశనం చేస్తున్నారు’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు రాజాసింగ్.
లాజిక్ మిస్ అయ్యావ్.. రాజా..
అయితే అసెంబ్లీ సమావేశాల్లో ఇండిపెండెంట్‌గా పాల్గొంటానన్న రాజాసింగ్ అసలు లాజిక్ మిస్ అయ్యారు. ఆయన బీజేపీ పార్టీకి రాజీనామా చేశారు కానీ ఎమ్మెల్యే పదవికి కాదు. పదవీ కాలం పూర్తయ్యే వరకు కూడా అసెంబ్లీ రికార్డ్స్ ప్రకారం ఆయన బీజేపీ ఎమ్మెల్యేగానే ఉంటారు. అలాంటప్పుడు ఆయన అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో ఎండిపెండెంట్ ఎమ్మెల్యేగా ఎలా పాల్గొంటారు. ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చేసినా.. టెక్నికల్‌గా మాత్రం ఆయన బీజేపీ ఎమ్మెల్యేనే. ఎందుకంటే ఆయన బీజేపీ బీ-ఫారమ్‌పైన ఎన్నికల్లో గెలిచారు. ఆ బీ-ఫారమ్ గడువు 2028లో పూర్తవుతుంది. అంటే అప్పటి వరకు ఆయన బీజేపీ ఎమ్మెల్యేనే. మూడు సార్లు ఎమ్మెల్యే అయిన రాజా సింగ్ ఈ లాజిక్ ఎలా మిస్ అయ్యారు.
తన గొయ్యి తానే తీసుకుంటున్నారా..?
అయితే ఈ వ్యాఖ్యలతో రాజాసింగ్ తన గొయ్యి తానే తీసుకుంటున్నారన్న వాదన కూడా బలంగా వినిపిస్తోంది. ఒకవేళ ఇదే విధంగా తాను ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా సమావేశాల్లో పాల్గొంటానంటూ రాజాసింగ్.. స్పీకర్‌కు లేఖ అందిస్తే.. ఆయన జుట్టు బీజేపీ చేతిలోకి వెళ్లినట్లే అవుతుంది. అదే జరిగితే మరుక్షణం.. ఆయనే అంటున్నారు కాబట్టి.. రాజాసింగ్ సభ్యత్వం రద్దు చేయాలని బీజేపీ కోరుతుంది. అప్పుడు ఆయన ఎమ్మెల్యే పదవిని కోల్పోతారు. ఈ రకంగా చూసుకుంటే రాజాసింగ్ తన పదవికి తానే ఎసరు పెట్టుకుంటున్నట్లు కనిపిస్తోంది. మరి శనివారం నుంచి మొదలయ్యే అసెంబ్లీ సమావేశాల్లో ఏం జరుగుతుందో చూడాలి.