‘నేను ఎవరి ట్రాప్‌లో పడే వ్యక్తిని కాదు’
x

‘నేను ఎవరి ట్రాప్‌లో పడే వ్యక్తిని కాదు’

గాంధీ కుటుంబంతో తనకు ఎంతో మంచి అనుబంధం ఉందని, ఫొటోలు దిగి చూపించుకోవాల్సిన గతి తనకు పట్టలేదని అన్నారు.


ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ వచ్చిన ప్రతిసారీ గాంధీ కుటుంబంతో ఫొటోలు దిగి వారిని కలిసినట్లు నిరూపించుకోవాల్సిన అవసరం తనకు లేదని అన్నారు. గాంధీ కుటుంబంతో తనకు ఎంతో మంచి అనుబంధం ఉందని, ఫొటోలు దిగి చూపించుకోవాల్సిన గతి తనకు పట్టలేదని అన్నారు. తాను పార్టీ పెద్దలతో భేటీ అయ్యానని నిరూపించుకోవాలంటే కొందరు ఫొటోలు ఏమైనా ఉన్నాయని అంటున్నారని, తనకు అలా నిరూపించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. తనెవరో తెలియకుండా కాంగ్రెస్ తనకు టీపీసీసీ అధ్యక్షుడి పోస్ట్, సీఎం పదవి అందించిందా? అని ప్రశ్నించారు. తమ పార్టీ పాలనలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్రతిపక్షాలు కడుపుమంటతో ప్రజలను తప్పుదోవ పట్టించడం కోసమే ఇలాంటి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయని ఆయన అన్నారు.

అయితే ఇటీవల ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్..రాహుల్ గాంధీతో భేటీ అయినట్లు తెలిపారు. ఆ రోజున ఎటువంటి ఫొటోలు బయటకు రాకపోవడంతో.. ఈ భేటీ అంతా ఒక బోగస్ అని ప్రతిపక్షాలు విమర్శించారు. రాహుల్, రేవంత్ సమావేశం నిజంగానే జరిగి ఉంటే ఒక్క ఫొటో కూడా ఎందుకు విడుదల చేయలేదని ప్రశ్నించారు. అందుకు బదులుగానే ఈరోజు ఢిల్లీలో రేవంత్ ఈ వ్యాఖ్యలు చరేశారని తెలుస్తోంది. అంతేకాకుండా ఢిల్లీలో చిట్‌చాట్ నిర్వహించిన రేవంత్.. ఎవరు ఎన్ని ట్రాప్‌లు ట్రై చేసినా తాను వాటిలో పడనని స్పష్టం చేశారు.

మరికాసేపట్లో కేంద్ర మంత్రి జైశంకర్‌తో రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. ‘భారత్ సమ్మిట్’కు క్లియరెన్స్ అందుకోవడం కోసమే తాను కేంద్రమంత్రిని కలుస్తున్నట్లు ఆయన చెప్పారు. ‘‘తెలంగాణలో ‘భారత్ సమ్మిట్’ పేరిట భారీ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అందులో 60 దేశాల ప్రతినిధులు పాల్గొనే అవకాశం ఉంది. ఈ సమ్మిట్‌కు కేంద్రం క్లియరెరన్స్ ఇవ్వాల్సి ఉంది. ఆ విషయంపైనే కేంద్రమంత్రి జైశంకర్‌ను కలుస్తున్నాను’’ అని తెలిపారు రేవంత్.

Read More
Next Story