‘తెలంగాణలోనే ఉంటాం’.. ఐఏఎస్ అధికారులు
ఆంధ్రకు వెళ్లిపోవాలంటూ కొందరు ఐఏఎస్, ఐసీఎస్ అధికారులకు కేంద్ర డీఓపీటీ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఉత్తర్వులపై తాజాగా పలువురు అధికారులు క్యాట్‌ను ఆశ్రయించారు.
ఆంధ్రకు వెళ్లిపోవాలంటూ కొందరు ఐఏఎస్, ఐసీఎస్ అధికారులకు కేంద్ర డీఓపీటీ ఉత్తర్వులు ఇచ్చింది. వారు ఏపీకి తరలి వెళ్లాల్సిన సమయం కూడా దగ్గర పడుతుండటంతో వారు మరోసారి కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. క్యాట్‌లో పిటిషన్లు వేశారు. తమను తెలంగాణలోనే కొనసాగించాలని, తాము ఇక్కడే ఉంటామని, డీఓపీటీ ఉత్తర్వులు రద్దు చేయాలని వారు తమ పిటిషన్‌లో పేర్కొన్నారు. తాము తెలంగాణలోనే కొనసాగేలా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని వారు కోరారు. ఈ మేరకు ముగ్గురు ఐఏఎస్‌లు పిటిషన్‌లు దాఖలు చేశారు. కాగా ఏపీలోనే కొనసాగేలా తమకు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని ఐఏఎస్ సృజన.. ఏపీ సీఎం చంద్రబాబు సహా క్యాట్‌కు విజ్ఙప్తి చేశారు. ఈ పిటిషన్లు స్వీకరించిన కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ అతి త్వరలోనే వీటిపై విచారణ జరపనుంది. ఈ బదిలీ అధికారుల్లో తెలంగాణాను వదిలేసి ఏపీలో రిపోర్టు చేయబోతున్న ఐఏఎస్ అధికారులు జీహెచ్ఎంసీ కమీషనర్ కాటా అమ్రపాలి, విద్యుత్ శాఖలో ట్రాన్స్ కో, జెన్కో ఎండీ రొనాల్డ్ రాస్, మహిళా, శిసుసంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి వాకాటి కరుణ, అటవీశాఖ ముఖ్య కార్యదర్శి వాణీ విశ్వనాధ్, ఎం ప్రశాంతితో పాటు ఐపీఎస్ అధికారులు అనంజనీ కుమార్, అభిలాసా బిష్త్, అభిషేక్ మహంతి పేర్లు ఉన్నాయి.
అసలు బదిలీ ఎందుకు చేశారు ?
రాష్ట్ర విభజన సమయంలో వీళ్ళల్లో కొందరు తమ సొంతూళ్ళు ఏపీ అనే చెప్పారు. తెలుగురాష్ట్రాలకు సంబంధంలేని అధికారులు విభజన సమయంలో తాము ఎక్కడ పనిచేస్తున్నామో చెప్పారు. 2014లో సమైక్య రాష్ట్రంలో పనిచేస్తున్న ఏఐఎస్ అధికారులందరి దగ్గర నుండి డీవోపీటీ ప్రత్యేకంగా దరఖాస్తులను తీసుకున్నది. దరఖాస్తుల్లో వాళ్ళు ఇచ్చిన సమాచారం ఆధారంగా తెలంగాణాలో పనిచేస్తున్న వాళ్ళని ఏపీకి బదిలీచేసింది. అలాగే కొందరు ఏపీలో పనిచేస్తున్న అధికారులను తెలంగాణాకు బదిలీచేసింది. వీళ్ళని ఎందుకు బదిలీచేసిందంటే ఏపీ అధికారులే అయినప్పటికీ తాము తెలంగాణాలో పనిచేస్తామని రిక్వెస్టు పెట్టుకున్నారు. దరఖాస్తుల్లో సొంతూర్లు+ఇచ్చిన ఆప్షన్ ఆధారంగానే వీళ్ళని బదిలీచేసింది.
అయితే తెలంగాణాలో పనిచేస్తున్న అధికారులు ఏపీకి వెళ్ళకుండా తాముంటున్న తెలంగాణాలోనే ఉండేట్లుగా అప్పట్లో మ్యానేజ్ చేసుకున్నారు. రెండు ప్రభుత్వాలు కూడా వీళ్ళని చూసీచూడనట్లుగా వదిలేశాయి. అయితే వీళ్ళ బదిలీ విషయాన్ని డీవోపీటీ గట్టిగా పట్టుకోవటంతో వీళ్ళంతా క్యాట్, కోర్టుల్లో కేసులు వేశారు. అయినా వీళ్ళ వాదన చెల్లుబాటుకాలేదు. దాంతో ఇపుడు తెలంగాణా నుండి ఏపీకి-ఏపీనుండి తెలంగాణాకు మారక తప్పటంలేదు.