
పోలీసులకు షాకిచ్చిన ఐబొమ్మ వన్ వెబ్ సైట్
ఇందులో కూడా తెలుగుసినిమాల హెచ్ డీ క్వాలిటి ప్రింట్ల సినిమాలు ఉన్నట్లు విపరీతంగా ప్రచారం జరుగుతోంది
సినిమా పైరసీ వెబ్ సైట్ ఐబొమ్మ పోలీసులను వదలను అంటోంది. ఒక వెబ్ సైట్ ను మూసేయిస్తే మరొకటి పుట్టుకొస్తోంది. తాజాగా ‘ఐబొమ్మ వన్’ అంటు ఒకటి ప్రత్యక్షమై పోలీసులకు షాకిచ్చింది. నిర్వాహకుడు ఇమ్మడి రవికుమార్ తోనే(IBomma) ఐబొమ్మ, బప్పం.టీవీ వెబ్ సైట్లను పోలీసులు మూయించేసిన విషయం తెలిసిందే. పై రెండు వెబ్ సైట్లు ఇటు పోలీసులకు అటు తెలుగుసినీ(Telugu cinema field) నిర్మాతలకు సంవత్సరాల తరబడి చుక్కలుచూపించింది. కొత్త సినిమా రిలీజ్ అవటం ఆలస్యం హెచ్ డీ క్వాలిటితో పైరసీ ప్రింట్ ఐబొమ్మలో ప్రత్యక్షమయ్యేది. జనాలు కూడా హెచ్ డీ ప్రింట్ కావటంతో ఎంచక్కా సినిమాలను చూసేవారు. ఒరిజినల్ హెచ్ డీ ప్రింట్ కు పైరసీ కాపీకి ఎలాంటి తేడాలేకపోవటంతో సినిమాలను జనాలు బాగా ఎంజాయ్ చేశారు. ఒక అంచనా ప్రకారం ఐబొమ్మకు 5 కోట్లమంది సబ్ స్క్రైబర్లున్నారు.
ఈ పైరసీ ద్వారా రవి ఎంతడబ్బు సంపాదించాడో సరిగా తెలీదుకాని నిర్మాతలకు మాత్రం సుమారు రు. 3 వేల కోట్లు నష్టం జరిగినట్లు అంచనా. రవి దగ్గరున్న హార్డ్ డిస్కుల్లో పోలీసులు 21 వేల సినిమాల పైరసీ కాపీలను స్వాధీనం చేసుకున్నారు. కరేబియన్ దీవుల్లో కూర్చుని ఏళ్ళ తరబడి తన పైరసీ ఆటతో అందరినీ ముప్పుతిప్పలు పెట్టిన ఇమ్మడి రవి ఐదురోజుల క్రితం కూకట్ పల్లిలోని తనింట్లోనే పోలీసులకు పట్టుబడ్డాడు. ప్రస్తుతం రవి రిమాండులో ఉన్నాడు.
ఇదే విషయమై హైదరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ మీడియాతో మాట్లాడుతు ఐబొమ్మ, బప్పం.టీవీని మూయించేశాము కాబట్టి ఇక నుండి పైరస్ సమస్య ఉండదన్నట్లుగా చెప్పారు. ఇందుకు సిని ప్రముఖులు చిరంజీవి, నాగార్జున, దగ్గుబాటి సురేష్ తదితరులు సజ్జనార్ ను కలిసి ధన్యవాదాలు కూడా చెప్పుకున్నారు. ఇదంతా జరిగి 48 గంటలు కాకముందే ఐబొమ్మ వన్ పేరుతో మరో వెబ్ సైట్ ప్రత్యక్షమయ్యింది. ఇందులో కూడా తెలుగుసినిమాల హెచ్ డీ క్వాలిటి ప్రింట్ల సినిమాలు ఉన్నట్లు విపరీతంగా ప్రచారం జరుగుతోంది. జరుగుతున్న ప్రచారంలో వాస్తవంలేదని, ఐబొమ్మ, బప్పం.టీవీ వెబ్ సైట్లను తామే దగ్గరుండి రవితో మూయించేసినట్లు పోలీసులు చెప్పారు.
ఐబొమ్మ, బప్పం.టీవీ వెబ్ సైట్లను మూయించేశారు అనటంలో ఎలాంటి సందేహంలేదు. అయితే ఐబొమ్మ వన్ వెబ్ సైట్ సంగతి ఏమిటని అడిగితే పోలీసులు సరైన సమాధానం చెప్పటంలేదు. ఐబొమ్మ వన్ వెబ్ సైట్ లోకి ఎంటరైతే మూవీరూల్జ్ అనే మరో వెబ్ సైట్ లోకి రీడైరెక్ట్ అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మూవీరూల్జ్ అనే వెబ్ సైట్ కూడా చాలా సంవత్సరాలుగా సినిమాలను ప్రదర్శిస్తోంది.
Hackers and Hacking will continue, one goes another will come , that too with more sophistication. It’s utopian to think that Piracy or Cyber crimes will end with these arrests . Have thefts , burglaries , robberies , cheating ended with arrests of big sophisticated gangs !!?? As… https://t.co/pAllnD3bSK
— CV Anand IPS (@CVAnandIPS) November 19, 2025
రెండురోజుల క్రితమే హోంశాఖ సెక్రటరీ సీవీ ఆనంద్ తన ట్విట్టర్ ఖాతాలో ఒక పోస్టు పెట్టారు. అదేమిటంటే ఐబొమ్మ కాకపోతే మరో వెబ్ సైట్ పైరసీ సినిమాల కోసం ఓపెన్ అవుతుందన్నారు. పైరసీ వెబ్ సైట్లను కంట్రోల్ చేయటం ఎవరిచేతా కాదన్నారు. అప్పుడు సీవీ ఆనంద్ చెప్పిందే ఇపుడు నిజమవుతోందా ? అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

