
పోలీసులు చెప్తే అన్నీ నిజాలవుతాయా: ఇమ్మడి రవి
అసలు ఐబొమ్మ తనదని ఎవరు చెప్పారంటూ ప్రశ్నించిన ఇమ్మడి రవి.
తాను బెట్టింగ్స్ యాప్స్‌ను ప్రమోట్ చేశానని చెప్పడానికి ఏం ఆధారాలు ఉన్నాయంటూ ఇమ్మడి రవి ప్రశ్నించారు. పోలీసులు చెప్తున్నారంటే.. పోలీసులు చెప్తే నిజమైపోతుందా అంటే కీలక వ్యాఖ్యలు చేశాడు. సోమవారంతో అతని పోలీస్ కస్టడీ ముగిసింది. దీంతో అతనిని అధికారులు ఉస్మానియా ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా జడ్జ్.. రవికి రిమాండ్ విధించారు. అనంతరం అతనిని చంచల్‌గుడ జైలుకు తరలించారు అధికారులు. ఈ క్రమంలోనే ఇమ్మడి రవిని మీడియా ప్రతినిధులు కొన్ని ప్రశ్నలు అడిగే ప్రయత్నం చేయగా.. వాటిలో కొన్నిటికి రవి.. ఘాటుగా బదులిచ్చారు.
అసలు తన పేరు ఏంటో చెప్పాలని రవి ప్రశ్నించారు. ‘నా పేరు రవియా, ఐబొమ్మ రవియా చెప్పండి’ అని మీడియాను ప్రశ్నించాడు. అంతేకాకుండా ఏదైనా కోర్టులో చెప్తానని అన్నారు. ఈ సందర్బంగానే ‘ఐబొమ్మ నాదని ఎవరు చెప్పారు? నేను బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేశానని ఎవరు చెప్పారు? ఐబొమ్మలో బగ్స్ ఉన్నాయని ఎవరన్నారు? వాటిని నిరూపించడానికి మీదగ్గర ఎలాంటి ఆధారాలు ఉన్నాయ్?’’ అని అడిగారు. ఈ సందర్బంగానే విదేశాలకు పారిపోయారని, సినిమాలను పైరసీ చేశారని పోలీసులు అంటున్నారని మీడియా ప్రశ్నించగా.. తాను ఎక్కడికీ పారిపోలేదని, కూకట్‌పల్లిలోనే ఉన్నానని రవి సమాధానం ఇచ్చారు.
అన్నీ వేరే వారివే
ఇదిలా ఉంటే రవి విచారణలో పోలీసులకు కీలక విషయాలు తెలిశాయి. ఇన్నాళ్లూ ప్రహ్లాద్ అనే వ్యక్తి రవికి స్నేహితుడని చెప్పగా.. తాజాగా అసలు ప్రహ్లాద్ అనే వ్యక్తితో రవికి పరిచయమే లేదని తేలింది. ప్రహ్లాద్.. డాక్యుమెంట్ జిరాక్స్ కాపీలను దొంగలించి, మీడియేటర్ల సహాయంతో పాన్‌కార్డ్, ఆధార్, లైసెన్స్ పొందినట్లు పోలీసులు గుర్తించారు.
దాంతో పాటుగా రవి వాడిన బ్యాంకు ఖాతాలు కూడా అతనివి కాదని, అవన్నీ అంజయ్య అనే పేరుతో ఉన్నాయని విచారణలో తేలింది. అతను కూడా ఎవరో రవికి తెలియదని, అంజయ్యకు చెందిన డాక్యుమెంట్లను కూడా దొంగదారిలో సంపాదించి బ్ాయంకు ఖాతాను తెరిచినట్లు పోలీసులు గుర్తించారు.

