ఇక్ఫాయ్ లో విద్యార్థినిపై యాసిడ్ దాడి ఘటనలో ట్విస్ట్
x

ఇక్ఫాయ్ లో విద్యార్థినిపై యాసిడ్ దాడి ఘటనలో ట్విస్ట్

ఇక్ఫాయ్ యూనివర్సిటీలో విద్యార్థిని లేఖ్యపై యాసిడ్ దాడి ఘటనలో ట్విస్ట్ నెలకొంది. ఆమెపై యాసిడ్ దాడి జరిగిందనే వార్తలపై వీసీ స్పందించారు.


హైదరాబాద్ నగర పరిధి మోకిలా లోని ఇక్ఫాయ్ యూనివర్సిటీలో విద్యార్థిని లేఖ్యపై యాసిడ్ దాడి ఘటనలో ట్విస్ట్ నెలకొంది. ఆమెపై యాసిడ్ దాడి జరిగిందనే ప్రచారాన్ని అవాస్తవమని మోకిలా ఎస్సై వెల్లడించారు. వేడి నీళ్లు పడటం వల్లే లేఖ్యకి గాయాలయ్యాయని తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు. విద్యార్థినికి 40 శాతం గాయాలయ్యాయని, కోలుకుంటోందని చెప్పారు.

ఇక ఇదే విషయంపై స్పందించిన యూనివర్సిటీ వీసీ గణేష్.. విద్యార్థిని పై యాసిడ్ దాడి జరిగిందని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. వేడినీళ్లు పడటం వల్లే ఆమెకి గాయాలయ్యాయని తెలిపారు. హాస్టల్లో అన్ని గదుల్లో పటిష్టమైన భద్రత ఉందని స్పష్టం చేశారు. "విద్యార్థిని బుధవారం రాత్రి కి తన రూమ్ నుంచి బయటకి వచ్చి ఒంటిపై బొబ్బలు వచ్చాయని చెప్పింది. వెంటనే ఆమెకి వర్సిటీలోని క్లినిక్ లో చికిత్స అందించాం. ఆమె ఒంటిపై నలభై శాతం గాయాలున్నాయి. గతంలో ఎలాంటి గాయాలు లేవు. కారిడార్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ విజువల్స్ ని పోలీసులకి అందించాము. క్లూస్ టీమ్ గదిలోని కొన్ని వస్తువులను తీసుకెళ్లారు. హౌస్ కీపింగ్ వాళ్ళు కూడా విద్యార్థులు గదిలో ఉన్నప్పుడు మాత్రమే రూమ్ క్లీనింగ్ కి వెళతారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు" అని వీసీ గణేష్ పేర్కొన్నారు.

కాగా, గురువారం ఇక్ఫాయ్ యూనివర్సిటీ విద్యార్థినిపై యాసిడ్ దాడి జరిగిందనే వార్త హాట్ టాపిక్ గా మారింది. కాలేజీ వేడుకల్లో రంగు నీళ్లలో యాసిడ్ కలిపి ఆమెపై జల్లారని ఒకవైపు, స్నానం చేసే నీళ్లలో యాసిడ్ కలపడం వల్ల ఆమెకి గాయాలయ్యాయని మరోవైపు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. దీనిపై విద్యార్థిని లేఖ్య తల్లిదండ్రులు శంకరపల్లి మండలం మోకిలా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. ప్రస్తుతం లేఖ్య అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Read More
Next Story