వ్యవసాయ రంగం అభివృద్దికి ICRISAT సపోర్ట్
x

వ్యవసాయ రంగం అభివృద్దికి ICRISAT సపోర్ట్

తెలంగాణలో వివిధ రకాల పంటలకు సంబంధించి అధిక దిగుబడినిచ్చే కొత్త వంగడాలపై పరిశోధనలను ముమ్మరం చేయాలని ప్రతిష్టాత్మక ఇక్రిశాట్ (ICRISAT) సంస్థకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు.


తెలంగాణలో వివిధ రకాల పంటలకు సంబంధించి అధిక దిగుబడినిచ్చే కొత్త వంగడాలపై పరిశోధనలను ముమ్మరం చేయాలని ప్రతిష్టాత్మక ఇక్రిశాట్ (ICRISAT) సంస్థకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగం మరింత అభివృద్ధి చెందేలా పరిశోధనలు సాగాలన్నారు. అంతర్జాతీయ పంటల పరిశోధన సంస్థ ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ జాక్వెలిన్ హ్యూ (Dr. Jacqueline Hughe) గురువారం సచివాలయంలో సీఎంని మర్యాదపూర్వకంగా కలిశారు.

రాష్ట్ర వ్యవసాయ రంగం అభివృద్ధి, కొత్త వంగడాలపై పరిశోధనలు తదితర సమాలోచనల నేపథ్యంలో ICRISAT సంస్థను సందర్శించాల్సిందిగా డైరెక్టర్ జనరల్ జాక్వెలిన్ హ్యూ రేవంత్ ని ఆహ్వానించారు. అందుకు అంగీకరించిన సీఎం త్వరలోనే ఇక్రిశాట్ క్యాంపస్ ను సందర్శిస్తానని తెలిపారు. భేటీలో పలువురు ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.

1972లో హైదరాబాద్ కేంద్రంగా ఏర్పడిన ఇక్రిశాట్‌ (ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఫర్ ది సెమీ-ఎరిడ్ ట్రాపిక్స్) కొత్త వంగడాల పరిశోధనల్లో ప్రపంచానికే మార్గదర్శక సంస్థగా కొనసాగుతోంది. ఇక్రిశాట్ కొలువైన తెలంగాణలోనూ ఆ సంస్థ సేవలను విస్తృతం చేయడం ద్వారా రాష్ట్ర వ్యవసాయ రంగానికి మరింత మేలు జరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

ఇక్రిశాట్‌ ప్రధాన కార్యాలయం హైదరాబాద్ లోనే...

ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది సెమీ-ఎరిడ్ ట్రాపిక్స్ (ICRISAT) వ్యవసాయ రంగంలో అంతర్జాతీయ పరిశోధనా సంస్థ. అధిక దిగుబడినిచ్చే అనేక వంగడాలను కనుగొన్నది. మెట్ట పంటలపై వాతావరణ మార్పుల ప్రభావం గురించి పరిశోధనలు చేస్తోంది. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికై కృషి చేస్తుంది. దీని ప్రధాన కార్యాలయం హైదరాబాద్ లోని పటాన్‌చెరు వద్ద ఉంది. ఇంకా కెన్యా, మాలి, నైజీరియా, మలావి, ఇథియోపియా, జింబాబ్వే లాంటి దేశాల్లో దీనికి ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి. ఈ సంస్థను 1972 లో ఫోర్డ్ ఫౌండేషన్, రాక్‌ఫెల్లర్ ఫౌండేషన్ లాంటి కొన్ని సంస్థలు కలిసి స్థాపించాయి.

ఇక్రిశాట్ స్థాపన కోసం ఆఫ్రికాలో 7 స్థలాలను, ఆసియాలో 5 స్థలాలనూ పరిశీలించాక, హైదరాబాద్ లోని నేల స్వభావం కారణంగా ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నారు. దీని స్థాపనపై భారత్ ప్రభుత్వం, ఫోర్డ్ ఫౌండేషన్ 1972 మార్చి 28 న అవగాహన పత్రంపై సంతకం చేసాయి. 1,374 హెక్టార్ల స్థలాన్ని 99 సంవత్సరాల పాటు లీజుకు ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. సంస్థ ఏర్పాటు కోసం, అప్పటి మెదక్ జిల్లా లోని కాచిరెడ్డిపల్లి, మన్మూల్ గ్రామాల్లోని 4,000 మంది ప్రజలను ఖాళీ చేయించి సమీపం లోని రామచంద్రపురం గ్రామంలో పునరావాసం కలిగించారు. ఈ సంస్థ జీనోమ్ వ్యాలీలో కూడా తన కార్యకలాపాలును ప్రారంభించింది.

Read More
Next Story