Harish Rao
x

కేటీఆర్‌కు నాయకత్వ బాధ్యతలపై హరీష్ రియాక్షన్ ఇదే

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందాల పోటీల్లో బిజీగా ఉన్నాడంటూ చురకలు.


‘బీఆర్ఎస్‌లో కుర్చీలాట నడుస్తోంది? సీఎం సీటు కోసం, పార్టీ అధ్యక్ష పదవి కోసం కేటీఆర్, హరీష్ రావు, కవిత మధ్య తీవ్ర పోటీ జరుగుతోంది. వర్గాలు ఏర్పాటు చేసుకుని పోటీ పడుతున్నారు. డబ్బులు ఇచ్చి జాతకాల్లో కూడా సీఎం స్థానం ఉందని చెప్పించుకుంటున్నారు’ కొన్ని రోజులుగా సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వార్తలివి. కేటీఆర్, హరీష్ మధ్య సీఎం సీటు కోసం తీవ్ర పోటీ ఉందనయితే ఏడాదికి పైగానే జరుగుతున్న చర్చ. అయితే దీనిపై తాజాగా మాజీ మంత్రి హరీష్ రావు స్పష్టతనిచ్చారు. బీఆర్ఎస్ పార్టీలో ఎలాంటి విభేదాలు లేవన్నారు. ‘కేసీఆర్ తర్వాత కేటీఆర్‌కు నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తే స్వాగతిస్తా’’ అని హరీష్ రావు వెల్లడించారు. ఇదే అంశంపై ఇప్పటికే అనేక సార్లు స్పష్టతనిచ్చానని అన్నారు. పార్టీ కార్యకర్తగా కేసీఆర్, పార్టీ తీసుకున్న అన్ని నిర్ణయాలను స్వాగతిస్తానని, ఆదేశాలను శిరసావహిస్తానని పేర్కొన్నారు హరీష్ రావు. అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. ‘‘ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందాల పోటీల్లో బిజీగా ఉన్నాడు. అందాల పోటీల మీద రివ్యూల మీద రివ్యూలు చేస్తున్నాడు’’ అని చురకలంటించారు.

‘‘వేలాదిమంది పోలీస్ లను, ప్రభుత్వాధికారులను నియమించి అందాల పోటీలను నిర్వహిస్తున్నారు. కానీ దేశానికి అన్నం పెట్టే రైతు కోసం, ఆరుగాలం కష్టపడే రైతు కష్టం తీర్చడానికి ఈ ముఖ్యమంత్రికి సమయం లేకపోవడం చాలా దురదృష్టకరం. ఈ ప్రభుత్వానికి రైతుల పట్ల ఏ పాటి చిత్తశుద్ధి ఉందో అర్థమవుతున్నది. ధాన్యపు రాశులను గాలికి వదిలేసి, అందాల పోటీలతో అందాల రాశుల చుట్టూ ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వ యంత్రాంగం తిరుగుతున్నది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల్లో రైతులను అరిగోస పెడుతోంది. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తున్నది. ఈ యాసంగికి 70 లక్షల మెట్రిక్ టన్నుల దాన్యం కొంటామని ప్రభుత్వం చెప్పింది కానీ 40 లక్షల మెట్రిక్ టన్నులు కూడా దాటలేదు. కొన్న వడ్లకు 4 వేల కోట్లు బకాయి పడింది. 48 గంటల్లో కొన్న ధాన్యానికి రైతుల ఖాతాలో డబ్బులు వేస్తామని మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ప్రగల్బాలు పలికారు. పది రోజులైనా కొన్న పంటకు డబ్బులు దిక్కులేదు’’ అని ఎద్దేవా చేశారు.

‘‘బోనస్ ఊసే లేదు. యాసంగి పంటకు 512 కోట్ల రూపాయలు సన్నాలకు బోనస్ చెల్లించాల్సి ఉంది. కానీ ప్రభుత్వం ఐదు పైసలు కూడా విడుదల చేయలేదు. కొనుగోలు కేంద్రాల్లో రైతులు రోజుల తరబడి ఎదురుచూస్తున్నటువంటి పరిస్థితి. కొనుగోలు కేంద్రాల్లో నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉన్నది. లారీలు లేక కొన్న లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లులోకి పోకుండా మిగిలిపోయింది. పెట్టుబడి సహాయం అందించడంలో జాప్యం. వానకాలం రైతు బంధు ఎగ్గొట్టిర్రు. యాసంగి రైతుబంధు మూడెకరాలకు మించి వేయలేదు. పెట్టుబడి సాయం కోసం 18 వేల కోట్లు బడ్జెట్లో పెట్టామని భట్టి గారంటున్నారు. సంవత్సరమంతా మెల్లగా ఇస్తామని అంటున్నారు. కోతలు అయిపోయినా యాసంగి పెట్టుబడి సహాయం ఇంకా వెయ్యలేదు’’ అని తెలిపారు.

‘‘ఎన్నికల ముందు కేసీఆర్ 10,000 ఇస్తున్నాడు మేం 15,000 ఇస్తాం. అది కూడా పంట సీజన్ ప్రారంభం కంటే ముందే ఇస్తామన్నారు. కానీ ఇప్పుడేమో ఓడ దాటాక బోడ మల్లన్న అన్న విధంగా వ్యవహరిస్తున్నారు. పంట పెట్టుబడి సాయం రైతులకు అందించడంలో జాప్యం. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యానికి తక్షణమే కాంటా వేయడంలో జాప్యం. కొన్న ధాన్యాన్ని తరలించడంలో జాప్యం. ధాన్యం అమ్మిన తర్వాత రైతుల ఖాతాల్లో డబ్బులు వేయడంలో జాప్యం. గన్నీ బ్యాగులను సమకూర్చడంలో వైఫల్యం. ధాన్యాన్ని లారీలకు ఎక్కించే హమాలీలను సమకూర్చడంలో వైఫల్యం. కొనుగోలు కేంద్రాల్లో కనీస సౌకర్యాలు కల్పించడంలో వైఫల్యం. గొప్పగా చెప్పిన బోనస్ అందజేయడంలో ఘోర వైఫల్యం. గత అసెంబ్లీలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ మా ప్రభుత్వంలో తరుగు తీయ్యము అని అన్నారు. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలో జెట్టి రాజు అనే రైతు క్వింటాల్కు 10 కిలోల తరుగు తీస్తున్నారని ఆత్మహత్య చేసుకున్నారు’’ అని గుర్తు చేశారు.

‘‘రాష్ట్రవ్యాప్తంగా నిన్న, ఈరోజు రైతులు ఆందోళన చేస్తున్నారు. తాలు, తరుగు పేరుతో రైతులకు అన్యాయం జరుగుతోంది. కొనుగోలు కేంద్రాల్లో వేసిన తూకం కంటే మిల్లర్లు తక్కువ ధాన్యాన్ని చూపుతూ రైతులకు నష్టం కలిగిస్తున్నారు. కొనుగోలు కేంద్రాల నుండి ధాన్యం తరలించడానికి 3-4 రోజులు, మిల్లుల దగ్గర అన్లోడ్ చేయడానికి మరిన్ని రోజులు ఆలస్యం, దీంతో రైతులకు తీవ్ర నష్టం కలుగుతోంది. ఆన్‌లైన్ ట్రక్‌ షీట్‌ విధానం అమలు చేస్తామని ప్రభుత్వం చెప్పినా ఇప్పటివరకు అమలు చేయలేదు. పండిన పంటను అమ్ముకోవడానికి రైతులు 10-10 రోజులు కొనుగోలు కేంద్రాల్లో వేచి చూడవలసిన దుస్థితి ఏర్పడింది. ఈ ప్రభుత్వం మాటలు ఘనం చేతలు శూన్యం. కొనుగోలు కేంద్రాల్లో కనీస వసతులు లేకపోవడం వల్ల రోజుల తరబడి ఎండలో వేచి చూడడం వల్ల రైతులు పిట్టల్లా రాలిపోతున్నారు. మే 13న మహబూబాబాద్ జిల్లా పోచంపల్లిలో గగులోతు కిషన్ మృతి. ఏప్రిల్ 15న జగిత్యాల జిల్లా కథలాపూర్‌లో జలపతి రెడ్డి మృతి. ఏప్రిల్ 21న మహబూబాబాద్ జిల్లా తొర్రూరు చెర్లపాలెంలో హనుమండ్ల ప్రేమలత మృతి. ఏప్రిల్ 22న నెల్లికుదురు మండలం మదనతుర్తిలో బిర్రు వెంకన్న మృతి. ఏప్రిల్ 26న సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ఆకునూరులో చింతకింది హనుమయ్య మృతి.ధాన్యపు రాశులే సాక్షంగా, కొనుగోలు కేంద్రాల్లోనే జరుగుతున్న ఈ రైతు మరణాలు ప్రభుత్వపు హత్యలు. ఇవి సహజ మరణాలు కావు, ముమ్మాటికీ కాంగ్రెస్ నిర్లక్ష్యంతో జరిగినవే హత్యలే’’ అని వ్యాఖ్యానించారు.

‘‘దీనికి ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలి. అందాల పోటీల మీద పోలీస్ కమాండ్ కంట్రోల్, జూబ్లీహిల్స్ ప్యాలస్ లో రివ్యూలు పెడుతున్నారు. సెక్రటేరియట్ మొఖం కూడా ముఖ్యమంత్రి చూడడం లేదు. రైతు సమస్యల పైన ఎందుకు ముఖ్యమంత్రి రివ్యూ పెట్టడం లేదు. అసెంబ్లీలో చెప్పినట్టు నలభై రెండు వేల కోట్లు రుణమాఫీ జరిగిందా లేదని రివ్యూ చేయడానికి ముఖ్యమంత్రికి సమయం లేదు. రాష్ట్రంలో రైతు బీమా కట్టే పరిస్థితిలో ప్రభుత్వం లేదు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు రైతు బీమా అందించాం. ఫిబ్రవరి నెలలో కట్టాల్సిన రైతు బీమా ప్రీమియం కట్టకపోవడం వల్ల చనిపోయిన రైతులకు రైతు బీమా అందడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు వివిధ జిల్లాల్లో ధాన్యం కొనుగోలుపై రైతులు ఆందోళన చేస్తున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా, జటప్రోలు (పెంట్లవెల్లి మండలం):

అకాల వర్షానికి ధాన్యం తడవడంతో రైతులు రాస్తారోకో చేశారు. తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనాలని డిమాండ్ చేశారు’’ అని అన్నారు.

‘‘రాజన్న సిరిసిల్ల జిల్లా, తంగళ్లపల్లి మండలం, జిల్లెల్ల గ్రామం.. సన్న వడ్ల కొనుగోలు లేకపోవడంతో రైతులు సిరిసిల్ల-సిద్దిపేట రహదారిపై ధర్నా చేశారు. వనపర్తి పట్టణం, చిట్యాల మార్కెట్ యార్డు: వర్షాలకు తడిసిన వేలాది బస్తాల వరి, మొక్కజొన్న ధాన్యం. కాంటా జాప్యం, తరలింపు ఆలస్యం వల్ల రైతుల ఆందోళన. అదిలాబాద్ జిల్లా, ఖానాపూర్ మండలం, ఎర్వ చింతల్ గ్రామం: తూకం మోసాలపై పిఎసిఎస్ నిర్వాహకులను రైతులు ఘోరావ్ చేసి తక్షణ చర్యలకు డిమాండ్ చేశారు. రైతులు ఎండకు ఎండి వానకు తడిచిపోతుంటే ఎందుకు ప్రభుత్వం మొద్దు నిద్రపోతున్నది. ప్యాలెస్ లో అందాల పోటీల పై రివ్యూలా. మిమ్మల్ని నమ్మి ఓట్లు వేసినా రైతులకు ఏమో మోసమా. వరంగల్ రైతు డిక్లరేషన్ లో ఇచ్చిన ఏ ఒక్క హామీ అయినా అమలు చేశారా. రైతు డిక్లరేషన్ లో ఇచ్చిన హామీలకు రాహుల్ గాంధీ సాక్ష్యం’’ అని అన్నారు.

‘‘రాహుల్ గాంధీ వరంగల్లో రైతులకు ఇచ్చిన హామీలపై ఏమని సమాధానం చెబుతారు. ఇచ్చిన హామీలు అమలు చేయమని ముఖ్యమంత్రి గారిని అడిగితే ఢిల్లీకి వెళ్తే చెప్పులు ఎత్తుకెళ్లే వారిలా చూస్తున్నారు. ఎవ్వడు నమ్మి అప్పు ఇవ్వట్లేదు అంటున్నారు. చివరికి పాకిస్తాన్ ని నమ్మి అప్పు ఇస్తున్నారు కానీ రేవంత్ రెడ్డిని నమ్మి అప్పు ఇవ్వడం లేదు. ప్రతిపక్షం మీద బురదజల్లబోయి నువ్వు తీసుకున్న గోతిలో నువ్వే పడ్డావు. ప్రభుత్వాన్ని నడపడం అంటే ప్రతిపక్షాలపై దుమ్మెత్తిపోసినంత సులువు కాదు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి పాలనపై దృష్టి సారించి, రైతుల కష్టాలను తీర్చాలని డిమాండ్ చేస్తున్నాము. మంత్రులు, అధికారులు క్షేత్రస్థాయిలో తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి రైతులకు నష్టం జరగకుండా చూడాలి. సీఎం అసెంబ్లీలో ఉపన్యాసాలు ఇచ్చుడు కాదు. తరుగు, తాలు పేరు మీద ఐదు నుండి పది కిలోలు తరుగు తీస్తున్నారు కాబట్టి తరుగు లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం’’ అని స్పష్టం చేశారు.

‘‘రైతుల పక్షాన బీఆర్‌ఎస్ పార్టీ త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తుందని హెచ్చరిస్తున్నాము. సోషల్ మీడియాలో చేస్తున్న తప్పుడు ప్రచారం, వార్తల పై నేను అదే రోజు ఖండించాను. పార్టీ నాయకులు దాసోజు శ్రవణ్ గారు, ఎర్రోళ్ల శ్రీనివాస్ గారు పోలీస్స్టేషన్లో కంప్లైంట్ చేశారు. కొన్ని వందలసార్లు చెప్పాను కేసీఆర్ గారు మా పార్టీ అధ్యక్షులు. వారి ఆదేశాలను తూచా తప్పకుండా పాటించే క్రమశిక్షణ కలిగిన కార్యకర్త హరీష్ రావు అని. పార్టీ నిర్ణయాన్ని, కేసీఆర్ నిర్ణయాన్ని శిరసావహిస్తాను తప్ప పార్టీ నిర్ణయాన్ని జవదాటను. మై లీడర్ ఇస్ కేసీఆర్. వాట్ ఎవర్ కేసీఆర్ సే హరీష్ రావు విల్ ఫాలో’’ అని తేల్చి చెప్పారు.

Read More
Next Story