
హైదరాబాద్ నగరంలో రోడ్లపై నిలిచిన వర్షపునీరు
తెలంగాణలో రైతులకు ఐఎండీ శుభవార్త..ఐదురోజుల పాటు విస్తారంగా వర్షాలు
పంటలు వేసి ఆకాశం వైపు ఎదురు చూస్తున్న రైతులకు వరుణుడు కరుణించాడు. రాబోయే ఐదు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ ప్రకటించింది.
భారత వాతావరణ శాఖ తెలంగాణ రైతులకు శుభవార్త ((IMD Good News Farmers)వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు, ద్రోణి ప్రభావం వల్ల రాబోయే ఐదు రోజుల పాటు ఓ మోస్తరు నుంచి అక్కడ భారీ, అతి భారీ వర్షాలు విస్తారంగా (Extensive Rains) కురుస్తాయని ఐఎండీ ప్రకటించింది.నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతుండటంతోపాటు దక్షిణ ద్రోణి తూర్పు పశ్చిమ దిశగా పయనిస్తుండటం, ఉపరితల చక్రవాకం ఏర్పడటం వల్ల తెలంగాణ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ శాస్త్రవేత్త ఎ ధర్మరాజు శనివారం మధ్యాహ్నం ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
పలు ప్రాంతాల్లో భారీవర్షాలు
తెలంగాణలోని (Telangana) పలు ప్రాంతాల్లో శనివారం భారీవర్షాలు కురిశాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం శాస్త్రవేత్త ఎ ధర్మరాజు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.రంగారెడ్డి జిల్లా చేవెళ్ల, యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట, సిద్దిపేట జిల్లా హుస్నాబాద్,వికారాబాద్ జిల్లా నవాబ్‌పేటలలో శనివవారం 10 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైందని ఆయన చెప్పారు.సిద్దిపేట జిల్లా నంగనూర్ లో 9సెంటీమీటర్ల వర్షం కురిసింది. మెదక్ జిల్లా మెదక్ ,రామాయంపేట, హైదరాబాద్ జిల్లా హిమాయత్‌నగర్ లో 8 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైందని ఆయన తెలిపారు. హైదరాబాద్ జిల్లా షేక్‌పేట్ లో 7,రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ లో 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు
తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరంలోని కొన్ని చోట్ల, రంగారెడ్డి జిల్లా, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట్, వికారాబాద, మెదక్, రాజన్న సిరిసిలల జిల్లాల్లో అక్కడక్కడ విస్తారంగా వర్షాలు కురిశాయి.
రుతుపవన ద్రోణి ప్రభావం
రుతుపవన ద్రోణి శనివారం వాయువ్య ఈశాన్య రాజస్ఠాన్ ప్రాంతంలో వాయుగుండం ఏర్పడిందని వాతావరణ కేంద్రం హెడ్ సైంటిస్టు డాక్టర్ కె నాగరత్న ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ఈ వాయుగుండం ఫతేనగర్, ముజఫర్ పూర్, కాంబై , బంకురా మీదుగా తూర్పు ఆగ్నేయ దిశలో కదిలి ఈశాన్య బంగాళాఖాతం వరకు కొనసాగుతుందని ఆమె తెలిపారు. శుక్రవారం ఉత్తర ఆకాంక్షం ప్రాంతంలో కొనసాగిన తూర్పు పశ్చిమ ద్రోణి దక్షిణ కర్ణాటక నుంచి దక్షిణ కోస్తా ఆంధ్రా తీరం వరకు సముద్ర మట్టం నుంచి 5.8 కిలోమీటర్ల మధ్యలో కొనసాగుతోందని చెప్పారు. దక్షిణ కోస్తా పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టం నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిన ఉపరితల చక్రవాత ఆవర్తనం బలహీన పడిందన్నారు.
రైతులకు ఐఎండీ వాతావరణ సూచన
19-07-2025: శనివారం తెలంగాణ రాష్ట్రంలో తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. శనివారం నుంచి వరుసగా రానున్న ఏడు రోజుల పాటు తెలంగాణ రాస్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రం శాస్త్రవేత్తలు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలోని జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద జిల్లాల్లో శనివారం అక్కడక్కడ భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు శనివారం తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ అక్కడక్కడ కురిసే అవకాశం ఉందిని వారు పేర్కొన్నారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమెైన ఉపరితల గాలులు అన్ని జిల్లాల్లోనూ వీచే అవకాశముందని వారు వివరించారు.
హైదరాబాద్ లోనూ ఎల్లోఅలర్ట్
హైదరాబాద్ నగరంలోని కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, ఆర్ సి పురం, చింతన్, కూకట్ పల్లి, అల్వాల్, కాప్రా, మల్కాజిగిరి, శేరిలింగంపల్లి, యూసుఫ్ గూడ, జూబ్లీహిల్స్, బేగంపేట, మారేడుపల్లి, సికింద్రాబాద్ ప్రాంతాల్లో భారీవర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఐఎండీ అధికారులు ఎల్లోఅలర్ట్ జారీ చేశారు. నగరంలోని ఉప్పల్, ఎల్ బినగర్, ఫలక్ నుమా, చార్మినార్ తదితర మిగతా ప్రాంతాలన్నింటీలోనూ ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు చెప్పారు. నైరుతి రుతుపవనాల ప్రభావం వల్ల తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రాబోయే అయిదు రోజుల పాటు తేలికపాటు భారీవర్షాలు కురుస్తాయని ఐఎండీ హైదరాబాద్ కేంద్రం హెడ్ డాక్టర్ కె నాగరత్న చెప్పారు.
తెలంగాణలో ఐదు రోజుల పాటు ఎల్లో అలర్ట్ జారీ
తెలంగాణలో శనివారం నుంచి వరుసగా రాగల అయిదు రోజులపాటు ఎల్లో అలర్ట్ ప్రకటించామని ఐఎండీ శాస్త్రవేత్త ఎ ధర్మరాజు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. జులై 20వతేదీన తెలంగాణ రాష్ట్రంలోని జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట్, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో అక్కడక్కడ భారీవర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ కేంద్రం అధికారులు చెప్పారు.
9 జిల్లాల్లో ఆరంజ్ అలర్ట్ జారీ
జులై 21వతేదీన తేదీన కామారెడ్డి, సిద్ధిపేట, సంగారెడ్డి, మెదక్, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, రంగారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీవర్షాలు కురిసే అవకాశమున్నందున ఆరంజ్ అలర్ట్ జారీ చేశామని ఐఎండీ అధికారులు వివరించారు.
భారీ నుంచి అతి భారీవర్షాలు
తెలంగాణ రాష్ట్రంలో జులై 21వతేదీన మహబూబాబాద్, వరంగల్, హనమకొండ, సిద్దిపేట్, రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీవర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ శాస్త్రవేత్తలు చెప్పారు. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, జనగాం, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడి భారీవర్షాలు కురవవచ్చిన అంచనా వేశారు. జులై 22వతేదీన భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ హన్మకొండ, జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీవర్షాలు కురిసే అవకాశముంది. జులై 23వతేదీన జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మంజిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీవర్షాలు కురుస్తాయని ఐఎండీ విడుదల చేసిన తాజా వెదర్ బులిటెన్ లో తెలిపింది.
Next Story