
కోదండరామ్‌కి 15 రోజుల్లో పదవి..
ఆయన ఎమ్మెల్సీ పదవి ఊడగొట్టడానికి కోట్లు ఖర్చు చేశారన్న సీఎం రేవంత్ రెడ్డి.
ప్రొఫెసర్ కోదండరామ్‌కు ఎమ్మెల్సీ పదవిపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఉస్మానియా యూనివర్శిటీ వేదికగా.. అతి త్వరలోనే కోదండరామ్‌ను శాసనమండలికి పంపుతామని ప్రకటించారు. ఆయనను ఎమ్మెల్సీ పదవితో గౌరవిస్తే.. బీఆర్ఎస్ నేతలు మాత్రం సుప్రీంకోర్టుకు వెళ్లిమరి ఆయన నియామకాన్ని రద్దు చేయించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకోసం బీఆర్ఎస్ నేతలు రూ.కోట్లు ఖర్చు చేశారని రేవంత్ ఆరోపించారు. ఉస్మానియా యూనివర్సిటీలో నూతనంగా నిర్మించిన భవనాలను ప్రారంభించి, మరికొన్ని నిర్మాణాలకు రేవంత్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగానే ఆయన కోదండరామ్‌ను 15 రోజుల్లో ఎమ్మెల్సీని చేసి శాసనమండలికి పంపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. అసలు కోదండరామ్ పదవిని పోగొట్టడాలన్న శునాకనందం బీఆర్ఎస్‌కు ఎందుకంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
నియామకాన్ని రద్దు చేసిన సుప్రీం
ప్రొఫెసర్ కోదండరామ్, అమీర్ అలీ ఖాన్‌ను ఎమ్మెల్సీలుగా నియమిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. కాగా ఈ అంశం సుప్రీంకోర్టుకు చేరింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం వారి నియామకాన్ని రద్దు చేసింది. 2023 ఎన్నికలకు ముందు కేసీఆర్(KCR) ప్రభుత్వం దాసోజు శ్రవణ్, సత్యనారాయణను గవర్నర్ కోటాలో ఎంఎల్సీలుగా నియమించింది. వీరి నియామకానికి ఆమోదం కోసం ఫైలును గవర్నర్ తమిళైసై(Tamil Isai) దగ్గరకు పంపారు.
అయితే గవర్నర్ ఎంతకాలమైనా ఫైలుపై సంతకం పెట్టలేదు. అలాగని తిరస్కరించనూలేదు. దాంతో వీళ్ళిద్దరి నియామకంపై గందరగోళం రేగింది. ఇంతలో ఎన్నికలు రావటం, బీఆర్ఎస్ ఓడిపోవటం అందరికీ తెలిసిందే. రేవంత్ ముఖ్యమంత్రి అయిన తర్వాత గవర్నర్ బీఆర్ఎస్ హయాంలో చేసిన నియామకాల ఫైలును తిప్పిపంపారు.
వాళ్ళిద్దరి స్ధానాల్లో రేవంత్ ప్రభుత్వం కోదండరామ్, అమీర్ ను ప్రతిపాదించగా గవర్నర్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. దాంతో వీళ్ళిద్దరు ఎంఎల్సీలుగా ప్రమాణ స్వీకారం కూడా చేసేశారు. గవర్నర్ చర్యను ప్రశ్నిస్తు దాసోజు, సత్యనారాయాణ సుప్రింకోర్టులో సవాలు చేశారు. అప్పటినుండి అనేకసార్లు వాయిదాలుపడిన ఈ కేసులో సుప్రింకోర్టు 13 ఆగస్టున జరిపిన విచారణలో వారి నియామకాలను రద్దు చేస్తూ ఉత్తర్వలు జారీ చేసింది. ఇది ప్రభుత్వంతో పాటు పార్టీలో సంచలనంగా మారింది.