
వైఎస్ తో ఓ జ్ఞాపకం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా చేనేత దినోత్సవ వ్యవస్థాపకుడు యర్రమాద వెంకన్న నివాళి
ఈ రోజు (జూలై 8) డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జన్మదినం. ఈ సందర్భంగా ఆయనతో నాకు ఉన్న ఒక చిరస్మరణీయమైన జ్ఞాపకాన్ని గుర్తు చేసుకుంటున్నాను.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో అనేకసార్లు చేనేత సమస్యలపై ఆయనను కలిసే అవకాశం నాకు దక్కింది. ప్రతి సారి కూడా ఆయన స్పందన ఎంతో మనసైనది, సానుకూలతతో కూడినది. సామాన్యునికైనా ముఖ్యమంత్రిని కలవాలన్న ఆశ ఉంటే – అది వైఎస్ హయాంలో సాకారమైంది.
2008లో చేనేత కార్మికులపై ఉన్న రుణభారం (రూ.312 కోట్లు) ను మాఫీ చేయించిన ఘనత వైఎస్ గారిదే. ఈ విషయమై ఎన్నోసార్లు ఆయన్ను కలసి విన్నవించిన సందర్భాలు ఉన్నాయి. ఆయన చూపిన స్పందన, తీసుకున్న నిర్ణయం – నేటికీ చేనేత రంగాన్ని ఆదుకున్న చారిత్రక చర్యగా నిలిచిపోయింది.
ఇంకా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందంటే – నా విజ్ఞప్తి మేరకు 2008, ఆగస్టు 7న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున చేనేత దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం ఆయన తీసుకున్న గొప్ప నిర్ణయం. ఇదే ఆచారం దేశవ్యాప్తంగా విస్తరించి, 2015లో జాతీయ చేనేత దినోత్సవంగా మారింది. అంటే, ఈ ఉద్యమానికి బలమైన పునాది వేసింది వైఎస్ గారే. ఆయన లేకపోయి ఉంటే, ఈ దినోత్సవానికి ఈ స్థాయిలో గుర్తింపు దక్కేది కాదు.
చేనేత వస్త్రాలు ఎందుకు వాడాలో ప్రజలందరికీ తెలియజేయాలనే ఆలోచనతో నేను 2006లో 18 పాయింట్లను చేనేత వస్త్రం పై ముద్రించి ప్రతి ప్రభుత్వ ఆఫీసులో పెట్టాలని సంకల్పించినప్పుడు అప్పటి ఆప్కో ఎండి కోటేశ్వరరావు అన్ని రకాలుగా నాకు సహకరించారు. ఆ పోస్టర్ ఆవిష్కరణ 19 సంవత్సరాల క్రితం సరిగ్గా ఇదే రోజు ఆయన జన్మదిన సందర్భంగా ఆయన కార్యాలయంలో ఆవిష్కరించడం జరిగింది.
"Untold story of handloom day " అనే రచనను రూపొందిస్తున్న సమయంలో ఆయన చేసిన ఈ మేలు మరలా గుర్తొచ్చింది. జన్మలో మర్చిపోలేనిది.
-యర్రమాద వెంకన్న నేత
వ్యవస్థాపకులు, చేనేత దినోత్సవం
Next Story