తెలంగాణలో చెరువులు చిన్నాభిన్నం, వరదలతో భారీనష్టం
తెలంగాణలో మూడు రోజులుగా కురుస్తున్న భారీవర్షాలతో కోట్లరూపాయల మేర ఆస్తి నష్టం సంభవించింది. చెరువులు,జాతీయ రహదారులు, వంతెనలు కొట్టుకుపోయాయి. వరద విపత్తు నష్టంపై..
తెలంగాణ రాష్ట్రంలో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీవర్షాలతో కోట్ల రూపాయల మేర ఆస్తి నష్టం సంభవించింది. భారీవర్షాలు, వరదల వల్ల విద్యుత్ స్తంభాలు, విద్యుత్ స్టేషన్లు, జాతీయ రహదారులు, వంతెనలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
- మహబూబాబాద్, వరంగల్ జిల్లాలో 45 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవడంతో వరదలు వెల్లువెత్తాయి. కేసముద్రం వద్ద రైల్వే ట్రాక్ తెగిపోయి రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి.భారీవర్షాలు, వరదలతో పలు గ్రామాలు చిన్నాభిన్నం అయింది.
- నిజామాబాద్ జిల్లా జాతీయ రహదారి ఎన్ఎచ్ 44పై ఉన్న వంతెన కొట్టుకుపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలు రోడ్లపై ఉన్న కల్వర్టులు వరదనీటిలో కొట్టుకుపోయాయి.ఖమ్మం-మహబూబాబాద్- వరంగల్ మార్గంలో రైల్వే ట్రాక్ కొట్టుకు పోవడంతో రైల్వే అధికారులు ట్రాక్ పునరుద్ధరణ పనులు చేపట్టారు.
చెరువులు తెగిపోవడంతో రూ.850 కోట్ల నష్టం
వరదల వల్ల చెరువులు తెగిపోవడంతో రూ.850 కోట్ల మేర నష్టం వాటిల్లిందని నీటిపారుదల శాఖ అధికారులు అంచనా వేశారు.తెగిపోయిన చెరువుల తాత్కాలిక మరమ్మతుల కోసం రూ.221 కోట్లు కావాలని, చెరువుల శాశ్వత మరమ్మతులకు రూ.629 కోట్లు కావాలని ఇంజినీరింగ్ అధికారులు అంచనాలు రూపొందించారు.తెలంగాణలో 98 చెరువులు, బండ్స్, స్లూయిస్ లు, కాల్వలు తెగిపోయాయి.23 మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా వరదల వల్ల స్వల్పంగా దెబ్బతిన్నాయిన తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారి ఒకరు చెప్పారు.
వరదలకు ఏడుగురు మృతి
మహబూబాబాద్ జిల్లాలో కురిసిన కుండపోత వర్షాల వల్ల చెరువులు తెగిపోయాయి.క్లౌడ్ బరస్ట్ కావడంతో వరంగల్, జనగామ, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో భారీవర్షాలకు పలు గ్రామాలు వరదనీటిలో మునిగిపోయాయి. పలు రోడ్లు తెగిపోయాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏడుగురు మరణించగా, మరో ముగ్గురు గల్లంతయ్యారు.
వరదపీడిత ప్రాంతాల్లో రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు
వరదపీడిత ప్రాంతాల్లో తొమ్మిదిఎన్డీఆర్ఎఫ్ బృందాలను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రంగంలోకి దించారు. సీఎం రేవంత్ రెడ్డి వినతిపై కేంద్ర ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపించారు.వరదపీడిత ప్రాంతాల్లో నేషనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ బృందాలను మోహరించారు. లక్షలాది ఎకరాల్లో పంటలు వరదనీటితో దెబ్బతిన్నాయి. ఎకరానికి పంట నష్టపోయిన రైతులకు రూ.10వేల చొప్పున సాయం అందించాలని సీఎం అధికారులకు సూచించారు. విశాఖపట్టణం, బెంగళూరులోని ఇండియన్ నేవీ నుంచి హెలికాప్టర్లను వరద ప్రభావిత ప్రాంతాలకు రప్పించారు. వరదలు వెల్లువెత్తిన ఖమ్మం, మహబూబాబాద్, నల్గొండ, వరంగల్ జిల్లాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయ, పునరావాస చర్యలు చేపట్టాయి.
ఎక్స్ గ్రేషియా పెంపు
వరదల్లో మరణించిన వారి కుటుంబాలకు ఇచ్చే ఆర్థిక సాయాన్ని పెంచుతూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. మృతుల కుటుంబాలకు ఇచ్చే ఆర్థిక సాయాన్ని రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచారు.పాడి గేదెలు మరణిస్తే రైతులకు ఇచ్చే సాయాన్ని రూ.30వేల నుంచి రూ.50వేలకు పెంచతున్నట్లు సీఎం చెప్పారు. మేకలు, గొర్రెలు మరణిస్తే రూ.5వేల సాయం అందించాలని సీఎం ఆదేశించారు.వరదల వల్ల అల్లాడిన ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లా కలెక్టర్లకు ఒక్కొక్కరికి రూ.5 కోట్లు విడుదల చేయాలని సీఎం ఆదేశించారు.వరదల వల్ల ఇళ్లు కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తామని సీఎం ప్రకటించారు.
సాయం కోసం సీఎం కేంద్రానికి లేఖ
భారీవర్షాలు, వరదల వల్ల తీవ్రంగా నష్టపోయిన తెలంగాణ రాష్ట్రానికి సాయం అందించాలని కోరుతూ సీఎం ఎ రేవంత్ రెడ్డి కేంద్రానికి లేఖ రాశారు. వరదల వల్ల పంటలు దెబ్బతిన్నాయని, వ్యవసాయ శాఖ అధికారులు పంటనష్టంపై అంచనాలు రూపొందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. సీఎం ఎ రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, అధికారులు వరద సహాయక చర్యలు చేపట్టారు. తెలంగాణలో వచ్చిన వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించి సాయం అందించాలని సీఎం ప్రధాని మోదీని అభ్యర్థించారు. ఈ మేర కేంద్రానికి, ప్రధానికి సీఎం లేఖ రాశారు. వరద సాయం కింద రూ.5వేల కోట్లు ఇవ్వాలని, తక్షణ సాయంగా 2వేలకోట్ల రూపాయలు కేటాయించాలని సీఎం కోరారు.
Next Story