ఆ క్యాంప్ ఆఫీసులో రేవంత్ కాలు మోపడా!
అదో రాజభవనం. సాక్షాత్తు ముఖ్యమంత్రులు ఉన్న రాజప్రసాదాలు.. అయినా సరే ఈ సీఎం ఆవైపు చూడడం లేదు.. ఎందుకంటారు
రాష్ట్ర పాలనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పట్టుబిగిస్తున్నారు. ఒక్కో అంశంపై స్పష్టత తెచ్చుకోవడంతో పాటు క్లారిటీ ఇస్తున్నారు. మరోపక్క, అందరితో కలివిడిగా ఉంటూనే లెక్కలూ సరి చేస్తున్నారు. ఎవర్ని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతూ ముందుకుసాగుతున్నారు. కొత్త సంవత్సరం సందర్భంగా రేవంత్ ఇచ్చిన సందేశం ఇదే.
ఎవరిపైనా కక్ష సాధింపు ఉండదు...
రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరిపైనా కక్ష సాధింపు చర్యలు చేపట్టబోదని సీఎం రేవంత్ రెడ్డి తేల్చిచెప్పారు. అయితే తనతో పాటు కష్టపడలేని వారు వెళ్లిపోవచ్చునని కూడా చెప్పకనే చెప్పారు. మీడియాతో చిట్‌చాట్‌లో హైదరాబాద్ అభివృద్ధిపై సర్కార్ ఆలోచనలను పంచుకున్నారు. 'గత ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన అంశాలను రద్దు చేయకుండా మార్పులు చేర్పులు మాత్రమే చేస్తాం. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సర్కార్ ప్రకటించిన మెట్రో, ఫార్మాసిటీ రద్దు చెయ్యడం లేదు. వాటిని స్ట్రీమ్ లైన్ మాత్రమే చేస్తున్నాం' అన్నారు సీఎం రేవంత్ రెడ్డి.
స్టేట్ గెస్ట్ హౌస్‌గా సీఎం క్యాంప్ ఆఫీసు...
హైదరాబాద్ బేగంపేటలోని సీఎం క్యాంపు కార్యాలయం స్టేట్ గెస్ట్ హౌస్‌గా మారనుంది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రగతిభవన్‌గా ఉన్న సీఎం క్యాంప్ కార్యాలయం కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత మహాత్మాజ్యోతిభా పూలే ప్రజాభవన్‌గా మారింది. ఇకపై అది స్టేట్ గెస్ట్ హౌస్‌గా ఉండనుంది. రాష్ట్రంలో స్కిల్ పాలసీ కమిటీ ఏర్పాటు అవుతుంది. 10 నుంచి 15 స్కిల్ యూనివర్సిటీలు నెలకొల్పుతాం. ఫార్మాసిటీని అంచెలంచలుగా రీజినల్ రింగురోడ్డు వరకు విస్తరిస్తారు. ఔటర్ రింగ్ రోడ్, రీజినల్ రింగ్ రోడ్ మధ్య ప్రత్యేకంగా జీరో కాలుష్యంతో ఫార్మాసిటీ క్లస్టర్లు ఏర్పాటు చేస్తారు. మొత్తం పది ఫార్మా విలేజెస్ అభివృద్ధి అవుతాయి.
వంద పడకల ఆస్పత్రి ఉంటే నర్సింగ్ కళాశాల...
'వంద పడకల ఆస్పత్రి ఉన్న చోట నర్సింగ్ కళాశాల ఏర్పాటవుతుంది. ప్రతి మండలంలో అంతర్జాతీయ పాఠశాల నిర్మాణం జరుగుతుంది. విదేశాలకు వెళ్లే యువతకు ఓరియెంటేషన్ ఇప్పిస్తాం' అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అంటే రాష్ట్రంలో పెద్ద ఎత్తున నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట వేస్తామనేది లక్ష్యమై ఉంటుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు కాంగ్రెస్ కట్టుబడి ఉన్నట్టు అర్థమవుతోంది.