HMDA|చెరువుల దత్తత పేరుతో దొంగచేతికే తాళాలు ఇస్తున్నారా ?
చెరువులను సంరక్షిస్తాము, అభివృద్ధిచేస్తామని సీఎస్ఆర్ పథకంలో తీసుకున్న చెరువులను కొన్ని కంపెనీలు నామరూపాలు లేకుండా చేసేసి వెంచర్లు వేసేశాయి.
చెరువుల దత్తత పేరుతో మరోసారి దొంగచేతికే తాళాలు ఇవ్వటానికి తెలంగాణా ప్రభుత్వం రంగం సిద్ధంచేసిందా ? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. గతంలో కొన్ని చెరువులను జీహెచ్ఎంసీ(GHMC) దత్తత పేరుతో కొన్ని కంపెనీలకు కట్టబెట్టింది. అప్పట్లోనే కంపెనీల నిర్వాకాలపై బాగా ఆరోపణలు, విమర్శలు వచ్చాయి. దాంతో ఈసారి జీహెచ్ఎంసీ కాకుండా హెచ్ఎండీఏని ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. అంటే చెరువులను కంపెనీలకు దత్తత ఇచ్చేసి వాటి నిర్వహణ బాధ్యతలనుండి ప్రభుత్వం పక్కకు తప్పుకోవటమన్నమాట. చెరువుల దత్తత కార్యక్రమానికి ప్రభుత్వం సీఎస్ఆర్(CSR) పద్దతిలో రెడీచేస్తున్నది. సీఎస్ఆర్ అంటే కార్పొరేట్ సోషల్ రెస్సాన్సుబులిటి. ప్రతి కంపెనీ కూడా సామాజిక బాధ్యతతో మెలగాలన్నది ప్రభుత్వం ఆలోచన. ప్రభుత్వ ఆలోచన కారణంగా కొన్ని కంపెనీలు పార్కులను దత్తత తీసుకుని డెవలప్ చేశాయి. మరికొన్ని కంపెనీలు కొన్ని స్కూళ్ళని దత్తత తీసుకుని మౌళిక సదుపాయాలను కల్పించేపనిలో పడ్డాయి.
అలాగే మరికొన్ని కంపెనీలు మారుమూల ఉన్న గ్రామాల్లో మౌళిక సదుపాయాల కల్పనపై దృష్టిపెట్టాయి. పై కంపెనీల దత్తత తీసుకున్న విషయంలో ఎలాంటి వివాదాలు లేకపోయినా చెరువులను దత్తత తీసుకున్న కంపెనీల విషయం మాత్రం బాగా వివాదాస్పదమయ్యింది. కారణం ఏమిటంటే చెరువులను దత్తత తీసుకున్న కంపెనీలన్నీ రియల్ ఎస్టేట్ కంపెనీలే. జలవనరులు అయిన చెరువులు, కుంటలు, కాల్వలను ఆక్రమించేసి రియల్ వెంచర్లను వేస్తున్న రియల్ ఎస్టేట్ కంపెనీలకే చెరువులను దత్తత ఇస్తే అవి ఊరుకుంటాయా ? చెరువుల దత్తత పేరుతో మొత్తం చెరువులనే నామరూపాలు లేకుండా చేసేశాయి. అంటే చెరువులను రక్షించి, అభివృద్ధి చేయాల్సిన కంపెనీలే చెరువులను భక్షించేసి జీర్ణంచేసేసుకున్నాయి. అందుకనే దొంగచేతులకే తాళాలా అన్నది.
తనపరిధిలో ఉన్న జలవనరుల్లో 41 చెరువులను సీఎస్ఆర్ పథకంలో రియల్ ఎస్టేట్ కంపెనీలకు జీహెచ్ఎంసీ దత్తత ఇచ్చింది. చెరువులను సంరక్షిస్తాము, అభివృద్ధిచేస్తామని సీఎస్ఆర్ పథకంలో తీసుకున్న చెరువులను కొన్ని కంపెనీలు నామరూపాలు లేకుండా చేసేసి వెంచర్లు వేసేశాయి. రంగలాల్ కుంట చెరువును జీహెచ్ఎంసీ విర్టూసా అనే కార్పొరేట్ కంపెనీకి ఇచ్చింది. చెరువును కంపెనీ దత్తత తీసుకున్న తర్వాత కొంతకాలానికి చెరువులో చాలా భాగం కబ్జా అయిపోయింది. గచ్చిబౌలి(Gachibowli) ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోని ఉన్న ఈ రంగలాల్ కుంట చెరువు, ఎఫ్టీఎల్, బఫర్ జోన్ లో నిర్మించిన నిర్మాణాలను తొలగించాలని ఈమధ్యనే హైడ్రా నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. శేరిలింగంపల్లిలోని మంగలిచెరువు, టమాటా చెరువులు కూడా ఇలానే కబ్జాకు గురయ్యాయి. భగీరథమ్మ చెరువును సీఎస్ఆర్ పథకంలో మీనాక్షి ఇన్ఫ్రా తీసుకున్నది. ఖాజాగూడ చెరువు దివ్యశ్రీ సంస్ధ తీసుకున్నది. ఈ రెండు చెరువులు కూడా కబ్జాకు గురైనట్లు హైడ్రా సర్వేలో తేలింది. ఇలా ఏదో రూపంలో జీహెచ్ఎంసీ దత్తత ఇచ్చిన 41 చెరువుల్లో చాలావరకు కబ్జాకు గురయ్యాయి.
చెరువులను సంరక్షిస్తామని, అభివృద్ధిచేస్తామని సీఎస్ఆర్ పథకంలో కంపెనీలు తీసుకున్న చెరువులు కబ్జాకు గురైనట్లు తేలినా జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోలేదు. ఉన్నతాధికారులు చెరువుల కబ్జాను ఎందుకు పట్టించుకోలేదు అందరికీ తెలిసిందే. హైడ్రా ఏర్పడిన తర్వాత జీహెచ్ఎంసీ దత్తత ఇచ్చిన 41 చెరువుల వాస్తవ స్వరూపం ఏమిటి ? ఇప్పటి పరిస్ధితి ఏమిటనే విషయంలో సర్వేలు చేస్తోంది. దీనిసంగతి ఇలాగుంటే కొత్తగా హెచ్ఎండీఏ(HMDA) కూడా సీఎస్ఆర్ పద్దతిలో 100 చెరువులను కంపెనీలకు దత్తత ఇవ్వాలని డిసైడ్ చేసిందనే సమాచారం. చెరువులను సీఎస్ఆర్ పద్దతిలో దత్తత ఇవ్వటానికి ఎవరూ అభ్యంతరం చెప్పటంలేదు. కాకపోతే చెరువులను కాపాడి, అభివృద్ధి చేసే బాధ్యతలను రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఇవ్వవద్దని మాత్రమే అంటున్నారు. నగరంలోని పెద్దపెద్ద రియల్ కంపెనీల వెనుక రాజకీయ ప్రముఖులే అండదండలు అందిస్తున్నారనే ఆరోపణలకు కొదవలేదు. దీని కారణంగానే అధికారులు కూడా అనుమతులు ఇచ్చేవిషయంలో కచ్చితంగా ఉండలేకపోతున్నారు.
అందుకనే చెరువులు, కాల్వలు, కుంటల కబ్జా యధేచ్చగా జరిగిపోతోంది. ఏ రియల్ సంస్ధ, బిల్డర్ మీద చర్యలు తీసుకోవాలని అనుకున్నా వెంటనే రాజకీయపరమైన ఒత్తిళ్ళు మొదలైపోతున్నాయి. అందుకనే అధికారులు కూడా తమకు ఎందుకులే అని చూసీచూడనట్లు వదిలేస్తున్నారు. దాంతో కబ్జాలు పెరిగిపోయి జలవనరులే కనబడకుండా పోతున్నాయి. జలవనరులను సంరిక్షించాలనే చిత్తశుద్ది నిజంగానే ప్రభుత్వానికి ఉంటే ముందు రాజకీయ అవినీతిని కంట్రోల్ చేయాలి. ఈపని చేస్తే ఆటోమేటిగ్గా అధికార వ్యవస్ధలో అవినీతి కంట్రోల్ అవుతుంది. రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్ గిరి జిల్లాల పరిధిలో తాను దత్తతఇవ్వాలని అనుకుంటున్న 100 చెరువుల్లో 11 చెరువులను ఇప్పటికే హెచ్ఎండీఏ డిసైడ్ చేసినట్లు తెలుస్తోంది.
హెచ్ఎండీఏ దత్తత ఇవ్వబోతున్న చెరువుల్లో 226 ఎకరాల్లో చిట్యాల చెరువు, 453 ఎకరాల్లో అమీన్ పూర్ చెరువు, పాలమాకులోని 467 ఎకరాల్లో మైసమ్మ చెరువు, 187 ఎకరాల్లో ఇస్నాపూర్ చెరువు, 97 ఎకరాల్లో నెక్నంపూర్ లోని ఇబ్రహీం చెరువు, 72 ఎకరాల్లో కోకాపేట చెరువు, 69 ఎకరాల్లో పెద్ద కంజర్లలోని నేరేడు చెరువు, 52 ఎకరాల్లో ఉన్న నార్సింగిలోని ముస్కి చెరువు ఉన్నట్లు సమాచారం. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే సంరక్షణ, అభివృద్ధి పేరుతో హెచ్ఎండీఏ చెరువులను సీఎస్ఆర్ పద్దతిలో దత్తత ఇవ్వటాన్ని హైడ్రా అభ్యంతరం చెప్పిందని తెలిసింది. చెరువుల దత్తతను రియల్ ఎస్టేట్ కంపెనీలకు కాకుండా ఐటి కంపెనీలు, పబ్లిక్ సెక్టార్ కంపెనీలకు ఇవ్వాలని కూడా హెచ్ఎండీఏకి హైడ్రా సూచించినట్లు సమాచారం. లేక్ ప్రొటెక్షన్ కమిటీకి ఛైర్మన్ హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాధ్. మరి సీఎస్ఆర్ పద్దతిలో చెరువుల దత్తతకు ఇచ్చే విషయంలో హైడ్రా(Hydra) కమిషనర్ చెప్పినట్లు హెచ్ఎండీఏ ఉన్నతాధికారులు వింటారా ? అన్నది ఆసక్తిగా మారింది.
ఇదే విషయమై జలవనరుల సంరక్షణపై పోరాటాలు చేస్తున్న డాక్టర్ లుబ్నా సార్వత్(Dr Lubna Sarwat) తెలంగాణా ఫెడరల్ తో మాట్లడాతు రియల్ ఎస్టేట్ కంపెనీలకే చెరువులను దత్తత ఇవ్వటం అంటే దొంగచేతులకే తాళాలు ఇవ్వటమన్నారు. చెరువుల దత్తత పథకాన్ని హెచ్ఎండీఏ రెడీ చేసిన విషయంపై తనకు సమాచారం లేదన్నారు. గతంలో జీహెచ్ఎంసీ చెరువులను దత్తత ఇచ్చినపుడు చాలా సమస్యలు వచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. హెచ్ఎండీఏ ఇవ్వబోయే చెరువుల దత్తతపై ప్రభుత్వం జీవో జారీచేయకుండా తాను ఏమీ మాట్లాడనని కూడా లుబ్నా సార్వత్ చెప్పారు.