ఈ ఎంఎల్ఏకి డిమాండ్ పెరిగిపోతోందా ?
x
Minister Jupalli with defected BRS MLA Bandla

ఈ ఎంఎల్ఏకి డిమాండ్ పెరిగిపోతోందా ?

ఇటు అధికారపార్టీ అటు ప్రధాన ప్రతిపక్షంలోని ఎంఎల్ఏలు ఈ ఎంఎల్ఏతో భేటీ కోసం పోటీలు పడుతుండటంతో డిమాండ్ బాగా పెరిగిపోతోంది.


ఈ ఎంఎల్ఏకి డిమాండ్ ఫుల్లుగా పెరిగిపోతోంది. ఒకరోజు బీఆర్ఎస్ ఎంఎల్ఏలు భేటీ అవుతుంటే మరోరోజు మంత్రులు, కాంగ్రెస్ ఎంఎల్ఏలు సమావేశమవుతున్నారు. ఇటు అధికారపార్టీ అటు ప్రధాన ప్రతిపక్షంలోని ఎంఎల్ఏలు ఈ ఎంఎల్ఏతో భేటీ కోసం పోటీలు పడుతుండటంతో డిమాండ్ బాగా పెరిగిపోతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే గడచిన మూడురోజులుగా బీఆర్ఎస్ ఫిరాయింపు ఎంఎల్ఏ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కేంద్రబిందువుగా మారిపోయారు. మొన్నటి ఎన్నికల్లో మహబూబ్ నగర్ జిల్లా గద్వాల నియోజకవర్గంలో బండ్ల బీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీచేసి గెలిచారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఐదు నెలలకే బీఆర్ఎస్ లో నుండి కాంగ్రెస్ లోకి ఫిరాయించారు.

కాంగ్రెస్ లోకి బండ్ల ఫిరాయించి మూడు వారాలైంది. కాంగ్రెస్ లోకి ఫిరాయించిన మూడు వారాల్లోనే ఏమైందో ఏమో మూడు రోజుల క్రితం తిరిగి బీఆర్ఎస్ లోకి వెళిపోయారు. తాను కాంగ్రెస్ లోనుండి తిరిగి కారుపార్టీలోకి వెళిపోతున్నట్లుగా బండ్ల ఎక్కడా ప్రకటించలేదు. అయితే కాంగ్రెస్ లోకి ఫిరాయించిన బండ్ల సడెన్ గా మూడురోజుల క్రితం అసెంబ్లీలోని బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు. బీఆర్ఎస్ ఎల్పీ ఆఫీసులో కేటీఆర్ తో చాలాసేపు భేటీ అయ్యారు. అప్పటినుండి మంత్రులు, కాంగ్రెస్ ఎంఎల్ఏలకి దూరంగా ఉంటున్నారు. దాంతో బండ్ల కాంగ్రెస్ కు దూరమై తిరిగి బీఆర్ఎస్ లోకి వెళిపోయినట్లు అందరు నిర్ధారణకు వచ్చేశారు.

బండ్ల మార్గంలోనే మరో ఇద్దరు ఫిరాయింపు ఎంఎల్ఏలు తెల్లం వెంకటరావు, కాలే యాదయ్య కూడా తిరిగి బీఆర్ఎస్ లోకి వెళిపోతున్నారనే ప్రచారం బాగా పెరిగిపోతోంది. ఈ నేపధ్యంలోనే సడెన్ డెవలెప్మెంట్ జరిగింది. అదేమిటంటే గురువారం ఉదయం బండ్లతో మంత్రి జూపల్లి కృష్ణారావు భేటీ అయ్యారు. వాళ్ళిద్దరి మధ్య ఏమి చర్చలు జరిగింది సరిగ్గా తెలీదు. అయితే భేటీ తర్వాత బండ్ల మీడియాతో మాట్లాడుతు తాను కాంగ్రెస్ లోనే కంటిన్యు అవుతానని ప్రకటించారు. వీళ్ళ భేటీ సందర్భంగానే మంత్రి ఫోన్ చేసి రేవంత్ రెడ్డితో ఎంఎల్ఏ బండ్లను మాట్లాడించినట్లు పార్టీవర్గాల సమాచారం. రేవంత్ ఇచ్చిన హామీలతో ఫిరాయింపు ఎంఎల్ఏ హ్యాపీ అయినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాల తర్వాత రేవంత్ అమెరికా పర్యటనకు వెళుతున్నారు. తిరిగి రాగానే సమావేశమవుతానని బండ్లతో రేవంత్ చెప్పినట్లుగా పార్టీవర్గాలు చెప్పాయి.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే బీఆర్ఎస్ తరపున గెలిచిన బండ్ల ఎందుకు కాంగ్రెస్ లోకి ఫిరాయించారో తెలీదు. కాంగ్రెస్ లోకి ఫిరాయించిన బండ్ల మూడు వారాల్లోనే తిరిగి బీఆర్ఎస్ లోకి ఎందుకు వెళిపోయారో అంతుబట్టడంలేదు. ఇపుడు మంత్రి జూపల్లి భేటీ అవగానే తాను కాంగ్రెస్ లోనే కంటిన్యు అవుతానని ఎందుకు ప్రకటించారో అర్ధంకావటంలేదు. పార్టీ ఫిరాయించే ఎంఎల్ఏలు అందరు వ్యక్తిగత, ఆర్ధిక, రాజకీయ ప్రయోజనాల కోసమే ఫిరాయిస్తారన్న విషయం తెలిసిందే. కేసీయార్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఫిరాయించిన టీడీపీ, కాంగ్రెస్ ఎంఎల్ఏలు ఫిరాయించినా, ఇపుడు బీఆర్ఎస్ లో నుండి కాంగ్రెస్ లోకి ఫిరాయించిన ఎంఎల్ఏలైనా అదే పద్దతి అనటంలో సందేహాలు అవసరంలేదు. నియోజకవర్గాల అభివృద్ధి, అభివృద్ధికి నిధులు అన్నది ఫిరాయింపులు చెప్పే పడికట్టు పదాలు మాత్రమే అని అందరికీ తెలుసు. మరి తాజా డెవలప్మెంట్లతో బీఆర్ఎస్ ఎంఎల్ఏలు ఏమిచేస్తారో చూడాలి.

Read More
Next Story